Share News

సకల సిద్ధి ప్రాప్తిరస్తు...!

ABN , Publish Date - Aug 26 , 2025 | 11:26 PM

విఘ్నాలు తొలగి శుభాలు అందించే వినాయకుడి వేడుకలకు జిల్లా సిద్ధమైంది. ‘వినాయక చవితి’ని బుధవారం ఉమ్మడి జిల్లా ప్రజలు భక్తిశ్రద్ధలతో ఘనంగా నిర్వహించుకోనున్నారు.

సకల సిద్ధి ప్రాప్తిరస్తు...!

జిల్లా వ్యాప్తంగా మొదలైన సందడి

నేడు వినాయక చవితి

కర్నూలు కల్చరల్‌, ఆగస్టు 26 (ఆంధ్రజ్యోతి) : విఘ్నాలు తొలగి శుభాలు అందించే వినాయకుడి వేడుకలకు జిల్లా సిద్ధమైంది. ‘వినాయక చవితి’ని బుధవారం ఉమ్మడి జిల్లా ప్రజలు భక్తిశ్రద్ధలతో ఘనంగా నిర్వహించుకోనున్నారు. ఈ ఏడాది వినాయక చవితి పండుగ సందడి బాగా కానవస్తోంది. ఈ వేడుక సందర్భంగా తొమ్మిది రోజుల పాటు నిర్వహించే ‘గణేశ్‌ నవరాత్రి మహోత్సవాలు’ వాడవాడలా అంగరంగ వైభవంగా ఆరంభించేందుకు నిర్వాహకులు సన్నద్ధమయ్యారు. ఉమ్మడి జిల్లాలోని ఆయా పట్టణాలు, గ్రామాల్లో గణేశ్‌ ఉత్సవ కమిటీల నిర్వాహకులు భారీ వినాయక ప్రతిమలు నెలకొల్పారు. గ్రామీణ ప్రాంతాల్లోని వివిధ వాడలు, పట్టణ ప్రాంతాల్లోని వీధుల్లో, నాలుగు రోడ్ల కూడళ్లు, చౌరస్తాలలో గణేశ్‌ మంటపాల్లో నెలకొల్సిన విగ్రహాలు కనువిందు చేస్తున్నాయి. ‘నవరాత్రి ఉత్సవాలు’ సంబరంగా నిర్వహించేందుకు కమిటీల నిర్వాహకులు ఏర్పాట్లు పూర్తి చేశారు. వినాయకుడి పండుగ సందర్భంగా ఆయా ప్రాంతాల్లోని మార్కెట్లు కళకళలాడాయి. గృహాల్లో వినాయక ప్రతిమలు నెలకొల్పి పూజించేవారు చిన్న చిన్న వినాయక ప్రతిమలు, పూజా సామగ్రి, పత్రి, పూలు, పండ్లు కొనుగోళ్లకు రావడంతో మంగళవారం ఉదయం నుంచి సాయంత్రం వరకు ప్రధాన వీధులన్నీ కిటకిటలాడాయి. గ్రామీణ ప్రాంతాల్లో లభించే గరిక, జిల్లేడు, గన్నేరు తదితర పూలను పట్టణ ప్రాంతాలకు తీసుకువచ్చి అమ్మకాలకు పెట్టారు. కొబ్బరి మట్టలు, వెలగ, సీతాఫలం, అరటి బోదెలు, కంకులు, చెరకుగడలు వంటి వాటికి గిరాకీ ఏర్పడింది. ఈ క్రమంలో బంతిపూలు రూ.140 నుంచి రూ.250 వరకు ధరలు పలికాయి. చెరకు గడలు, వెలగకాయలు, జిల్లేడు, మారేడు, రావి, గరిక పత్రాలకు డిమాండ్‌ ఏర్పడింది. మామిడి తోరణాలు, కొబ్బరి మట్టలు, అరటి బోదెలు కూడా అధిక ధరలు పలికాయి.

Updated Date - Aug 26 , 2025 | 11:26 PM