Share News

ఎన్నో జ్ఞాపకాలు..

ABN , Publish Date - Dec 29 , 2025 | 11:53 PM

2025.. కందనవోలు ముంగిట మధుర జ్ఞాపకాలు..

ఎన్నో జ్ఞాపకాలు..

పారిశ్రామిక అభివృద్ధిపై చంద్రబాబు ఫోకస్‌

మరవలేని యోగాంధ్ర-2025 సదస్సులు

కళావిందు.. కర్నూలు ఉత్సవ్‌

ఆధ్యాత్మికత వెల్లివిరిసిన జాతరలు.. సంబరాలు

కష్టజీవులకు చేదు జ్ఞాపకాలు

సంతోషాలు... కష్టాలు.. కన్నీళ్లు మిగిల్చిన 2025

2025.. కందనవోలు ముంగిట మధుర జ్ఞాపకాలు.. సంతోషాలు.. విషాదాలు.. కష్టాలు.. కన్నీళ్లు మిగిల్చి రేపటి అర్ధరాత్రి 12 గంటలకు కాలగర్భంలో ఒదిగిపోనుంది. ఈ ఏడాదిలో పలు జ్ఞాపకాలు మిగిలిపోగా గత చరిత్రను గుర్తుకు తెచ్చాయి. కళావిందు కనువిందు చేశాయి. మరో వైపు పలు సంఘటనలు విషాదాన్ని నింపాయి. మనుషుల మనసును పిండేశాయి. కష్టజీవులకు కన్నీళ్లు పెట్టించాయి. కాలగమనంలో ఎన్నో జ్ఞాపకాలను మిగిల్చి 2025 కనుమరుగు కానుంది. బుధవారం అర్ధరాత్రి 12 గంటలకు కొంగొత్త ఆశలు.. ఆశయాలతో 2026 సంవత్సరం ఉదయించబోతుంది. ఈ ఏడాది జనవరి నుంచి డిసెంబరు వరకు కందనవోలు గడ్డపై చోటు చేసుకున్న ముఖ్యమైన సంఘటనలు.. సంబరాలు.. సంతోషాలను అవలోకనం చేసుకుందాం.

-కర్నూలు, డిసెంబరు 29 (ఆంధ్రజ్యోతి)

పారిశ్రామిక ప్రగతి అడుగులు

జిల్లాలో ఆరు కొత్త పరిశ్రమలు, మూడు ఎంఎ్‌సఎంఈ పార్కులకు సీఎం చంద్రబాబు వర్చువల్‌ ద్వారా శంకుస్థాపన చేశారు. ఇందులో కర్నూలు (ఓర్వకల్లు) విమానాశ్రయం వద్ద ఫ్లయింగ్‌ ట్రైనింగ్‌ ఆర్గనైనేషన్‌ (ఎఫ్‌టీఓ), ఓర్వకల్లు పారిశ్రామిక నోడ్‌లో 300 ఎకరాల్లో నిర్మించే దేశంలోనే తొలి డ్రోన్‌ సిటీ, రూ.1,622 కోట్లతో బ్రాహ్మణపల్లి వద్ద నిర్మించే రిలయన్స్‌ కన్స్యూమర్‌ ప్రొడక్ట్స్‌, రూ.285 కోట్ల పెట్టుబడితో చేపట్టిన సిగాచీ ఇండస్ట్రిస్‌.. వంటి కీలక ప్రాజెక్టులు ఉన్నాయి.

యోగా కర్నూలు.. యోగాంధ్ర-2025

అంతర్జాతీయ యోగా దినోత్సవం (జూన్‌ 21) పురస్కరించుకుని రాష్ట్ర ప్రభుత్వం యోగాంధ్ర-2025 కార్యక్రమం పేరిట నెల రోజులు అవగాహన కార్యక్రమాలు నిర్వహించింది. అదే స్ఫూర్తితో కర్నూలులో నెల రోజులు పాటు నిత్యజీవితంలో యోగా ఆవశ్యకతపై అవగాహన కల్పించారు. జూన్‌ 21న అవుట్‌ డోర్‌ స్టేడియం, రాయలసీమ యూనివర్సిటీ, బుద్ధ పిరమిడ్‌ ధ్యాన కేంద్రం తదితర సంస్థల ఆధ్వర్యంలో యోగా దినోత్సవం ఘనంగా నిర్వహించారు. యోగా ఆసనాలతో రికార్డులోకెక్కారు.

దేవరగట్టు.. కర్రపట్టు

దక్షణాది రాష్ట్రాల్లో ప్రత్యేకమైన దేవరగట్టు కర్రల సమరం (బన్నీ ఉత్సవం) జరిగింది. మాళమల్లేశ్వరస్వామి విజయోత్సవాన్ని పురస్కరించుకుని విజయ దశమి రోజున నిర్వహించిన సంప్రదాయ బన్నీ ఉత్సవంలో ఆధ్యాత్మిక విల్లివిరిసింది. లక్షలాది భక్తజనం పాల్గొన్నారు. కర్రల సమరంలో జరిగిన తొక్కిసలాట, హింస కారణంగా ఇద్దరు మరణిస్తే, వంద మందికిపైగా గాయపడ్డారు.

