Share News

ప్రధాని మోదీ పర్యటనకు భారీ ఏర్పాట్లు

ABN , Publish Date - Oct 08 , 2025 | 12:04 AM

ఎన్టీఏ మూడోసారి అధికారం చేపట్టిన తర్వాత ప్రధానమంత్రి నరేంద్రమోదీ ఆంధ్రప్రదేశ్‌కు మూడోసారి రానున్నారు. క

ప్రధాని మోదీ పర్యటనకు  భారీ ఏర్పాట్లు
సభా స్థలం వద్ద అధికారులతో మాట్లాడుతున్న కలెక్టర్‌ డా.సిరి

185 ఎకరాల్లో సభా ప్రాంగణం

స్పెషల్‌ ఆఫీసర్‌ వీరపాండియన్‌ పర్యవేక్షణ

జిల్లా అధికారులకు బాధ్యతలు

కర్నూలు/ కర్నూలు క్రైం/ ఓర్వకల్లు, అక్టోబరు 7 (ఆంధ్రజ్యోతి): ఎన్టీఏ మూడోసారి అధికారం చేపట్టిన తర్వాత ప్రధానమంత్రి నరేంద్రమోదీ ఆంధ్రప్రదేశ్‌కు మూడోసారి రానున్నారు. కర్నూలు నుంచే ఈ నెల 16 జీఎస్టీ-2.0 సంస్కరణలు, ప్రయోజనా లపై ప్రజల్లో అవగాహన కల్పించేందుకు ప్రధాని మోదీ, సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్‌కళ్యాణ్‌ శంఖారావం పూరిస్తుండ డంతో అందరి దృష్టి కర్నూలుపై పడింది. కూటమి ప్రభుత్వం ఈ సభను ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. భారీ సక్సెస్‌ చేసేందుకు పక్కా ప్రణాళికలు సిద్ధం చేసింది. సీఎం చంద్రబాబు ఆదేశాలతో రాష్ట్ర మంత్రులు పయ్యావుల కేశవ్‌, టీజీ భరత్‌, అనగాని సత్యప్రసాద్‌, బీసీ జనార్ధన్‌రెడ్డిలు ఇప్పటికే కర్నూలులో పర్యటించారు. నన్నూరు టోల్‌ప్లాజా సమీపంలో 185 ఎకరాల విస్తీర్ణంలో ఉన్న రాగమయూరి వెంచన్‌ను ప్రధాని మోదీ సభకు ఎంపిక చేశారు. మంగళవారం కర్నూలుకు చేరుకున్న పీఎం ప్రోగ్రామ్‌ స్పెషల్‌ ఆఫీసర్‌ వీర పాండియన్‌ ఏర్పాట్లలో నిమగ్నమయ్యారు. కలెక్టర్‌ డాక్టర్‌ సిరి, ఎస్పీ విక్రాంత్‌పాటిల్‌ ఆధ్వర్యంలో సభా ప్రాంగణం, వాహనాల పార్కింగ్‌, సభా ప్రాంగణానికి రూట్‌మ్యాప్‌ తదితర అంశాలపై అధికారులు కరసత్తు చేస్తున్నారు. రాష్ట్ర సచివాలయం నుంచి వివిధ శాఖ ముఖ్య కార్యదర్శులు వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా జిల్లా అధికారులతో సమీక్షించారు. ప్రధాని సభకు మిగిలిన సమయం తొమ్మిది రోజులే. 14వ తేది సాయంత్రంలోగా ఏర్పాట్లు దాదాపుగా పూర్తి చేయాల్సి ఉంది. ఆ తరువాత కేంద్ర నిఘా, భద్రతా అధికారుల నిర్వహణలోకి సభా ప్రాంగణం వెళ్లే అవకాశం ఉంది. అంటే.. మిగిలిన సమయం కేవలం ఆరు రోజులే.

