Share News

5న మెగా పీటీఎం

ABN , Publish Date - Nov 27 , 2025 | 11:52 PM

వచ్చేనెల 5న జిల్లాలోని అన్ని ప్రభుత్వ పాఠశాలలు, కళాశాలల్లో మెగా తల్లిదండ్రులు-ఉపాధ్యాయుల ఆత్మీయ సమావేశం నిర్వహించ నున్నట్లు కలెక్టర్‌ రాజకుమారి తెలిపారు.

  5న మెగా పీటీఎం

తల్లిదండ్రులు, ప్రజాప్రతినిధులు తప్పకుండా హాజరు కావాలి

కలెక్టర్‌ రాజకుమారి

నంద్యాల, నూనెపల్లి 27 (ఆంధ్రజ్యోతి): వచ్చేనెల 5న జిల్లాలోని అన్ని ప్రభుత్వ పాఠశాలలు, కళాశాలల్లో మెగా తల్లిదండ్రులు-ఉపాధ్యాయుల ఆత్మీయ సమావేశం నిర్వహించ నున్నట్లు కలెక్టర్‌ రాజకుమారి తెలిపారు. గురువారం ఆమె తమ చాంబర్‌ నుంచి ఎంఈవోలు, ప్రధానోపాధ్యాయులతో మెగా పీటీఎం ఏర్పాట్లపై వీడియో కాన్ఫరెన్స్‌ నిర్వహించారు. కలెక్టర్‌ మాట్లాడుతూ ఈ సమావేశంలో విద్యార్థుల అకడమిక్‌ ప్రదర్శన, చదువులో ఎలా ఉన్నారు?, ఇతర కార్యక్రమాల్లో ఎలా పాల్గొంటున్నారు?, అభివృద్ధి ఎలా ఉంది? అనే విషయాలపై ఉపాధ్యాయులు తల్లిదండ్రులతో మాట్లాడతారని చెప్పారు. అనంతరం విద్యార్థులకు హెచ్‌పీసీ (హోలిస్టిక్‌ ప్రొగ్రెస్‌ కార్డు)ను అందజేస్తారన్నారు. మధ్యాహ్నం తల్లిదండ్రులకు కూడా భోజనం ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. విద్యార్థుల హాజరు, పరీక్ష ఫలితాలు, దిన చర్య పురోగతి తదితర వివరాలను తెలుసుకోవడానికి లీప్‌ యాప్‌ను తప్పనిసరిగా డౌన్‌లోడ్‌ చేసుకోవాలని సూచించారు. అలాగే ఎఫ్‌ఎల్‌ఎన్‌ పరిధిలో విద్యార్థులు చదువు తున్న తరగతికి తగ్గ పఠన-లేఖన నైపుణ్యాలు ఉన్నాయా? లేదా? అన్న విషయంపై కూడా ఉపాధ్యాయులు తల్లిదండ్రులతో చర్చిస్తారన్నారు. పదో తరగతి వచ్చేనెల 5వ తేదీకి పూర్తి కాబోతోందని, అప్పటి నుంచి వందరోజుల కార్యాచరణ ద్వారా వారికి పరీక్షలకు ప్రత్యేకంగా శిక్షణ ఇవ్వనున్నట్లు స్పష్టం చేశారు. ప్రతి మండలంలో ప్రత్యేక అధికారులు ఈ కార్యక్రమాన్ని సమీక్షించనున్నట్లు తెలిపారు.

Updated Date - Nov 27 , 2025 | 11:52 PM