కళావిందు.. కర్నూలు ఉత్సవ్‌

ఆంధ్ర రాష్ట్ర అవతరణను పురస్కరించుకుని టీజీవీ కళాక్షేత్రం ఆధ్వర్యంలో ‘కర్నూలు ఉత్సవ్‌’ కళా సంబరాలు నవంబరు 1-7 వరకు వారం రోజులు పాటు ఎంతో ఘనంగా నిర్వహించారు. ఆంధ్ర రాష్ట్ర తొలి రాజధాని కర్నూలు వైభవం, చారిత్రాత్మక వైభవం, ఆధ్యాత్మికత, సంస్కృతి, సాహిత్యం, వ్యాసరచన పోటీలతో విద్యార్థులు, యువతరానికి అవగాహన కల్పించారు. కళా ప్రదర్శనలతో కనువిందు చేశారు. ఏడు రోజుల పాటు నిర్వహించిన నాటక పోటీల్లో 70కి పైగా బృందాలు తమ ప్రదర్శనలు ఇవ్వడంతో తెలుగుబుక్‌ ఆఫ్‌ రికార్డ్స్‌లో టీజీవీ కళాక్షేత్రం చోటు దక్కించుకుంది.

జాతరలు.. సందళ్లు

రైతుల జాతరగా పిలిచే ఎమ్మిగనూరు నీలకంఠేశ్వరస్వామి జాతర మహోత్సవం, మహా రథోత్సవం దేదిప్యమానంగా జరిగింది. నెల రోజులు పాటు జరిగే ఈ జాతరలో వ్యవసాయ పరికరాలు, కాడెద్దులు, వంటసామగ్రి విక్రయాలకు ప్రసిద్ధి. ఏప్రిల్‌ 24న కోడుమూరు నియోజకవర్గం గూడూరు తిమ్మగురుడుస్వామి జాతర రథోత్సవం కన్నుల పండువగా జరిగింది. మార్చి 1-6 వరకు, ఆగస్టు 8 - 14 వరకు దక్షణాది ఆధ్యాత్మిక క్షేత్రం మంత్రాలయం శ్రీరాఘవేంద్రస్వామి గురు వైభవోత్సవాలు, ఆరాధనోత్సవాలు ఘనంగా నిర్వహించారు. గురు వైభవోత్సవాలకు రాష్ట్ర విద్య, ఐటీ శాఖ మంత్రి నారా లోకేశ్‌ హాజరయ్యారు. మే 19న ఆదోని అవదూత మహాయోగి లక్ష్మమ్మవ్వ జాతర మహోత్సవం కనువిందు చేసింది. వెండి రథంపై అవ్వను ఊరేగించారు.

కన్నీటి వీడ్కోలు

ఆలూరు నియోజకవర్గం మాజీ ఎమ్మెల్యే జి.లోక్‌నాథ్‌ గుండెపోటుతో మృతి చెందారు. 1989లో కాంగ్రెస్‌ అభ్యర్థిగా పోటీ చేసి విజయం సాధించారు. టీటీడీ సభ్యుడిగా పని చేశారు. ఐదేళ్లు ఎమ్మెల్యే, టీటీడీ సభ్యుడిగా పని చేసినా.. సాధారణ జీవనం గడిపారు. మాజీ ఎమ్మెల్యేలకు ఇచ్చే పింఛన్‌ ద్వారానే జీవనయానం సాగించారు.

రాయలసీమ సాగునీటి నిపుణుడు, రిటైర్డ్‌ ఈఈ సుబ్బరాయుడు అనారోగ్యంతో కన్నుమూశారు. కడలిపాలు అవుతున్న కృష్ణా, తుంగభద్ర జలాలను సద్వినియోగం చేసుకుంటే కరువు సీమను సస్యశామలం చేయవచ్చని పరితపించేవారు. గుండ్రేవుల ప్రాజెక్టు, వేదవతి ప్రాజెక్టు రూపశిల్పి. సిద్ధేశ్వరం ప్రాజెక్టు కోసం తుది శ్వాస వీడేవరకు పోరాడారు.

కష్టజీవులు.. ఎన్నెన్నో కష్టాలు

ఉల్లి ధరలు పతనం అయ్యాయి. క్వింటా రూ.250కు పడిపోయింది. గిట్టుబాటు ధర కోసం రైతులు రోడ్డెక్కారు. మద్దతు ధర చెల్లించి కష్టజీవుల కన్నీళ్లు తుడవాలంటూ ఏకరువు పెట్టారు. ఉల్లి రైతులను కూటమి ప్రభుత్వం భరోసాగా నిలిచింది. క్వింటా రూ.1,200 ప్రకారం ఏపీ మార్క్‌ఫెడ్‌ ద్వారా కొనుగోలు చేపట్టింది. 1.55 లక్షల క్వింటాళ్లు ఉల్లి దిగుబడులు 2,800 రైతుల నుంచి సేకరించారు. వాటి విలువ రూ.17 కోట్లు పైమాటే. పత్తి ధరలు కూడా పతనం కావడంతో సీసీఐ ద్వారా మద్దతు ధరకు 19,902 మంది రైతుల నుంచి 6,494 క్వింటాళ్లు సేకరించారు. వాటి విలువ రూ.473.75 కోట్లు. అయితే.. ఈ ఏడాది రైతులు పండించిన పంట ఉత్పత్తులకు మద్దతు ధర లేకపోవడంతో కష్టజీవులకు కష్టాలు.. కన్నీళ్లే మిగిలాయి.

Updated Date - Dec 29 , 2025 | 11:53 PM