Share News

తవ్వకాల్లో మాయ..!

ABN , Publish Date - Jun 19 , 2025 | 11:30 PM

హంద్రీనీవా కాలువ తవ్వకాల్లో జరిగిన అక్రమాల పాపం పదమూడేళ్లుగా వెంటాడుతోంది.

తవ్వకాల్లో మాయ..!
రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన హంద్రీనీవా ప్రధాన కాలువ విస్తరణ

చేయని మట్టి పనులకు బిల్లులు

విజిలెన్స్‌ తనిఖీల్లో వెలుగు చూసిన వైనం

రూ.6 కోట్లు డిపాజిట్‌ చేసిన కాంట్రాక్ట సంస్థ

హంద్రీనీవా కాలువ విస్తరణకు అడ్డంకులు లేకుండా చర్యలు

ఖజానాపై తప్పని అదనపు భారం

హంద్రీనీవా కాలువ తవ్వకాల్లో జరిగిన అక్రమాల పాపం పదమూడేళ్లుగా వెంటాడుతోంది. ఉమ్మడి రాష్ట్రంలో అప్పటి అనంతపురం జిల్లాకు చెందిన మంత్రి రఘువీరారెడ్డి కృష్ణా జలాలు ఆ జిల్లాలకు తీసుకెళ్లాలనే లక్ష్యంగా పాదయాత్ర చేశారు. ఎలాగైనా ట్రైల్‌రన్‌ విజయవంతం చేయాలని కాలువ తవ్వకాలు, మట్టి పనులు హడావుడిగా చేపట్టారు. సందట్లో సడేమియా అన్నట్లు రూ.కోట్లు విలువైన మట్టి పనులు (ఎర్త్‌వర్క్‌) చేయకుండానే చేసినట్లు కాంట్రాక్ట్‌ సంస్థ బిల్లులు స్వాహా చేసింది. రాష్ట్ర విభజన తరువాత అప్పటి సీఎం చంద్రబాబు కాలువ విస్తరణకు శ్రీకారం చుట్టారు. పనులు దక్కించుకున్న కాంట్రాక్ట్‌ సంస్థకు అనుమానం వచ్చి అభ్యంతరం పెట్టడంతో ఈ భాగోతం వెలుగులోకి వచ్చింది. క్షేత్రస్థాయిలో తనిఖీలు చేసిన విజిలెన్స్‌ అండ్‌ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ అధికారులు మట్టి పనుల్లో అక్రమాలు నిజమేనని నిగ్గు తేల్చింది. సంబంధిత కాంట్రాక్ట్‌ సంస్థ నుంచి రూ.6 కోట్లు డిపాజిట్‌ చేయించారు. కూటమి ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన హంద్రీనీవా విస్తరణకు ఏమాత్రం అడ్డంకులు లేకుండా చర్యలు చేపట్టారు. పదమూడేళ్ల క్రితం కాంట్రాక్ట్‌ సంస్థ చేసిన అక్రమాలు పాపం ఫలితం.. తాజాగా ఎస్‌ఎస్‌ఆర్‌ రేట్ల ప్రకారం ఖజానాపై మరో రూ.6 కోట్లపైగా అదనపు భారం తప్పదని నిపుణులు అంటున్నారు.

