Share News

క్షణికావేశంలో ఇనుపరాడ్డుతో కొట్టి హత్య

ABN , Publish Date - May 18 , 2025 | 12:14 AM

మద్యం సేవించి క్షణికావేశంలో ఇనుపరాడ్డుతో కొట్టి గువ్వల రాజును హత్యచేసినట్లు సీఐ కిరణ్‌కుమార్‌రెడ్డి తెలిపారు. పాణ్యం సర్కిల్‌ పరిధిలోని గడివేములలో ఇటీవలే జరిగిన హత్య కేసులో నిందితులను అరెస్టుచేశారు

క్షణికావేశంలో ఇనుపరాడ్డుతో కొట్టి హత్య
మాట్లాడుతున్న సీఐ కిరణ్‌కుమార్‌ రెడ్డి

ఆనవాళ్లు లేకుండా యాసిడ్‌ పోసి శవం కాల్చివేత

ఎముకలను దంచి పొడిచేసి పెట్రోల్‌ పోసి దహనం

గువ్వల రాజు హత్య కేసులో నిందితుల అరెస్టు

ద్విచక్రవాహనాలు, సెల్‌ఫోన్లు, ఇనుపరాడు స్వాధీనం

పాణ్యం సీఐ కిరణ్‌కుమార్‌ రెడ్డి

కేసును ఛేదించిన పోలీసులకు అభినందనలు

పాణ్యం, మే 17 (ఆంధ్రజ్యోతి): మద్యం సేవించి క్షణికావేశంలో ఇనుపరాడ్డుతో కొట్టి గువ్వల రాజును హత్యచేసినట్లు సీఐ కిరణ్‌కుమార్‌రెడ్డి తెలిపారు. పాణ్యం సర్కిల్‌ పరిధిలోని గడివేములలో ఇటీవలే జరిగిన హత్య కేసులో నిందితులను అరెస్టుచేశారు. శనివారం సర్కిల్‌ కార్యాలయంలో ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశంలో నిందితులను హాజరు పరిచి సీఐ వివరాలు వెల్లడించారు. ఈనెల 9వ తేదీన గడివేములకి చెందిన గువ్వల జనార్దన్‌ తన తమ్ముడు గువ్వల రాజు 14రోజుల నుంచి కనబడటం లేదని గడివేముల పోలీసుస్టేషన్‌లో ఫిర్యాదుచేశాడు. ఈ మేరకు కేసు నమోదు చేశారు. 10వ తేదీన గ్రామ పొలిమేరలోని అబ్దుల్‌రహిమాన్‌ పొలంలో గుర్తుతెలియని ఎముకలు ఉన్నాయని వీఆర్వో ఇచ్చిన సమాచారం మేరకు పాణ్యం, గడివేముల ఎస్‌ఐలు నరేంద్రకుమార్‌రెడ్డి. నాగార్జున రెడ్డి వెళ్లి పరిశీలించారు. ఎముకలను ఫోరెన్సిక్‌ ల్యాబ్‌కు పంపించారు. అనంతరం గువ్వల రాజుతో పాటు కలిసి తిరిగేవారి వివరాలు సేకరించారు. వీరిలో కె. బొల్లవరం గ్రామానికి చెందిన మేకల మహేంద్ర, బిలకలగూడూరుకు చెందిన కొత్త లోకేశ్‌ గువ్వలరాజును బైక్‌పై అబ్దుల్‌రహీం మొక్కజొన్న పొలం వద్దకు తీసుకెళ్లారు. ముగ్గురు మద్యం సేవించారు. మాటమాట పెరిగి క్షణికావేశంలో మహేంద్ర గువ్వలరాజు తలపై ఇనుపరాడ్డుతో కొట్టాడు. దీంతో అతడు అక్కడికక్కడే మృతిచెందాడు. రాడ్డును సమీప కుందూ వాగులో వేసినట్లు తెలిపారు. ఆ తర్వాత శవాన్ని గుర్తు పట్టకుండా చేయాలనే ఉద్దేశంతో మేకల మహేంద్ర, తన స్నేహితుడు గడివేముల గ్రామానికి చెందిన మానికింది పెద్దరాయుడుతో కలిసి 24వతేదీ, 26న తేదీలలో శవం ఆనవాళ్లు లేకుండా యాసిడ్‌ పోసి కాల్చివేశారు. ఎముకులు ఎరుకొని రాళ్లతో దంచి పొడిచేసి వాటిపై పెట్రోల్‌ పోసి దహనం చేశారన్నారు. బూడిదను దగ్గరలోని కుందూలో వేసినట్లు తెలిపారు. నిందితులను ఈనెల 16వ తేదీన గడివేముల పరిధిలో అరెసుచేసి వారివద్ద నుంచి రెండు మోటారు సైకిళ్లు, ఐదు సెల్‌ఫోన్లు, ఐరన్‌రాడ్డు, చున్ని స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. ఎస్‌ఐ నాగార్జునరెడ్డి, పోలీసుసిబ్బంది పాల్గొన్నారు. ఇదిలా ఉండగా త్వరితగతిన కేసును ఛేదించి నిందితులను అదుపులోకి తీసుకున్న నంద్యాల డీఎస్పీ మందా జావళి, పాణ్యం సీఐ కిరణ్‌ కుమార్‌ రెడ్డి, ఎస్‌ఐలను ఉన్నతాధికారులు అభినందించారు.

Updated Date - May 18 , 2025 | 12:14 AM