ఒక్కటైన 75 జంటలు
ABN , Publish Date - May 17 , 2025 | 12:31 AM
కర్నూలు నగరంలో రాష్ట్ర పరిశ్రమల శాఖ మంత్రి టీజీ భరత్, మాజీ ఎంపీ టీజీ వెంకటేశ్ కుటుంబం ఆధ్వర్యంలో శుక్రవారం 75 జంటలు ఒక్కట య్యాయి.
వివాహాలకు సహకరించిన మంత్రి టీజీ భరత్ కుటుంబ సభ్యులు
కర్నూలు కల్చరల్, మే 16 (ఆంధ్రజ్యోతి): కర్నూలు నగరంలో రాష్ట్ర పరిశ్రమల శాఖ మంత్రి టీజీ భరత్, మాజీ ఎంపీ టీజీ వెంకటేశ్ కుటుంబం ఆధ్వర్యంలో శుక్రవారం 75 జంటలు ఒక్కట య్యాయి. టీజీ వెంకటేశ్ జన్మదినం సందర్భంగా మంత్రి కుటుంబ సభ్యులు శుక్రవారం వివాహాలు చేసుకున్న 75 జంటలకు రూ.80 వేల చొప్పున చెక్కులను అందజేశారు. ఇప్పటికే వారికి మంగళసూత్రం, వధూవరులకు వస్త్రాలు తదితర సామగ్రిని అందజేశారు. దీంతో వివాహాలు చేసుకున్న జంటలను నగరంలోని మౌర్య ఇన్‌లోని పరిణయ ఫంక్షన్ హాలులో టీజీ వెంకటేశ్ దంపతులు ఆశీర్వదించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పెళ్లి చేసుకొని కొత్త జీవితాన్ని ప్రారంభిస్తున్న వారు ఎటువంటి చెడు వ్యసనాలకు లోనుకాకుండా ఆరోగ్యంగా ఉంటూ సంసారాన్ని చక్కదిద్దుకోవాలని సూచించారు. తన కుమారుడు మంత్రి టీజీ భరత్‌తో పాటూ కుటుంబ సభ్యుల సహకారం ఉన్నందునే తాను సేవా కార్యక్రమాలు నిర్వహించ గలుగుతున్నానని అన్నారు. మంత్రిగా టీజీ భరత్ కూడా ప్రజలకు సేవ చేయాలనే తలంపుతో రాజకీయాల్లోకి వచ్చారని, మంత్రిగా కర్నూలు జిల్లాలో పారిశ్రా మిక అభివృద్ధికి ఎంతగానో కృషి చేస్తున్నారన్నారు. పరిశ్రమలు రాకుండా కొంతమంది అడ్డుపడుతు న్నారని, వారి గురించి తెలుసుకుని అటువంటి వారికి దూరంగా ఉండాలని చెప్పారు.
మంత్రి టీజీ భరత్ మాట్లాడుతూ కర్నూలు ప్రజలకు ఏదో ఒక మంచిపని చేయాలని తన తండ్రి టీజీ వెంకటేశ్ ఆలోచిస్తుంటారని అన్నారు. 25 ఏళ్లుగా కులమతాలకు అతీతంగా సామూహిక వివాహాలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. తాము పెళ్లిళ్లు చేసిన జంటలన్నీ సంతోషంగా ఉండటం తమకు గర్వంగా ఉందన్నారు. తనకు తండ్రే రోల్ మోడల్ అని, ఆయనను స్ఫూర్తిగా తీసుకునే రాజకీయాల్లోకి వచ్చానన్నారు. పెట్టుబడులు తీసుకువచ్చే విషయంలో రాష్ట్రాల మధ్య ఎంతో పోటీ నెలకొందని అన్నారు. తమ ఫ్యాక్టరీ విస్తరణ చేసే విషయంలో ఇలాంటి రాజకీయాలు చేయడం సరికాదన్నారు. ఈ కార్యక్రమంలో టీజీ వెంకటేశ్ సతీమణి టీజీ రాజ్యలక్ష్మి, మంత్రి భరత్ సతీమణి టీజీ శిల్పాభరత్, టీజీ కుటుంబ సభ్యులు సునీల్, కృష్ణజ్యోత్స్న, రవిరాజ్, మౌర్య తదితరులు పాల్గొన్నారు.