కర్నూలు, జూన్‌ 19 (ఆంధ్రజ్యోతి): శ్రీశైలం ఎగువన కృష్ణా జలాలు ఎత్తిపోసి రాయలసీమ ప్రాంతానికి మళ్లించడం ద్వారా కరువు పల్లెసీమలను సస్యశామలం చేయాలనే సంకల్పంతో 1989లో ఆనాటి ముఖ్యమంత్రి నందమూరి తారక రామారావు (ఎన్టీఆర్‌) హంద్రీనీవా సుజల స్రవంతి ఎత్తిపోతల పథకం (హెచ్‌ఎన్‌ఎస్‌ఎస్‌) శ్రీకారం చుట్టారు. కర్నూలు జిల్లా హంద్రీ, చిత్తూరు జిల్లాలోని నదులు అనుసంధానం చేయడంతో భాగంగానే హంద్రీ-నీవా ప్రాజెక్టుకు అప్పటి సాగునీటి నిపుణులు, ప్రముఖ ఇంజనీరు డాక్టర్‌ కుడితిపూడి శ్రీరామకృష్ణయ్య రూపకల్పన చేశారు. ఈ ప్రాజెక్టు నిర్మాణం కోసం నందికొట్కూరు మండలం మల్యాల వద్ద ఎన్టీఆర్‌ పునాది రాయి వేశారు. 40 టీఎంసీలు కృష్ణా మిగులు జలాలు ఎత్తిపోసి కరువు సీమలో ఉమ్మడి కర్నూలు, అనంతపురం, చిత్తూరు జిల్లాల్లో 6.025 లక్షల ఎకరాల్లో సాగునీరు అందించాలనే లక్ష్యంగా చేపట్టిన ఈ ప్రాజెక్టు పూర్తి చేయడంలో ఎన్టీఆర్‌, వైఎస్సార్‌, చంద్రబాబు, కిరణ్‌కుమార్‌రెడ్డి నలుగురు ముఖ్యమంత్రుల కృషి ఉంది. 2012 నవంబరులో ట్రైల్‌రన్‌ విజయవంతం చేశారు. అప్పటి నుంచి ఏటేటా కృష్ణా జలాలు ఎత్తిపోస్తున్నారు. ఆ సమయంలో కాల్వ తవ్వకాల్లో భాగంగా చేపట్టిన మట్టి పనుల్లో అక్రమాలు జరిగాయనే ఆరోపణలు వెల్లువెత్తాయి. ఫేజ్‌-1లో భాగంగా చేపట్టిన ప్యాకేజీ-28, ప్యాకేజీ-28ఏ పరిధిలో ఈ-ప్రొక్యూర్‌మెంట్‌ విధానంలో పనులు దక్కించుకున్న కాంట్రాక్ట్‌ సంస్థ చేయని మట్టిపనులకు చేసినట్లుగా రికార్డుల్లో చూపి బిల్లులు స్వాహా చేసింది.

ఆరేళ్ల తర్వాత వెలుగులోకి

హంద్రీనీవా కాలువ ప్రవాహ సామర్థ్యం 3,850 క్యూసెక్కులు కాగా.. 1,850 నుంచి 2 వేల క్యూసెక్కులకు మించి ఎత్తిపోయలేని పరిస్థితి ఉంది. చిత్తూరు జిల్లా కుప్పంకు కృష్ణా జలాలు తీసుకువెళ్లాలనే లక్ష్యంగా 2017-18లో అప్పటి సీఎం చంద్రబాబు 3,850 క్యూసెక్కుల ప్రవాహ సామర్థ్యానికి కాలువను విస్తరణకు గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చారు. ఫేజ్‌-1 కింద శ్రీశైలం డ్యాం ఫోర్‌షోర్‌ ఏరియాలో మల్యాల లిఫ్ట్‌ పంప్‌హౌస్‌ వరకు 4.806 కిలోమీటర్లు అప్రోచ్‌ ఛానల్‌, 0/0 కి.మీలు నుంచి అనంతపురం జిల్లా జీడిపల్లి రిజర్వాయర్‌ వరకు 216.30 కిలోమీటర్ల వరకు విస్తరణ పనులు రూ.1,050 కోట్లతో చేపట్టారు. ప్యాకేజీ-1 కింద 0/0 నుంచి 88 కిలోమీటర్ల వరకు, ప్యాకేజీ-2 కింద 88 కి.మీల నుంచి 216.30 కిలోమీటర్ల వరకు విస్తరణ పనులు చేపట్టారు. ప్యాకేజీ-2 విస్తరణ పనులు పనులు దక్కించుకున్న హిందుస్తాన్‌ ఇంజనీరింగ్‌ సొసైటీ (హెచ్‌ఈఎస్‌) సంస్థ సర్వే చేయగా.. దేవనకొండ, పత్తికొండ మండలాల్లో నున్సురాళ్ల, నల్లచెలిమిల, పందికోన గ్రామాల వద్ద హంద్రీనీవా కాలువ 100-105 కిలోమీటర్ల మధ్యలో గతంలో పనులు చేసిన ప్యాకేజీ-28, ప్యాకేజీ-28ఏ కాంట్రాక్ట్‌ సంస్థ అక్రమాలకు పాల్పడి చేయని మట్టి పనులు చేసినట్లుగా రికార్డుల్లో చూపించి బిల్లులు తీసుకున్నారని గుర్తించింది. అక్కడ తాము పనులు చేస్తే నష్టపోతామని, క్షేత్రస్థాయిలో ఎంత మట్టి పని చేస్తే అంత మొత్తానికి బిల్లులు ఇస్తామంటేనే పనులు చేస్తామని, లేదంటే విస్తరణ పనులు చేయలేమంటూ హెచ్‌ఈఎస్‌ సంస్థ లేఖ రాయడంతో మట్టిపనుల్లో జరిగిన అక్రమాల భాగోతం వెలుగులోకి వచ్చింది. ప్రభుత్వం ఆదేశాల మేరకు క్షేత్రస్థాయిలో తనిఖీలు చేపట్టిన విజిలెన్స్‌ అండ్‌ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ అధికారులు మట్టి పనుల్లో అవినీతి అక్రమాలు నిజమేనని, చేయని పనులకు బిల్లులు డ్రా చేశారని నిగ్గు తేల్చింది. 2012కు ముందు జరిగిన అక్రమాల పాపం విస్తరణకు శాపంగా మారింది.

