లభించని తల్లీ పిల్లల ఆచూకీ
ABN , Publish Date - Dec 30 , 2025 | 01:15 AM
: మండలంలోని మంచాలకట్ట గ్రామ సమీపంలోని ఎస్‌ఆర్‌బీసీ కాలువలో ఇద్దరు చిన్నారులతో సహా తల్లి దూకడంతో సొంతూరు వండుట్ల గ్రామంలో విషాదం నెలకొంది.
ముమ్మరంగా గాలిస్తున్న ఎస్‌డీఆర్‌ఎఫ్, పోలీసు బృందాలు
ఘటనా స్థలానికి భారీగా తరలివచ్చిన గ్రామస్థులు
గడివేముల, డిసెంబరు 29 (ఆంధ్రజ్యోతి): మండలంలోని మంచాలకట్ట గ్రామ సమీపంలోని ఎస్‌ఆర్‌బీసీ కాలువలో ఇద్దరు చిన్నారులతో సహా తల్లి దూకడంతో సొంతూరు వండుట్ల గ్రామంలో విషాదం నెలకొంది. స్థానికులు, పోలీసుల కథనం మేరకు.. వండుట్ల గ్రామానికి చెందిన ఎల్ల లక్ష్మి మూడు నెలల చిన్నారి సంగీతను, మూడేళ్ల చిన్నారి వైష్ణవితో ఆదివారం సాయంత్రం ఎస్‌ఆర్‌బీసీలో దూకింది. దీంతో గడివేముల ఎస్‌ఐ సీసీ నాగార్జున్‌రెడ్డి తన సిబ్బందితో గాలింపు చర్యలు చేపట్టారు. ఆదివారం రాత్రి వరకు వెతికిన వారి ఆచూకీ లభ్యం కాకపోవడంతో సోమవారం పాణ్యం సీఐ కిరణ్‌కుమార్‌రెడ్డి ఆధ్వర్యంలో ఎస్‌డీఆర్‌ఎఫ్ బృందం, అగ్నిమాపక సిబ్బంది, నాటుపడవలు, గజ ఈతగాళ్లతో ముమ్మర గాలింపు చర్యలు చేపట్టారు. లక్ష్మి ఆత్మహత్యకు పాల్పడిన ఘటనా స్థలం నుంచి సుమారు 15 కి.మీ. మేర ముమ్మరంగా గాలించారు. డ్రోన్ సహాయంతో ఎస్సార్బీసీ కాలువను క్షుణ్ణంగా పరిశీలించారు. చీకటి పడేంత వరకు ముమ్మరంగా గాలింపు చర్యలు చేపట్టారు. అయినా తల్లి, పిల్లల ఆచూకి లభించక పోవడంతో మంగళవారం ఉదయం కూడా గాలించనున్నట్లు పోలీసులు తెలిపారు. తల్లి, పిల్లలు ఆచూకిపై ఉత్కంఠత ఉండటంతో గ్రామస్థులు భారీ స్థాయిలో కాలువ వద్దకు చేరుకున్నారు. ఉదయం నుంచి సాయంత్రం వరకు వారి ఆచూకీ కోసం ఎదురు చూశారు.