మాల్స్.. డేంజర్ బెల్స్..!
ABN , Publish Date - Sep 25 , 2025 | 11:11 PM
శ్రీకాకుళం నగరంలోని ఈ ఏడాది జనవరి 24న సౌత్ ఇండియా షాపింగ్ మాల్‌లో భారీ అగ్ని ప్రమాదం జరిగింది.
ప్రజల ప్రాణాలకు రక్షణ ఏదీ..?
ఫైర్ సేఫ్టీ చర్యలు పట్టించుకోని వస్త్ర దుకాణాలు
నిబంధనలకు విరుద్ధంగా వస్త్రాలయం
పట్టించుకోని నగర పాలక అధికారులు
కర్నూలు, సెప్టెంబరు 25 (ఆంధ్రజ్యోతి): శ్రీకాకుళం నగరంలోని ఈ ఏడాది జనవరి 24న సౌత్ ఇండియా షాపింగ్ మాల్‌లో భారీ అగ్ని ప్రమాదం జరిగింది. రూ.కోట్లు విలువైన వస్త్రాలు, ఇతర సామగ్రి అగ్నికి దగ్ధమయ్యాయి. వేకువజామున ప్రమాదం జరగడంతో ఆస్తి నష్టం తప్పా ఎలాంటి ప్రాణనష్టం జరగలేదు. అదే ప్రమాదం సాయం త్రం జరిగి ఉంటే..? ఊహించుకోవడానికే భయమేస్తుంది. కర్నూలు నగరంలో కూడా బహుళ అంతస్తుల షాపింగ్ మాల్స్, వస్త్రాలయాలు వెలుస్తున్నాయి. నిత్యం వినియోగదారులతో రద్దీగా ఉంటున్నాయి. అగ్ని ప్రమాదాలు జరిగితే ప్రాణ నష్టం నివారించే ఫైర్ సేఫ్టీ చర్యలు పలు షాపింగ్ మాల్స్ పాటించడం లేదు. అగ్నిమాపక శాఖల నుంచి నిరభ్యంతర పత్రం (ఎన్‌వోసీ) తీసుకోవడం లేదు. నంద్యాల చెక్‌పోస్ట్ సమీపంలో అగ్నిమాపక శాఖ ఎన్‌వోసీ లేకుండానే బుధవారం ఎంతో ఆర్భాటంగా ‘వస్త్రాలయం’ ప్రారంభించారు. ప్రారంభ ఆఫర్ ఇవ్వడంతో వేలాది మంది ప్రజలు అక్కడకు తరలివెళ్లారు. ఆ సమయంలో అగ్ని ప్రమాదం జరిగితే బాధ్యులెవరు? అగ్నిమాపక శాఖ ఎన్‌వోసీ లేకుండా బహుళ అంతస్తుల భవనం నిర్మాణానికి కార్పొరేషన్, కుడా అధికారులు అనుమతులు ఎలా ఇచ్చారో వారికే తెలియాలి. ఫైర్ సేఫ్టీ నిబంధనలు పాటించని ఆ వస్త్రాలయంపై జిల్లా ఫైర్ అధికారులు ఎలాంటి చర్యలు తీసుకుంటారో మరి. ధన, రాజకీయ బలంతో నిబంధనలు బుగ్గిపాలు చేస్తున్న షాపింగ్ మాల్స్‌పై చర్యలు తీసుకోవడంలో కార్పొరేషన్ అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని స్పష్టం తెలుస్తోంది. ఇప్పటికైనా షాపింగ్ మాల్స్‌లో అధికారులు తనిఖీలు నిర్వహించి ఫైర్ సేఫ్టీ చర్యలు తీసుకోవాలని సర్వత్రా డిమాండ్లు వ్యక్తమవుతున్నాయి.
కర్నూలు నగరం దినదినాభివృద్ధి జరుగుతుంది. అదే క్రమంలో ప్రజల అవసరాల కోసం వివిధ షాపింగ్ మాల్స్ కూడా వస్తున్నాయి. నగరాభివృద్ధిలో భాగంగా షాపింగ్ మాల్స్‌ను స్వాగతించాల్సిందే. అయితే ఆ మాల్స్‌లో వివిధ వస్తువులు, వస్త్రాలు కొనుగోలు కోసం వచ్చే ప్రజలు, వినియోగదారుల ప్రాణాలకు రక్షణ ప్రశ్నార్థకంగా మారుతోంది. ఇందుకు ఫైర్ సేఫ్టీ చర్యలు పాటించకుండా, అగ్ని మాపక శాఖ నిరభ్యంతర పత్రాలు లేకుండానే బహుళ అంతస్తుల నిర్మాణాలు చేపట్టడం, షాపింగ్ మాల్స్ ఏర్పాటు చేయడం పైనే విమర్శలు వెల్లువెత్తున్నాయి. నగరంలో సీ క్యాంప్ - నంద్యాల చెక్ పోస్ట్ ప్రధాన రహదారి ఏరియా, గాంధీనగర్, పెద్దపార్క్ రోడ్, బస్టాండ్ రోడ్ తదితర ప్రాంతాల్లో మాల్స్ ఏర్పాటు అవుతున్నాయి. వ్యాపారం, ధనాపేక్షే తప్పా వినియోగదారుల ప్రాణాలకు రక్షణ కల్పించచడం లేదనే ఆరోపణలు బలంగా ఉన్నాయి. మెజార్టీ షాపింగ్ మాల్స్‌కు అగ్నిమాపక శాఖ నుంచి నో అబ్జెక్షన్ సర్టిఫికెట్ (ఎన్‌వోసీ) తీసుకోలేదని ఆ శాఖ అధికారుల ద్వారా తెలుస్తోంది. ఇటీవలే సీఎంఆర్ షాపింగ్ మాల్ యాజమాన్యం అగ్నిమాపక శాఖ ఎన్‌వోసీ కోసం దరఖాస్తు చేస్తే నిబంధనల ప్రకారం 25 వేల లీటర్ల సామర్థ్యం కలిగిన వాటర్ ట్యాంక్ లేదని దరఖాస్తును ఆశాఖ అధికారులు తిరస్కరించారు.
