Share News

గణేశ్‌ ఉత్సవాలను విజయవంతం చేయాలి

ABN , Publish Date - Aug 22 , 2025 | 11:18 PM

గణేశ్‌ ఉత్సవాల్లో అధికారులు, కమిటీ సభ్యులు సమన్వయంగా వ్యవహరిస్తూ ఉత్సవాలను విజయవంతంగా పూర్తి చేయాలని కలెక్టర్‌ రాజకుమారి కోరారు.

గణేశ్‌ ఉత్సవాలను విజయవంతం చేయాలి
జూట్‌ బ్యాగ్స్‌ను ఆవిష్కరిస్తున్న కలెక్టర్‌, ఎస్పీ, అధికారులు

అధికారులు, కమిటీ సభ్యులు సమన్వయంతో ముందుకెళ్లాలి

కలెక్టర్‌ రాజకుమారి

నంద్యాల ఎడ్యుకేషన్‌, ఆగస్టు 22 (ఆంధ్రజ్యోతి): గణేశ్‌ ఉత్సవాల్లో అధికారులు, కమిటీ సభ్యులు సమన్వయంగా వ్యవహరిస్తూ ఉత్సవాలను విజయవంతంగా పూర్తి చేయాలని కలెక్టర్‌ రాజకుమారి కోరారు. నంద్యాల కలెక్టర్‌ కార్యాలయంలోని వీసీ హాల్‌లో వినాయక చవితి ఉత్సవాల ఏర్పాట్లపై ఎస్పీ అధిరాజ్‌సింగ్‌రాణా, జేసీ విష్ణుచరణ్‌తో కలిసి సంబంధిత అధికారులు, ఉత్సవ కమిటీ సభ్యులతో సమన్వయ సమావేశం నిర్వహించారు. కలెక్టర్‌ మాట్లాడుతూ చిన్నచెరువు వద్ద ఐదు నిమజ్జన పాయింట్లు ఏర్పాట్లు చేయాలని, బండ్‌ను పటిష్టంగా ఉండేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. నిమజ్జన సమయంలో గత ఈతగాళ్లను ఏర్పాటు చేయాలని మత్స్యశాఖ అధికారులను, విగ్రహాలను ఏర్పాటుచేసే చోట సరిపడా లైటింగ్‌ ఉండేలా చూసుకోవాలని విద్యుత్‌ అధికారులను, నిమజ్జన పరిసర ప్రాంతాల్లో శానిటేషన్‌ పకడ్బందీగా నిర్వహించాలని మున్సిపల్‌ అధికారులను, మెడికల్‌ క్యాంపులు ఏర్పాటు చేయాలని డీఎంహెచ్‌వోను, ట్రాఫిక్‌కు ఇబ్బంది లేకుండా చూసుకోవాలని పోలీసుశాఖను ఆదేశించారు. నీటి ప్రవాహం అధికంగా ఉండడంతో తగిన చర్యలు తీసుకోవాలని కేసీ కెనాల్‌ అధికారులకు సూచించారు. ఎస్పీ అధిరాజ్‌సింగ్‌రాణా మాట్లాడుతూ విగ్రహాల ఏర్పాటుకు గణేశ్‌ ఉత్సవ.నెట్‌లో నమోదు చేసుకోవడం ద్వారా సింగిల్‌ విండో అనుమతులు ఇవ్వనున్నట్లు తెలిపారు. అనంతరం పర్యావరణ పరిరక్షణలో భాగంగా మట్టి వినాయకున్ని పూజిద్దాం, పర్యావర ణాన్ని పరిరక్షిద్దాం అని ముద్రించిన జూట్‌ బ్యాగ్స్‌ను ఆవిష్కరించారు. సమావేశంలో డీఆర్వో రామునాయక్‌, ఏఎస్పీ మంద జావలి, ఆర్డీవోలు విశ్వనాథ్‌, నాగజ్యోతి తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Aug 22 , 2025 | 11:18 PM