హత్యకేసులోగుంతకల్లు ఎమ్మెల్యే సోదరుడి అరెస్ట్
ABN , Publish Date - May 14 , 2025 | 12:20 AM
ఆలూరు కాంగ్రెస్ పార్టీ ఇన్‌చార్జి, ఎమ్మార్పీఎస్ రాయలసీమ జిల్లాల అధ్యక్షుడు చిప్పగిరి లక్ష్మీనారాయణ హత్య కేసులో అనంతపురం జిల్లా గుంతకల్లు టీడీపీ ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం సోదరుడు, ఆలూరు మార్కెట్ యార్డు మాజీ చైర్మన్ గుమ్మనూరు నారాయణను మంగళవారం పోలీసులు అరెస్టు చేశారు.
కాంగ్రెస్ నేత హత్య కేసులో కీలక మలుపు
త్వరలో మరికొందరి అరెస్ట్
కర్నూలు జిల్లా ఏఎస్పీ హుసేన్ పీరా
ఆలూరు/కర్నూలు, మే 13(ఆంధ్రజ్యోతి): ఆలూరు కాంగ్రెస్ పార్టీ ఇన్‌చార్జి, ఎమ్మార్పీఎస్ రాయలసీమ జిల్లాల అధ్యక్షుడు చిప్పగిరి లక్ష్మీనారాయణ హత్య కేసులో అనంతపురం జిల్లా గుంతకల్లు టీడీపీ ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం సోదరుడు, ఆలూరు మార్కెట్ యార్డు మాజీ చైర్మన్ గుమ్మనూరు నారాయణను మంగళవారం పోలీసులు అరెస్టు చేశారు. స్వగ్రామం చిప్పగిరి మండలం గుమ్మనూరు గ్రామంలో ఇంట్లో గుమ్మనూరు నారాయణ ఉన్నారని పక్కా సమాచారంతో ఏఎస్పీ హుసేన్ పీరా, పత్తికొండ డీఎస్పీ వెంకట్రామయ్య ఆధ్వర్యంలో భారీఎత్తున పోలీసు బలగాలు గుమ్మనూరు చేరుకొని అరెస్టు చేశారు. నారాయణ మాజీ మంత్రి, గుంతకల్లు ఎమ్మెల్యే జయరాం సోదరుడు కావడం రాజకీయంగా చర్చనీయాంశంగా మారింది. కాంగ్రెస్ నేత చిప్పగిరి లక్ష్మీనారాయణ గుంతకల్లులో పనులు ముగించుకొని తన వాహ నంలో స్వగ్రామం చిప్పగిరికి బయలుదేరుగా.. గుం తకల్లు శివారులో రైల్వేగేట్ వద్ద పక్కా ప్రణాళికతో టిప్పర్‌తో ఢీకొట్టి, ఆ వెంటనే మారుణా యుధాలతో లక్ష్మీనారాయణను అతిదారుణంగా హతమార్చిన విషయం తెలిసిందే.
లక్ష్మీనారాయణ 2007 నవంబరు 18న జరిగిన కర్నూలు జిల్లా కీలక టీడీపీ నేత, కేడీసీసీబీ మాజీ చైర్మన్ వైకుంఠం శ్రీరాములు, ఆయన సతీమణి శకుంతలమ్మ దంపతులను జంట హత్య కేసులో ఏడో నిందితుడుగా ఉన్నారు. ఈ కేసును న్యాయ స్థానం కొట్టివేసింది. దీనికి ప్రతికారంగానే నారాయణ హత్య చేయించి ఉంటారనే అనుమానంతో లక్ష్మీనా రాయణ కుమారుడు వినోద్‌కుమార్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు టీడీపీ నేత వైకుంఠం శివప్రసాద్, వైకుంఠం మల్లికార్జున, కొండ రామాంజి, అరికేర మల్లేశ్‌లపై చిప్పగిరి పోలీసులు కేసు నమోదు చేశారు.
గుంతకల్లులో భూ వివాదం..