ఫైర్ సేఫ్టీ నిబంధనలు బుగ్గిపాలు
నంద్యాల చెక్‌పోస్ట్ ఏరియా సమీపంలో బహుళ అంతస్తుల భవనం (సెల్లార్‌తో పాటు జీ+4)లో బుధవారం వస్త్రాలయం షాపింగ్ మాల్ ప్రారంభించారు. ఆ భవనాన్ని పరిశీలిస్తే ఫైర్ సేఫ్టీ నిబంధనలు తొక్కేశారు. తమ శాఖ నుంచి ఎన్‌ఓసీ తీసుకోలేదని అగ్ని మాపక శాఖ అధికారులు తెలిపారు. ఫైర్ సేఫ్టీ నిబంధనల ప్రకారం ఫైర్ ఎగ్జిట్‌లు, హైడ్రెంట్‌లు, స్ర్పింక్లర్లు, పంప్ రూమ్‌లు ఏర్పాటు చేయాలి. మాల్‌లోకి వెళ్లేందుకు ప్రవేశ ద్వారం (ఎంట్రెన్స్ మెయిన్ డోర్), బయటకు వెళ్లేందుకు ఎగ్జిట్ డోర్, పై అంతస్తుల్లో ప్రవేశ (ఎంట్రీ), నిర్గమన (ఎగ్జిట్) కోసం వేరువేరు మార్గాలు, భద్రతపై సైనేజ్ బోర్డులు, స్మోక్ అలారం.. వంటివి ఏర్పాటు చేయాలి. అలాగే 500 స్క్వైర్ మీటర్లు దాటిన బహుళ అంతస్తుల భవనాలకు రెండు మీటర్లు వెడల్పుతో మెట్ల మార్గం ఉండాలని ఫైర్ అధికారులు హెచ్చరిస్తున్నారు. ఇందులో మెజార్టీ నిబంధనలు పాటించలేదని, ముఖ్యంగా అనుకోని అగ్ని ప్రమాదాలు జరిగితే ప్రాణ నష్టం నివారించేందుకు వీలుగా ఎంట్రీ, ఎగ్జిట్ రెండు మార్గాలు ఏర్పాటు చేయలేదని తెలుస్తోంది. అయితే. మెట్ల మార్గంలో అంతస్తు అంతస్తుకు ఓ కిటికీని ఏర్పాటు చేసి ‘ఫైర్’ అని మాత్రం రాశారు. ఆ గూడులో ఏముందో తెలుసుకోవడానికి తలుపు తీయడానికి ప్రయత్నిస్తే తెరుచుకోలేదని మాల్‌కు వెళ్లిన పలువురు పేర్కొనడం కొసమెరుపు. ఫైర్ సేఫ్టీ నిబంధనలు బుగ్గిపాలు చేసిన వస్త్ర షాపింగ్ మాల్ యాజమాన్యంపై అగ్ని మాపక శాఖ, కుడా, నగర పాలక సంస్థ, పోలీస్ శాఖ అధికారులు చర్యలు తీసుకుంటారా..? నోటీసులు ఇచ్చి సరిపుచ్చుతారా..? తమకేమి పట్టనట్లు ఉంటారా? అన్నది వేచి చూడాలి.
అగ్ని మాపక శాఖ అనుమతులు లేవు
నంద్యాల చెక్ పోస్ట్ ఏరియా సమీపంలో ప్రారంభించిన ‘వస్త్రాలయం’ షాపింగ్ మాల్ యాజమాన్యం అగ్ని మాపక శాఖ నుంచి నో అబ్జెక్షన్ సర్టిఫికెట్ (ఎన్‌ఓసీ) తీసుకోలేదు. బహుళ అంతస్తుల భవనాల నిర్మాణాలకు తప్పకుండా అగ్ని మాపక శాఖ ఎన్‌ఓసీ తీసుకోవాలి. ఎన్‌ఓసీ లేకుండా బహుళ అంతస్తుల భవన నిర్మాణాలకు అనుమతులు ఇవ్వవద్దని 2008-09లో మున్సిపల్ శాఖకు అగ్ని మాపక శాఖ లేఖ రాసింది. నిబంధనల ప్రకారం 25 వేల లీటర్ల సామర్థ్యంలో వాటర్ ట్యాంక్, 15 హెచ్‌పీ పంపు, 9 ఎల్‌పీఎం రెండు పంపులు, ముఖ్యంగా ఎంట్రెన్స్, ఎగ్జిట్ డోర్లతో పాటు, పై అంతస్తుల్లో ఎంట్రీ, ఎగ్జిట్ రెండు మార్గాలు ఏర్పాటు చేయాలి. ఫైర్ సేఫ్టీ నిబంధనలు పాటించాల్సి ఉంది. పై అధికారుల దృష్టికి తీసుకువెళ్లి నోటీసు జారీ చేస్తాం. ఫైర్ సేఫ్టీ నిబంధనలు పాటించేలా చర్యలు తీసుకుంటాం.
- వై.చిన్న బజారి, ఇన్‌చార్జి అసిస్టెంట్ జిల్లా అగ్నిమాపక అధికారి, కర్నూలు