ఖజానాపై అదనపు భారం?

ప్రభుత్వానికి విజిలెన్స్‌ అండ్‌ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ అధికారులు ఇచ్చిన నివేదిక ఆధారంగా 2012కు ముందు హంద్రీనీవా కాలువ తవ్వకం పనులు చేసిన ప్యాకేజీ-28, ప్యాకేజీ-28ఏ కాంట్రాక్ట్‌ సంస్థల నుంచి రూ.6 కోట్లు డిపాజిట్‌ చేయించారు. సీఎం చంద్రబాబు సారథ్యంలో వచ్చిన కూటమి ప్రభుత్వం 3,850 క్యూసెక్కుల ప్రవాహానికి వీలుగా హంద్రీనీవా విస్తరణ పనులు ప్రతిష్టాత్మకంగా చేపట్టారు. ప్యాకేజీ-2 కింద రూ.430 కోట్లతో చేపట్టిన విస్తరణ పనుల్లో భాగంగా మట్టి పనులు (ఎర్త్‌వర్క్‌), సీసీ లైనింగ్‌ పనులు వీపీఆర్‌-డీఎస్‌ఆర్‌ జాయింట్‌ వెంచర్‌గా చేపట్టాయి. అయితే గతంలో అక్రమాలు జరిగిన 100-105 కిలో మీటర్ల మధ్యలో ఎంత పరిమాణంలో అదనపు మట్టి పనులు చేయాల్సి ఉందో తేల్చాలని ఆ సంస్థ ఇంజనీర్లను కోరింది. ప్రస్తుతం 2021-22 ఎస్‌ఎస్‌ఆర్‌ రేట్ల మేరకు పనులు చేస్తున్నట్లు ఇంజనీర్లు చెబుతున్నారు. చేయని పనులకు బిల్లులు చేసుకున్న పనులకు 2012-13 ఎస్‌ఎస్‌ఆర్‌ రేట్ల ప్రకారం రూ.6 కోట్లు రికవరీ చేయించి డిపాజిట్‌ చేయించారు. ప్రస్తుతం చేస్తున్న పనులకు 2021-22 ఎస్‌ఎస్‌ఆర్‌ రేట్ల ప్రకారం బిల్లులు చెల్లిస్తుండడంతో ప్రభుత్వ ఖజానాపై మరో రూ.6 కోట్లు అదనపు భారం తప్పదని ఇంజనీర్లు పేర్కొంటున్నారు. 13 ఏళ్ల క్రితం కాంట్రాక్ట్‌ సంస్థ, అప్పటి క్షేత్రస్థాయి పర్యవేక్షణ ఇంజనీర్లు చేసిన అక్రమాల పాపం ఇప్పటికీ వెంటాడుతూనే ఉంది.

ఎలాంటి ఇబ్బందులు లేకుండా విస్తరణ పూర్తి చేస్తాం

హంద్రీనీవా ప్రధాన కాలువ 100-105 కిలోమీటర్ల మధ్యలో కాల్వ తవ్వకం పనులు చేసిన కాంట్రాక్టరు మట్టి పనులు చేయకుండానే చేసినట్లు చూపించి బిల్లులు డ్రా చేశారని విజిలెన్స్‌ అండ్‌ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ అధికారులు నివేదిక ఇచ్చారు. ఆ నివేదిక ఆధారంగా అప్పటి కాంట్రాక్ట్‌ సంస్థ నుంచి రూ.6కోట్లు డిపాజిట్‌ చేయించాం. ఆ ప్రాంతంలో ఎలాంటి ఇబ్బందులు లేకుండా ప్రస్తుత కాంట్రాక్ట్‌ సంస్థ ద్వారా విస్తరణ పనులకు చేయిస్తున్నాం. అడ్డంకులను అధిగమించి ఈ నెలాఖరులోగా విస్తరణ పనులు పూర్తి చేస్తాం. ఎట్టిపరిస్థితుల్లోనూ 3,850 క్యూసెక్కులు ఎత్తిపోస్తాం.

- పాండురంగయ్య, ఎస్‌ఈ, హంద్రీనీవా ప్రాజెక్టు, కర్నూలు

Updated Date - Jun 19 , 2025 | 11:30 PM