Share News

తుంగభద్రతకు చర్యలు

ABN , Publish Date - Dec 06 , 2025 | 11:49 PM

తుంగభద్ర డ్యాం నూతన గేట్ల ఏర్పాటుకు శ్రీకారం చుట్టారు. టీబీపీ బోర్డు అధికారులు ప్రత్యేక పూజలు చేసి పనులకు అంకురార్పణ చేశారు.

తుంగభద్రతకు చర్యలు

తుంగభద్ర గేట్ల ఏర్పాటుకు శ్రీకారం

ప్రత్యేక పూజలు చేసి ప్రారంభించిన టీబీపీ బోర్డు అధికారులు

నూతనంగా 33 గేట్ల అమరిక

ఏపీ వాటా రూ.20 కోట్లు విడుదల

నిధులు విడుదల చేయని కర్ణాటక ప్రభుత్వం

2026 జూన్‌ ఆఖరి పనులు పూర్తయ్యేలా ప్లాన్‌

తుంగభద్ర డ్యాం నూతన గేట్ల ఏర్పాటుకు శ్రీకారం చుట్టారు. టీబీపీ బోర్డు అధికారులు ప్రత్యేక పూజలు చేసి పనులకు అంకురార్పణ చేశారు. ఇందులో భాగంగా ముందు కాంట్రాక్ట్‌ సంస్థ పాత గేట్లు తొలగించే పనులు మొదలుపెట్టారు. రూ.44 కోట్లతో చేపట్టే పనులను గుజరాత్‌కు చెందిన హార్డ్‌వేర్‌ అండ్‌ టూల్స్‌ సంస్థ చేపట్టింది. ఎట్టి పరిస్థితుల్లో 2026 జూన్‌ ఆఖరులోగా గేట్ల అమరిక పూర్తి చేసేందుకు బోర్డు ఇంజనీర్లు పక్కా ప్రణాళిక తయారు చేశా రు. దీంతో జనవరి 11 వరకు సాగులో ఉన్న పంటలకు నీరు ఇచ్చి ఆ తరువాత అవసరాన్ని బట్టి తాగునీరు మాత్రమే ఇస్తామని తేల్చి చెప్పారు. గేట్ల ఏర్పాటు కోసం ఆంధ్రప్రదేశ్‌ వాటా నిధులు రూ.20 కోట్లు విడుదల చేసింది. కర్ణాటక వాటా నిధులు విడుదల చేయాల్సి ఉంది.

కర్నూలు, డిసెంబరు 6 (ఆంధ్రజ్యోతి): ఆంరఽధా, కర్ణాటక రాష్ట్రాల ప్రధాన నీటి ఆధారమైన తుంగభద్ర డ్యాం నూతన గేట్లు ఏర్పాటుకు టీబీపీ బోర్డు అధికారులు సన్నాహాలు చేపట్టారు. డ్యాంకు మొత్తం 33 క్రస్ట్‌గేట్లు గేట్లు ఉన్నాయి. గతేడాది ఆగస్టులో 19వ నంబరు గేటు కొట్టుకుపోవడంతో డ్యాం భద్రతపై పలు అనుమానాలు తలెత్తాయి. కేంద్ర జలసంఘం (సీడబ్ల్యూసీ), నేషనల్‌ డ్యాం సేఫ్టీ అథారిటీ (ఎన్‌డీఎ్‌సఏ), డ్యాంను కేత్రస్థాయిలో తనిఖీ చేసిన ఏకే బజాజ్‌ కమిటీ సిఫార్సుల మేరకు గేట్లు, ప్రాజెక్టు సామర్థ్యంపై టీబీపీ బోర్డు అధ్యయనం చేయిచింది. గేట్ల సామ ర్థ్యం నిర్ధారణ, రేడియోగ్రఫీ, ఎంపీటీ, అలా్ట్ర సోనిక్‌, డీపీటీలో అనుభవం, నైపుణ్యం కలిగిన కేఎ్‌సఎన్‌డీటీ సర్వీసెస్‌ సంస్థ అఽధ్యయనం చేసింది. 2024 ఆగస్టులో కొట్టుకుపోయిన 19వ గేటుతో పాటు మరో 32 గేట్ల సామర్థ్యాన్ని క్షుణ్ణంగా పరిశీలించారు. ప్రతి గేటుకు 15 రకాల పరీక్షలు నిర్వహించారు. డ్యాం గేట్లన్నీ భారీగా తుప్పుపట్టి భారీ రంధ్రాలు ఏర్పడ్డాయని, కొన్ని ప్రదేశాల్లో రంద్రాల వల్ల గేటు ప్లేట్లు బాగా ధ్వంసం అయ్యాయని, గుస్సెట్‌ ప్లేట్లు, దిగువ స్టిఫినర్లు, గేట్లకు సపోర్టుగా ఉండే గడ్డర్లు, సపోర్టింగ్‌ ప్లేట్లు కూడా బాగా తుప్పుపట్టి, చిల్లులు పడ్డాయని ఆ సంస్థ ఇచ్చిన నివేదికలో వెల్లడించింది. గేట్ల సామర్థ్యం 45 ఏళ్లు కాగా, తుంగభద్ర గేట్లు 70 ఏళ్లు దాటడంతో మొత్తం గేట్లన్ని మార్చాల్సిన అవసరం ఎంతైనా ఉందని స్పష్టంగా వివరించారు. ఆ నివేదిక ఆధారంగా డ్యాం 33 గేట్లు తొలగించి వాటి స్థానంలో కొత్త గేట్లు ఏర్పాటు చేసేందుకు టీబీపీ బోర్డు కీలక నిర్ణయం తీసుకుంది.