అయితే గుంతకల్లు పట్టణంలో ఓ భూమి వివాద పంచాయితీలో కాంగ్రెస్ నేత లక్ష్మీనారాయణకు, గుంతకల్లుకు చెందిన గౌసియాబేగం మధ్య విభేదాలు తలెత్తడంతో.. గౌసియా ఈ హత్య చేయించారని పోలీసులు దర్యాప్తులు తేలడంతో గౌసియా, పెద్దన్న, సౌభాగ్య, రాజేశ్‌లతో పాటు మరో ఆరుగురిని పోలీసులు ఈ కేసులో నిందితులుగా చేర్చారు. ఇప్పటికే గౌసియా, సౌభాగ్య, రాజేశ్‌ను పోలీసులు అరెస్టు చేసి కోర్టులో హాజరు పరచగా న్యాయస్థానం రిమాండ్‌కు ఆదేశించింది. ఎవరూ ఉహించని విధంగా గుంతకల్లు టీడీపీ ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం సోదరుడు గుమ్మనూరు నారాయణను పోలీసులు అరెస్టు చేయడం ఆలూరు, గుంతకల్లు నియోజకవర్గాల్లో రాజకీయంగా చర్చగా మారింది. అరెస్టుచేసిన నారాయణను ఆలూరు ప్రభుత్వ ఆస్పత్రిలో వైద్య పరీక్షలు అనంతరం ఆలూరు న్యాయస్థానంలో హాజరు పరచగా న్యాయాఽ ధికారి 14 రోజులు రిమాండ్‌కు ఆదేశించారు. దీంతో కర్నూలు జిల్లా జైలుకు తరలించారు. అరెస్ట్‌పై ఆలూరు సీఐ రవిశంకర్‌రెడ్డితో కలసి అడిషినల్ ఎస్పీ హుసేన్‌పీరా, పత్తికొండ డీఎస్పీ వెంకట్రామ య్యలు ఆలూరు పోలీస్ స్టేషన్‌లో విలేకరుల సమా వేశం నిర్వహించి వివరాలను వెల్లడించారు. హత్య కేసు వివిధ కోణాల్లో దర్యాప్తు చేసినప్పుడు సాంకేతి క ఆధారాలు (టెక్నికల్ ఎవిడెన్స్), సెల్‌ఫోన్ డేటా ఆధారాలను పరిశీలిస్తే.. ఈ కేసులో గుమ్మనూరు నారాయణ పాత్ర కూడా ఉన్నట్లు తేలడంతోనే అరెస్టు చేశామని తెలిపారు. రైల్వే టెండర్లు, కమిషన్ల విషయంలో చిప్పగిరి లక్ష్మీనారాయణ, గుమ్మనూరు నారాయణల మధ్య విభేదాలు ఉన్నాయన్నారు. దీనికి తోడు భూవివాదాల కారణంగా హత్యకు గురైన లక్ష్మీనారాయణ గుంతకల్లుకు చెందిన గౌసియా, పెద్దన్న, రాజేష్‌లపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసులు పెడతానని బెదిరించడంతో ఎలాగైనా ఆయనను హత్య చేయాలని నిర్ణయించుకున్నారని తెలిపారు. హత్యకు ఉపయోగించిన టిప్పర్‌ను కొనుగోలు చేసేందుకు రూ.2 లక్షలు ఆర్థిక సాయం గుమ్మనూరు నారాయణ అందించాడని, హత్య జరిగిన తరువాత వారి అవసరాల కోసం మరో రూ.1.50 లక్షలు ఇచ్చినట్లు దర్యప్తులో వెల్లడైందని తెలిపారు. ఇదే విషయాన్ని నిందితుడు గుమ్మనూరు నారాయణ కూడా విచారణలో అంగీకరించడంతో అరెస్టు చేశామన్నారు. అతడి నుంచి రెండు సెల్‌ఫోన్లు స్వాధీనం చేసుకున్నట్లు వివరించారు. ఈ కేసులో త్వరలో మరికొందరిని త్వరలోనే అరెస్టు చేస్తామని వెల్లడించారు.