Share News

కల్యాణం.. వైభోగం...

ABN , Publish Date - Mar 11 , 2025 | 11:54 PM

భక్తజన వరదా.. జ్వాలా నృసింహ నమోస్తుతే.. గోవిందా.. గోవిందా.. స్మరణతో ప్రముఖ వైష్ణవ క్షేత్రం అహోబిలం పులకించింది.

కల్యాణం.. వైభోగం...
ఎగువ అహోబిలంలో కల్యాణోత్సవం నిర్వహిస్తున్న వేదపండితులు

ఘనంగా అహోబిల నృసింహుడి కల్యాణోత్సవం

వేలాదిగా తరలివచ్చిన భక్తజనం

‘దిగువ’లో బృందలోలుడి అలంకరణలో ప్రహ్లాదవరదుడు

ఆళ్లగడ్డ(శిరివెళ్ల), మార్చి 11(ఆంధ్రజ్యోతి): భక్తజన వరదా.. జ్వాలా నృసింహ నమోస్తుతే.. గోవిందా.. గోవిందా.. స్మరణతో ప్రముఖ వైష్ణవ క్షేత్రం అహోబిలం పులకించింది. చెంచులక్ష్మి, నరసింహస్వామి వారి కల్యాణోత్సవం మంగళవారం సాయంత్రం కన్నులపండువగా సాగింది. చెంచులక్ష్మి సమేతుడైన వేంకటేశ్వర స్వామిని ప్రత్యేకంగా అలంకరించి వేదమంత్రోచ్ఛరణాలు, మంగళవాయిద్యాల మధ్య ముల్లోకాలు మురిసేలా మూడుముళ్ల బంధంతో జ్వాలా నరసింహస్వామి, చెంచులక్ష్మీ అమ్మవారు ఒక్కటైన మధురక్షణాలు భక్తులను మంత్రముగ్ధుల్ని చేశాయి. ఎగువ అహోబిలంలో అశేష భక్తజన సందోహం మధ్య స్వామి, అమ్మవార్ల తిరు కల్యాణోత్సవం వైభవంగా జరిగింది. అహోబిల మఠం 46వ పీఠాధిపతి శ్రీవణ్‌ శఠగోప శ్రీ రంగనాథ యతీంద్ర మహాదేశికన్‌ ఆధ్వర్యంలో ఆలయ ప్రధాన అర్చకుడు కిడాంబి వేణుగోపాలన్‌, మణియార్‌ సౌమ్యనారాయణన్‌, వేదపండితులు కల్యాణోత్సవాన్ని జరిపించారు. స్వామి, అమ్మవార్ల ఉత్సవమూర్తులకు అర్చకులు శాస్త్రోక్తంగా ఎదుర్కోళ్లు నిర్వహించారు. భక్తులు గోవింద నామస్మరణ చేస్తుండగా స్వామి, అమ్మవారికి అర్చకులు కంకణధారణ చేశారు. వేదపండితుల మంత్రాలు, భాజాభజంత్రీలు, మంగళవాయిద్యాల మధ్య మాంగళ్యధారణ కార్యక్రమం నిర్వహించారు. స్వామి, అమ్మవార్ల పాదాల వద్ద ముత్యాల తలంబ్రాలు పోసి అహోబిలేశుడి తిరు కల్యాణోత్సవాన్ని కన్నులపండువగా జరిపించారు. పద్మశాలీ సంఘం తరపున ప్రొద్దుటూరుకు చెందిన అగ్గారపు శివ శంకర్‌, అరుణ దంపతులు పట్టువస్ర్తాలు సమర్పించి స్వామివారి కల్యాణానికి ఉభయదారులుగా వ్యహరించారు.

వేణుగోపాలుడిగా ప్రహ్లాదవరదుడు

దిగువ అహోబిలంలో ప్రహ్లాదవరదస్వామి వేణుగోపాలుని అలంకారంలో భక్తులకు దర్శనమిచ్చారు. శ్రీదేవీ, భూదేవీ సమేత ప్రహ్లాదవరదస్వామి ఉత్సవమూర్తులను విశేషంగా అలంరించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. వేణుగోపాలుని అలంకారంలో స్వామివారు ఉభయదేవేరులకు ఊంజల్‌ సేవ నిర్వహించారు. అనంతరం పల్లకిలో కొలువై ఆలయ మాడ వీధుల్లో విహరించారు. శ్రీవారిని పట్టువస్త్రాలు, పూలమాలలతో విశేషంగా అలంకరించి రాత్రి పొన్నచెట్టు వాహనంపై కొలువుంచి తిరువీధుల్లో గ్రామోత్సవం నిర్వహించారు.

‘దిగువ’లో నేడు కల్యాణోత్సవం

అహోబిలం వార్షిక బ్రహ్మోత్సవాల్లో భాగంగా బుధవారం రాత్రి దిగువ అహోబిలంలో లక్ష్మీనృసింహస్వామి తిరు కల్యాణోత్సవం జరగనుంది. ఉదయం స్వామి, అమ్మవార్లకు అభిషేకం, సాయంత్రం గజ వాహన సేవ జరగనుంది. ఎగువ అహోబిల క్షేత్రంలో జ్వాలా నరసింహస్వామికి అర్చకులు ఉత్సవం, తొట్టి తిరుమంజనం, అశ్వ వాహన సేవ నిర్వహిస్తారు.

Updated Date - Mar 11 , 2025 | 11:54 PM