మైనర్.. జాగ్రత్త
ABN , Publish Date - Dec 06 , 2025 | 12:52 AM
ఇటీవల పిల్లలు ద్విచక్రవాహనాలను తీసుకొని రోడ్ల మీదికి వస్తున్నారు. తల్లిదండ్రులే తమ పిల్లలకు డ్రైవింగ్ నేర్పుతున్నారు. డ్రైవింగ్ నేర్చుకోవడం మంచిదే. అయితే వారు నేరుగా రోడ్డు మీదికి వచ్చి ఇష్టానుసారంగా వాహనాలు నడుపుతున్నారు.
పిల్లలకు వాహనాలు ఇస్తే తల్లిదండ్రులదే నేరం
పెరుగుతున్న ప్రమాద ఘటనలు
ఇప్పటికే జిల్లా వ్యాప్తంగా 1000కి పైగా మైనర్ డ్రైవింగ్ కేసులు
ఒక్కొక్కరికి రూ.5వేలు జరిమానా
కఠిన చర్యలు తీసుకుంటాం: సీఐ మల్లికార్జున గుప్తా
నంద్యాల టౌన్ డిసెంబరు 5(ఆంధ్రజ్యోతి): ఇటీవల పిల్లలు ద్విచక్రవాహనాలను తీసుకొని రోడ్ల మీదికి వస్తున్నారు. తల్లిదండ్రులే తమ పిల్లలకు డ్రైవింగ్ నేర్పుతున్నారు. డ్రైవింగ్ నేర్చుకోవడం మంచిదే. అయితే వారు నేరుగా రోడ్డు మీదికి వచ్చి ఇష్టానుసారంగా వాహనాలు నడుపుతున్నారు. రోడ్డు నిబంధనలు తెలికపోవడం వల్ల, డ్రైవింగ్ సరిగా రాకపోవడం వల్ల ప్రమాదాలబారిన పడుతున్నారు. ఇతరులను ప్రమాదాలకు గురి చేస్తున్నారు. ఇటీవల పోలీసుల తనిఖీల్లో ఎక్కువగా మైనర్లే పట్టుపడుతున్నారు.
జిల్లాలో కళాశాలలు, పాఠశాలలకు ఎక్కువ మంది విద్యార్థులు ద్విచక్రవాహనాలపై వస్తున్నారు. 18 ఏళ్లులోపు వారు బండి నడపడం నిబంధనలకు విరుద్ధం. తల్లిదండ్రులు తమ పిల్లలు వాహనాలు నడుపుతున్నారని సంబరపడిపోతున్నారుగాని ప్రమాదాల గురించి పట్టించుకోవడం లేదు. పోలీసుల తనిఖీల్లో డ్రైవింగ్ చే స్తూ చాలా మంది మైనర్లు పట్టుబడుతున్నారు. నంద్యాల జిల్లాలో స్టేషన్ల పరిధిలో పోలీసులు ఇప్పటికే సుమారుగా 1000కి పైగా కేసులు నమోదు చేశారు. వాహనాలను సీజ్ చేశారు. మైనర్ల
తల్లిదండ్రులను స్టేషన్‌కు పిలిపించి కౌన్సిలింగ్ ఇచ్చి పంపిస్తున్నారు. ఇటువంటి ఘటనల్లో కేసులు నమోదైతే పిల్లల భవిష్యత్తుకు ఇబ్బంది అవుతుందని పోలీసులు సూచిస్తున్నారు.
నంద్యాలలలో కొన్ని సంఘటనలు....
ఫ గత మూడు నెలల కిందట తెలుగు పేటకు చెందిన ఇద్దరు మైనర్లు పాఠశాలకు వెళ్లి వచ్చి సాయంత్రం తండ్రి బైక్ తీసుకుని పెద్దకొట్టాలలో తమ స్నేహితులు ఉన్నారని వెళుతూ.. సుగాలి మెట్ట వద్ద ప్రమాదానికి గురయ్యారు. ఒకరు ప్రాణాలు కోల్పోయ్యారు. ఎదురుగా వస్తున్న బైక్‌ను ఢీకొట్టడంతో ఎదురు వాహనంలో వస్తున్న మహిళా కూడా చనిపోయింది.
ఎనిమిది నెలల కిందట సాయిబాబా నగర్ నుంచి అయ్యలూరు వెళ్తుండగా ద్విచక్రవాహనం నడుపుతున్న వ్యక్తి అదుపు తప్పి కింద పడిపోయారు. మైనర్లు వాహనం నడపడం వల్లనే ప్రమాదం జరిగినట్లు సమాచారం. ఈ ఘటనలో వారికి తీవ్ర గాయ్యాలయ్యాయి.
రైతు నగరం వద్ద మూడు నెలల కింద మైనర్లు వాహనం నడుపుతూ ఎదురుగా వస్తున్న కారును ఢీకొట్టారు. ఈ ప్రమాదంలో ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి.
పిల్లలకు వాహనాలు ఇస్తే తల్లిదండ్రులదే నేరం..
నిబంధనలు ఉల్లంఘించి మైనర్లు డ్రైవింగ్ చే స్తే వాహనాలను సీజ్ చేస్తారు.
కొందరు మైనర్లు వాహనాలతో విన్యాసాలు చేయడంతో పాటు నంబరు ప్లేటు, సైలెన్సర్లు తొలగిస్తున్నారు. ఇది నేరం. వారిపై చర్యలు తీసుకుంటున్నారు.
మైరన్లు బండి నడుపుతూ పట్టబడితే నంద్యాలలో రూ.5,250 జరిమానా విధిస్తున్నారు.
మైనర్లకు వాహనాలు ఇస్తే తల్లిదండ్రులు లేదా సంరక్షకుడికి మూడు ఏళ్లు జైలు శిక్ష విధిస్తారు. 25 ఏళ్లు పాటు డ్రైవింగ్ లైసెన్స్ రద్దు అవుతుంది.
ఎస్పీ ఆధ్వర్యంలో..
నంద్యాలలో ప్రత్యేకంగా ఎస్పీ సునీల్ షెరాన్ ఆధ్వర్యంలో సీఐ మల్లికార్జున గుప్తా ప్రతి ఆదివారం మైనర్ డ్రైవింగ్‌పై ప్రత్యేకంగా డ్రైవ్ నిర్వహిస్తున్నారు. మైనర్లు పట్టుబడితే.. వారి తల్లిదండ్రులను పిలిపించి రూ.5,300 జరిమానా విధించి పంపిస్తున్నారు. తల్లిదండ్రులకు ప్రత్యేకంగా కౌన్సెలింగ్ ఇచ్చి ఇది మళ్లీ పునరావృతం అయితే బైక్‌ను సీజ్ చేస్తున్నారు. అలాగే రోడ్డు ప్రమాదాలపై అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు.
మైనర్ డ్రైవింగ్‌పై ప్రత్యేక డ్రైవ్
పోలీసు ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు ప్రతి ఆదివారం మైనర్ డ్రైవింగ్‌పై ప్రత్యేకంగా డ్రైవ్ నిర్వహించి ఇప్పటికే చాలా వరకు కట్టడి చేశాం. తల్లిదండ్రులు కూడా మారాలి. రోడ్డు భద్రతా ప్రమా ణాలు పాటించాలి ప్రత్యేక అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నాం. - మల్లికార్జున గుప్తా, ట్రాఫిక్ సీఐ, నంద్యాల