విద్యార్థులకు ముస్తాబు కిట్లు
ABN , Publish Date - Dec 29 , 2025 | 11:46 PM
విద్యార్థులకు ముస్తాబు కిట్లు
కలెక్టర్ రాజకుమారి
నంద్యాల నూనెపల్లి, డిసెంబరు 29 (ఆంధ్రజ్యోతి): నూతన సంవత్సరాన్ని పురస్కరించుకుని జిల్లాలోని 155 వసతి గృహాల్లోని విద్యార్థులకు ముస్తాబు కిట్లు అందజేస్తున్నట్లు కలెక్టర్ రాజకుమారి తెలిపారు. సోమవారం ఆమె కలెక్టరేట్‌లోని పీజీఆర్‌ఎస్ హాల్‌లో అధికారులతో సమీక్ష నిర్వహించారు. కలెక్టర్ మాట్లాడుతూ.. కలెక్టర్, జాయింట్ కలెక్టర్‌కు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపేందుకు వచ్చే జిల్లా అధికారులు బొకేలు, కేకులు, శాలువాలు తీసుకురావద్దని సూచించారు. వాటికి ప్రత్యామ్నాయంగా విద్యార్థుల పరిశుభ్రతను దృష్టిలో ఉంచుకొని ప్రభుత్వం ప్రతి పాఠశాల, వసతి గృహాల్లో ముస్తాబు కార్నర్ ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. విద్యార్థులకు ఇచ్చే ముస్తాబు కిట్లలో అద్దం, దువ్వెన, నెయిల్ కట్టర్, హ్యాండ్‌వాష్, శానిటైజర్ వంటి అవసరమైన వస్తువులు ఉండేలా చూడాలన్నారు.
రేపే పింఛన్ల పంపిణీ : పింఛన్ల పంపిణీ బుధవారం రోజే వందశాతం పూర్తి చేయాలని కలెక్టర్ రాజకుమారి సూచించారు. పట్టణంలోని కలెక్టరేట్‌లోని వీడియో కాన్ఫరెన్స్ హాల్‌లో సోమవారం పలు అంశాలపై ఆర్డీవోలు, తహసీల్దార్లు, ఎంపీడీవోలతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్ష నిర్వహించారు.
రెవెన్యూ క్లినిక్‌తో న్యాయం : జిల్లాలో రెవెన్యూ సంబంధిత సమస్యలకు వేగవంతమైన పరిష్కారం అందించాలనే లక్ష్యంతో రెవెన్యూ యంత్రాంగం ఆధ్వర్యంలో కలెక్టరేట్ ఆవరణలో ఏర్పాటు చేసిన ఏడు రెవెన్యూ క్లినిక్స్ ద్వారా ప్రజల నుంచి మొత్తం 373 దరఖాస్తులు స్వీకరించామని కలెక్టర్ రాజకుమారి తెలిపారు. సోమవారం ఆమె మాట్లాడుతూ.. ప్రజల నుంచి స్వీకరించిన ప్రతి దరఖాస్తును సంబంధిత రెవెన్యూ డెస్క్‌లలో నమోదు చేసి త్వరితగతిన పరిష్కరించేలా అధికారులకు ఆదేశాలు జారీ చేసినట్లు వెల్లడించారు. కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్ కార్తీక్, డీఆర్వో రామునాయక్, రెవెన్యూ డివిజన్ అధికారులు, స్పెషల్ డిప్యూటీ కలెక్టర్లు, అన్నీ మండలాల తహసీల్దార్లు తదితరులు పాల్గొన్నారు.