పాత గేట్ల తొలగింపు పనులు

తుంగభద్ర డ్యాం 33 గేట్లు కొత్తగా ఏర్పాటు చేసేందుకు రూ.44 కోట్లతో టెండర్లు పిలిచారు. గుజరాత్‌కు చెందిన ‘హార్డ్‌వేర్‌ టూల్స్‌’ సంస్థ టెండరు దక్కించుకుంది. ఈ ఖరీఫ్‌ సీజన్‌లో జూలై నుంచి జలాశయంలోకి వరద మొదలు కావడంతో ఆ సమయంలో గేట్లు ఏర్పాటు పనులు మొదలు పెట్టలేదు. అయితే గేట్ల తయారి (ఫ్యాబ్రికేషన్‌) పనులు మాత్రం కాంట్రాక్ట్‌ సంస్థ చేపట్టింది. ఇప్పటికే 15 గేట్లు తయారు చేశారు. వీటిని అమర్చాలంటే పాత గేట్లు తొలగించాల్సి ఉంది. ఆ పనులను శుక్రవారం మొదలు పెట్టారు. బోర్డు సెక్రెటరీ ఓఆర్‌కే రెడ్డి, ఎస్‌ఈ నారాయణ నాయక్‌, బోర్డు కర్ణాటక సభ్యుడు కృష్ణమూర్తి కులకర్ణి, మునిరాబాద్‌ ఎస్‌ఈ, విజయనగర (హోస్పెట్‌) జిల్లా కలెక్టర్‌, ఎస్పీ, ఆర్డీఓ సహా ఏపీ, కర్ణాటక రైతులు ప్రత్యేక పూజలు చేసి ప్రారంభించారు. తుంగభద్రమ్మకు జలహారతి ఇచ్చారు. తరువాత గేట్ల తయారి, అమరిక టెక్నికల్‌ సిబ్బంది పాత గేట్లను తొలగించే పనులు మొదలు పెట్టారు. సోమవారం నుంచి దాదాపు 80 మందితో పనులు వేగంగా చేపడుతామని బోర్డు ఎస్‌ఈ నారాయణ నాయక్‌ ఆంధ్రజ్యోతికి వివరించారు. ఎట్టి పరిస్థితుల్లోనూ 2026 జూన్‌ ఆఖరులోగా కొత్త గేట్లు ఏర్పాటు చేసే దిశగా ముందుకు వెళ్తామన్నారు.

జపాన్‌ నుంచి బేరింగులు దిగుమతి

టీబీపీ డ్యాంకు ఏర్పాటు చేసే గేట్లకు బేరింగులు ఎంతో కీలకం. మన దేశంలో అధునాతన సాంకేతిక పరిజ్ఞానంతో తయారు చేసిన బేరింగ్స్‌ అందుబాటులో లేకపోవడంతో జర్మని నుంచి దిగుమతి చేసుకోవాలని అనుకున్నారు. అక్కడ కూడా అదే పరిస్థితి ఉండడంతో ఒక్కో గేటుకు 12 చొప్పున 396 బేరింగులు దిగుమతి చేసుకున్నట్లు బోర్డు అధికారులు తెలిపారు. ఇందుకోసం రూ.2.50 కోట్లు ఖర్చు చేశారు. గేట్లు ఎత్తడం, దించడంతో బేరింగులు అత్యంత కీలకమని, అందుకే జపాన్‌ నుంచి దిగుమతి చేసుకోవాల్సి వచ్చిందని ఏపీ ఇరిగేషన్‌ ప్రాజెక్ట్స్‌ మెకానికల్‌ సలహాదారు కన్నయ్యనాయుడు పేర్కొన్నారు.

నిధులు ఇవ్వని కర్ణాటక

డ్యాం నిర్వహణ, మరమ్మతులు.. వంటి పనులకు ఏపీ ప్రభుత్వం 55 శాతం, కర్ణాటక ప్రభుత్వం 45 శాతం వాటా నిధులు చెల్లించాల్సి ఉంటుంది. 33 గేట్లలో ఏపీ నిర్వహణలోకి 15 గేట్లు, కర్ణాటక నిర్వహణలోకి 18 గేట్లు వస్తాయి. మొత్తం 33 గేట్లు కొత్తగా ఏర్పాటు కోసం రూ.44 కోట్లతో ప్రతిపాదనలు తయారు చేశారు. ఇందులో ఏపీ వాటా నిధులు రూ.20 కోట్లు ఇప్పటికే టీబీపీ బోర్డు విడుదల చేసినట్లు ఏపీ ఇరిగేషన్‌ ప్రాజెక్ట్స్‌ మెకానికల్‌ సలహాదారు కన్నయ్యనాయుడు వివరించారు. అయితే ఈ నిధుల విషయంపై కర్ణాటకకు లేఖ రాశామని, రెండు మూడు రోజుల్లో ఆ రాష్ట్రం కూడా వాటా నిధులు విడుదల చేస్తుందని బోర్డు ఎస్‌ఈ నారాయణ నాయక్‌ ఆశాభావం వ్యక్తం చేశారు.

Updated Date - Dec 06 , 2025 | 11:49 PM