ఎమ్మెల్యే బుడ్డాకు సైక్లోన్ మొంథా ఫైటర్ అవార్డు
ABN , Publish Date - Nov 01 , 2025 | 11:49 PM
శ్రీశైలం ఎమ్మెల్యే బుడ్డా రాజశేఖరరెడ్డికి మొంథా ఫైటర్ అవార్డు వరించింది.
అభినందించిన సీఎం చంద్రబాబునాయుడు
ఆత్మకూరు, నవంబరు 1(ఆంధ్రజ్యోతి): శ్రీశైలం ఎమ్మెల్యే బుడ్డా రాజశేఖరరెడ్డికి మొంథా ఫైటర్ అవార్డు వరించింది. శనివారం అమరావతిలోని ఉండవల్లిలో గల సీఎం క్యాంప్ కార్యాలయంలో సీఎం చంద్రబాబునాయుడు ఆయనకు అవార్డుతో పాటు ప్రశంసా పత్రాన్ని అందజేశారు. తుఫాను నేపథ్యంలో ఎమ్మెల్యే చేసిన కృషిని సీఎం అభినందించారు. గత నెల 28న మొంథా తుఫాన్ వల్ల శ్రీశైలం నియోజకవర్గంలోని అన్ని మండలాల్లో విస్తారంగా వర్షాలు కురిశాయి. జనజీవనం అతలాకుతలమైంది. ఆత్మకూరుతో సహా అనేక గ్రామాల్లో భారీవర్షం కురియడంతో లోతట్టు కాలనీలు జలదిగ్బంధంలో చిక్కుకున్నాయి. ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. వాగులు, వంకలు పొంగి పొర్లడంతో రాకపోకలు స్తంభించిపోయాయి. చేతికొచ్చిన పంటలు దెబ్బతిన్న అన్నదాతలు కుదేలయ్యారు. ఈ పరిస్థితుల్లో ఎమ్మెల్యే బుడ్డా రాజశేఖరరెడ్డి తుఫాన్ తగ్గుముఖం పట్టనప్పటికీ వరద ప్రభావిత గ్రామాలను ఆయనే స్వయంగా సందర్శించి వరద బాధితులను పరామర్శించి వారికి కావాల్సిన సదుపాయాలను కల్పించారు. ఈయన చేసిన కృషిని గుర్తిస్తూ ‘సైక్లోన్ మొంథా పైటర్ అవార్డు’ను సీఎం చంద్రబాబు అందజేశారు. ఆయన చేసిన సేవలను గుర్తించి ప్రభుత్వం అవార్డును ఇవ్వడంపై పలువురు హర్షం వ్యక్తం చేశారు.
అర్బన్ సీఐ రాముకు..
మొంథా తుఫాన్‌లో ఉత్తమ సేవలందించిన ఆత్మకూరు అర్బన్ సీఐ రాముకు శనివారం సీఎం చంద్రబాబు ‘సైక్లోన్ మొంథా ఫైటర్ అవార్డు, ప్రశంసా పత్రాన్ని అందజేశారు. ఆయనకు అవార్డుపై ఎస్పీ సునీల్ షెరాన్, ఆత్మకూరు డీఎస్పీ రామాంజినాయక్‌తో పాటు పలువురు పోలీసు అధికారులు అభినందనలు తెలిపారు. రాయలసీమలోనే అవార్డు అందుకున్న ఏకైక పోలీసు అధికారిగా సీఐ రాము ప్రత్యేకతను సంపాదించుకున్నారు.