జిల్లా స్థాయి అధికారులకు బాధ్యతలు

సభా ఏర్పాట్లపై రూట్‌ మ్యాప్‌ తయారు చేశారు. వేదిక నిర్మాణం, పార్కింగ్‌, జన సమీకరణ, బస్సులు సమకూర్చడం, భోజనాలు, నీరు, భద్రత, ట్రాఫిక్‌ నియంత్రణ, ఏఏ రూట్లలో ఏ ప్రాంతానికి చెందిన వాహనాలు అనుమతించాలి.. వివిధ విభాగాలుగా పనులు విభజించారు. డ్వామా, డీఆర్‌డీఏ, హౌసింగ్‌, జడ్పీ, పంచా యతీ రాజ్‌. రోడ్లు భవనాలు శాఖ, విద్యుత్‌, సోషల్‌ వెల్ఫేర్‌... ఇలా వివిధ విభాగాల పీడీలు, సీఈవోలు, ఎస్‌ఈలకు బాధ్యతలు అప్పగించారు. జిల్లాలో వివిధ మండలాల్లో పని చేసే యంత్రాంగాన్ని రంగంలోకి దింపారు. వారితో స్పెషల్‌ అధికారి వీర పాండియన్‌, జిల్లా కలెక్టరు ఎ.సిరిలు వారితో సమీక్షలు, వీడియో కాన్ఫరెన్స్‌లు నిర్వహించారు. డ్వామా పీడీ వెంకటరమణయ్య, డీఆర్‌డీఏ రమణారెడ్డి, హౌసింగ్‌ పీడీ చిరంజీవి తదితరులు మండల స్థాయి అధికారులతో సమావేశమైన సభా ఏర్పాట్లను విభజించి బాధ్యతలు అప్పగించారు. ఉమ్మడి జిల్లాల నుంచి భారీ ఎక్స్‌కవేటర్లను తెప్పించి సభా ప్రాంగణం చదును చేసేందుకు ఏర్పాట్లు చేశారు. పార్కింగ్‌ కోసం 11 ప్రదేశాలు గుర్తించారు. వివిధ శాఖ అధికారుల అధికారులకు బాధ్యతలు అప్పగించారు. ముఖ్యంగా వీవీఐపీలు, వీఐపీలకు, సభా వేదిక ఏర్పాట్లు ఆదోని సబ్‌ కలెక్టర్‌ మౌర్య భరద్వాజ్‌కు అప్పగించారు. సేఫ్‌ రూమ్స్‌, స్పెషలిస్ట్‌ వైద్యులు, మెడికల్‌ టీమ్స్‌, అంబులెన్స్‌.. వంటి ఏర్పాట్లను ప్రభుత్వ జర్వజన వైద్యశాల సూపరింటెండెంట్‌, డీఎంహెచ్‌ఓలకు అప్పగించారు. వివిధ ఏర్పాట్లపై సుదీర్ఘంగా చర్చించారు.

భద్రతపై ప్రత్యేక దృష్టి

ప్రధాని మోదీ కర్నూలు పర్యటన ప్రారంభం మొదలు తిరిగి వెళ్లేంత వరకు ఎలాంటి భద్రతా సమస్యలు తలెత్తకుండా పక్కా వ్యూహంలో ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు. కర్నూలు రేంజ్‌ డీఐజీ డాక్టర్‌ కోయ ప్రవీణ్‌, ఎస్పీ విక్రాంత్‌ పాటిల్‌ పర్యవేక్షణలో భద్రతా ఏర్పాట్లు చేస్తున్నారు. పార్కింగ్‌, రూట్స్‌ డైవర్షన్‌, హెలిపాడ్‌ ఏర్పాట్లపై ప్రత్యేక దృష్టి పెట్టారు. ఎస్పీ విక్రాంత్‌ పాటిల్‌ పోలీస్‌ అధికారులతో ప్రత్యేకంగా సమీక్షించారు. సభా ఏర్పాట్లు, కర్నూలు, నంద్యాల జిల్లా నుంచి వచ్చే ప్రజలు సభా ప్రాంగణానికి ఎలా చేరుకోవలో రూట్లను క్షేత్రస్థాయిలో పరిశీలించి ఏర్పాట్లపై అధికారులకు పలు సూచనలు చేశారు. ఆదోని సబ్‌ కలెక్టర్‌ మౌర్య భరద్వాజ్‌, ఏఎస్పీ హుసేన్‌పీరా, కర్నూలు ఆర్డీవో సందీప్‌కుమార్‌, డీఎస్పీలు, సీఐలతో కలసి ఏర్పాట్లను పరిశీలించారు. అదే క్రమంలో భారీ ఎత్తున జనసమీకరణ చేసి ప్రధాని మోదీ సభను దిగ్విజయం చేయాలని కూటమి పార్టీ నాయకులు సన్నాహాలు చేస్తున్నారు.

Updated Date - Oct 08 , 2025 | 12:04 AM