Share News

అప్పు తీర్చమని అడిగినందుకే హత్య

ABN , Publish Date - Jul 25 , 2025 | 12:18 AM

అప్పు తీర్చమని అడిగినందుకే అశోక్‌ (37)ను దారుణంగా హత్య చేశారు. పాణ్యం సమీపంలో గోరుకల్లు రస్తాలో ఈ సంఘటన ఈనెల 20వ తేదీన చోటుచేసుకోగా నిందితులను అరెస్ట్‌ చేసినట్లు సీఐ కిరణ్‌కుమార్‌రెడ్డి తెలిపారు. గురువారం పాణ్యం సీఐ కార్యాలయం వద్ద ఏర్పాటుచేసిన విలేకర్ల సమావేశంలో ఆయన వివరాలు వెల్లడించారు

అప్పు తీర్చమని అడిగినందుకే హత్య
వివరాలు వెల్లడిస్తున్న సీఐ కిరణ్‌కుమార్‌రెడ్డి

కంట్లో కారం పొడి మారణాయుధాలతో దాడి

నిందితులు అరెస్ట్‌.. ఇనుపరాడ్లు, సుత్తి, కత్తి స్వాధీనం

పాణ్యం సీఐ కిరణ్‌కుమార్‌

పాణ్యం, జూలై 24 (ఆంధ్రజ్యోతి): అప్పు తీర్చమని అడిగినందుకే అశోక్‌ (37)ను దారుణంగా హత్య చేశారు. పాణ్యం సమీపంలో గోరుకల్లు రస్తాలో ఈ సంఘటన ఈనెల 20వ తేదీన చోటుచేసుకోగా నిందితులను అరెస్ట్‌ చేసినట్లు సీఐ కిరణ్‌కుమార్‌రెడ్డి తెలిపారు. గురువారం పాణ్యం సీఐ కార్యాలయం వద్ద ఏర్పాటుచేసిన విలేకర్ల సమావేశంలో ఆయన వివరాలు వెల్లడించారు. ఆళ్లగడ్డ మండలం, శాంతినగరం గ్రామానికి చెందిన అశోక్‌ వద్ద పాణ్యంకు చెందిన ముసుగు సుబ్బయ్య రూ.48లక్షలు అప్పుగా తీసుకున్నాడు. 26 లక్షలు తీర్చగా మిగిలిన రూ. 22 లక్షలు ఇవ్వమని అశోక్‌ పదేపదే ఒత్తిడి చేశాడు. ఎలాగైనా అప్పు ఎగ్గొట్టాలని సుబ్బయ్య పథకం వేశాడు. 20వ తేదీన అశోక్‌కు ఫోన్‌చేసి పాణ్యంకు పిలిపించాడు. సుబ్బయ్య, అతడి కుమారుడు సురేష్‌లు అతడితో గొడవపడ్డారు. వివాదం పెరగడంతో వారి వద్దఉన్న కారంపొడిని అశోక్‌ కళ్లల్లో చల్లి ఇనుపరాడ్లు, సుత్తితో తల, కడుపు, ఛాతీపై దారుణంగా పొడిచాడు. అతడు అక్కడికక్కడే మరణించాడు. మృతుడి భార్య శృతి ఫిర్యాదు మేరకు సుబ్బయ్య, సురేష్‌, తెలుగుపేటకు చెందిన సల్కాపురం రమేష్‌, నూలుమిల్లు కాలనీకి చెందిన ఎనకండ్ల బాలకృష్ణ, మేకలబండకు చెందిన మండ్ల మణికుమార్‌, గోడలచేలుకు చెందిన అనుపూరు మాబు హుశేన్‌పై హత్యకేసు నమోదుచేసి దర్యాప్తు చేపట్టామన్నారు. సుగాలిమెట్ట సమీపంలోని ఏరాసు ప్రతాపరెడ్డి తోటలో ఉన్న నిందితులను అరెస్టు చేసి వారివద్ద నుంచి రెండు పిడి బాకులు, మచ్చుకత్తి, ఇనుప రాడ్డు, సుత్తి, సెల్‌ఫోన్‌ను స్వాధీనం చేసుకున్నామన్నారు. నిందితులను ఆళ్లగడ్డ జ్యుడిషియల్‌ పస్ట్‌క్లాస్‌ మెజిస్ట్రేట్‌ ఎదుట హాజరుపర్చగా మైనర్లను కర్నూలు జువెనల్‌ కోర్టుకు తరలించినట్లు సీఐ తెలిపారు. సమావేశంలో ఎస్‌ఐ నరేంద్రకుమార్‌ రెడ్డి, పోలీసు సిబ్బంది పాల్గొన్నారు.

Updated Date - Jul 25 , 2025 | 12:18 AM