ప్రతి ఉద్యోగి మెరుగైన సేవలందించండి
ABN , Publish Date - Sep 08 , 2025 | 11:41 PM
: ప్రతి ఉద్యోగి వినియోగదారులకు మెరుగైన సేవలందించాలని ఏపీఎస్‌పీడీసీఎల్ సీఎండీ సంతోషరావ్ అన్నారు.
ట్రాన్స్‌ఫార్మర్ల మరమ్మతులు తక్షణమే చేపట్టండి
‘సూర్యఘర్’ను ప్రజలకు చేరువ చేయాలి
ఏపీఎస్‌పీడీసీఎల్ సీఎండీ సంతోష్ రావ్
విద్యుత్ ఉద్యోగుల చైతన్య సదస్సు
నంద్యాల కల్చరల్, సెప్టెంబరు 8 (ఆంధ్రజ్యోతి): ప్రతి ఉద్యోగి వినియోగదారులకు మెరుగైన సేవలందించాలని ఏపీఎస్‌పీడీసీఎల్ సీఎండీ సంతోషరావ్ అన్నారు. సోమవారం సాయంత్రం నంద్యాల ఎల్‌కేఆర్ ఫంక్షన్‌హాలులో విద్యుత్ ఉద్యోగుల చైతన్య సదస్సు నిర్వహించారు. నంద్యాల విద్యుత్ శాఖ ఎస్‌ఈ సుధాకర్‌రావు ఆధ్వర్యంలో జరిగిన ఈసదస్సుకు సీఎండీతో పాటు డైరక్టర్ గురువయ్య ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా సీఎండీ మాట్లాడుతూ విద్యుత్ ఉద్యోగులు తమ విధి నిర్వహణలో ప్రత్యేకించి దృష్టి సారించాల్సిన అంశాలపై అవగాహన కల్పించారు. ఈ క్రమంలో విద్యుత్ పంపిణీలో నష్టాలు, అంతరాయాలు, త్రీఫేజ్ కరెంట్, అమరికలు, సూర్యఘర్, ప్రతి ట్రాన్స్‌పార్మర్‌కు ఏబీ స్విచ్ బిగింపులు వంటి పలు అంశాలపై విద్యుత్ ఉద్యోగులకు చైతన్యం కలిగించారు. గ్రామీణ ప్రాంతాల్లో త్రీఫేజ్ కరెంటు సరఫరా చేయడంతో ఆ గ్రామాల అభివృద్ధ్ధితో పాటు పారిశ్రామికంగా అభివృద్ధి గణనీయంగా ఉంటుందన్నారు. టుందన్నారు. ఆర్‌డీఎస్ స్కీమ్ కింద గ్రామాల్లో కరెంటు సరపరా కు అయ్యే ఖర్చులో కేంద్రం 70శాతం, రాష్ట్రం 30శాతం భరిస్తుందన్నారు . గ్రామీణ పట్టణ ప్రాంతాల్లో ట్రాన్స్‌ఫార్మర్లు మరమ్మతులు ఏర్పడినప్పుడు వెంటనే తక్షణ చర్యలు తీసుకోవాలన్నారు. విద్యుత్ పునరుద్దరణకు అవసరమైన ఏర్పాట్లను తాము అందించగలమన్నారు.
సూర్యఘర్ కీలక పాత్ర
సంప్రదాయ విద్యుత్‌కు ప్రత్యామ్నాయంగా సూర్యఘర్ కీలకపాత్ర వహించనుందన్నారు. రాబోయే తరం సూర్యఘర్‌తోనే సాకారం అవుతుందన్నారు. సూర్యఘర్ ప్రజలను చేరువచేసేందుకు ప్రజలను చైతన్యపరచాల్సిన భాద్యత ఉద్యోగులదే అన్నారు. ప్రతి ఉద్యోగి తమవంతు ఆదర్శంగా సూర్యఘర్ ఏర్పాటుచేసుకోవాలన్నారు. ఆరేళ్లలో ఉచిత విద్యుత్ పొందగలరని వినియోగదారులకు సూచించాలన్నారు. విద్యుత్ పంపిణీలో వినియోగదారుల సంతృప్తి ఇంకా మెరుగుపరుచుకోవాలని సూచించారు. విద్యుత్ పంపిణీలో వినియోగా దారులకు జరుగుతున్న అసౌకర్యాలను దృష్టిలో పెట్టుకొని ఎప్పటికప్పుడు సాధన దిశలో పరిష్కారం చేస్తే నూటికి నూరు శాతం ప్రభుత్వం ఆశించినట్లుగా విద్యుత్ శాఖ సేవలందించినట్లేనని ఆశాభావం వ్యక్తంచేశారు. కార్యక్రమంలో ఎపీఎస్పీడిసియల్ డైరక్టర్ గురువయ్య, నంద్యాల జిల్లా విద్యుత్‌శాఖ డీఈలు, ఏడీలు, ఎఈఈలు, లైన్‌ఇన్‌స్పెక్టర్లు, లైన్‌మెన్లు పాల్గొన్నారు.