Share News

కర్నూలు జీజీహెచ్‌లో తల్లి, శిశువు మృతి

ABN , Publish Date - Nov 16 , 2025 | 11:34 PM

తల్లి, నవజాత శిశువు మృతి చెందిన ఘటన కర్నూలు సర్వజన ప్రభుత్వాసుపత్రిలో జరిగింది.

కర్నూలు జీజీహెచ్‌లో తల్లి, శిశువు మృతి
మౌనిక (ఫైల్‌)

ఎమ్మిగనూరు ప్రభుత్వాసుపత్రి వైద్యుల నిర్లక్ష్యమే కారణం

బంధువులు, బీఎస్పీ నాయకుల ఆరోపణ

ఎమ్మిగనూరు టౌన్‌, నవంబరు 16(ఆంధ్రజ్యోతి): తల్లి, నవజాత శిశువు మృతి చెందిన ఘటన కర్నూలు సర్వజన ప్రభుత్వాసుపత్రిలో జరిగింది. నందవరం మండల పరిధిలోని మూగతి గ్రామానికి చెందిన మౌనిక(21)కు పురిటి నొప్పులు రావడంతో కుటుంబ సభ్యులు శనివారం ఎమ్మిగనూరులోని పట్టణంలోని ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకువచ్చారు. వైద్య సిబ్బంది సాధారణ కాన్పు అవుతుందని చెప్పడంతో ఆసుపత్రిలోని ఉండిపోయారు. రాత్రి 7గంటల సమయంలో మౌనిక కడుపులో గాబురగా ఉందని చెప్పడంతో డ్యూటీ డాక్టర్‌ మహాబూబ్‌ భాషా, గైనకాలజిస్ట్‌ డాక్టర్‌ ఫాతిమాను పిలిపించి మౌనికను పరీక్షించారు. పరిస్థితి ఆందోళనకరంగా ఉండడంతో కర్నూలుకు రెఫర్‌ చేశారు. దీంతో మౌనికను కుటుంబ సభ్యులు కర్నూలు ప్రభుత్వ ఆసుపత్రి హుటాహుటిన తీసుకెళ్లారు. అక్కడ పరీక్షించిన వైద్యులు సీజేరియన్‌ చేశారు. అయితే అప్పటికే శిశువు మృతి చెందింది. తల్లి ఆదివారం ఉదయం మృతి చెందింది. అయితే వైద్యుల నిర్లక్ష్యంతోనే మౌనిక మృతి చెందిందని బంధువులు, బీఎస్పీ నాయకులు ఆరోపించారు. ఎమ్మిగనూరు ప్రభుత్వ ఆసుపత్రి సూపరింటెండెంట్‌ డాక్టర్‌ ఆదినాగేష్‌ను వివరణ కోరగా.. గర్భిణి మౌనిక శనివారం మధ్యాహ్నం 3:30గంటల సమయంలో ఆసుపత్రికి వచ్చిందని చెప్పారు. సాధారణ కాన్పు అవుతుందని వేచి చూశామని, అయితే రాత్రి 7గంటల సమయంలో మౌనికకు ఆందోళనకరంగా ఉందని చెప్పడంతో డ్యూటీ డాక్టర్‌, గైనిక్‌తో పరీక్షలు చేశారు. పరిస్థితి సీరియస్‌గా ఉండడంతో మెరుగైన చికిత్సకు కర్నూలుకు రెఫర్‌ చేశామని చెప్పారు. ఇందులో వైద్యుల నిర్లక్ష్యం లేదని అన్నారు.

Updated Date - Nov 16 , 2025 | 11:34 PM