పకడ్బందీగా ఏర్పాట్లు చేపట్టండి
ABN , Publish Date - May 16 , 2025 | 12:36 AM
రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఈనెల 17వ తేదీన సీ.క్యాంపు రైతుబజారులో పర్యటిస్తున్నారని, ఏర్పాట్లను పకడ్బందీగా చేపట్టాలని వివిధ విభాగాల అధికారులను కలెక్టర్ రంజిత్ బాషా ఆదేశించారు.
ప్రతి షాపు వద్ద డస్ట్ బిన్లు ఏర్పాటు చేయాలి
పనులు త్వరగా పూర్తి చేయాలి
పార్కు సుందరీకరణ వివరాల ఫ్లెక్సీ ఏర్పాటు చేయాలి
సీఎం పర్యటన ఏర్పాట్లను ఎస్పీతో కలిసి పరిశీలించిన కలెక్టర్
కర్నూలు అగ్రికల్చర్, మే 15 (ఆంధ్రజ్యోతి): రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఈనెల 17వ తేదీన సీ.క్యాంపు రైతుబజారులో పర్యటిస్తున్నారని, ఏర్పాట్లను పకడ్బందీగా చేపట్టాలని వివిధ విభాగాల అధికారులను కలెక్టర్ రంజిత్ బాషా ఆదేశించారు. సీఎం పర్యటన సందర్భంగా రైతుబజారులో చేపట్టిన కార్యక్రమాలు, ప్రజా వేదికకు సంబంధించి చేస్తున్న ఏర్పాట్లను ఎస్పీతో కలిసి కలెక్టర్ గురువారం సాయంత్రం పరిశీలించారు. ప్రతి షాపు వద్ద డస్టుబిన్‌లను ఏర్పాటు చేయాలని, వాటికి నెంబర్లు వేయాలని అధికారులను ఆదేశించారు. రైతుబజారు షెడ్డుపైన ఎండ వేడిమి లేకుండా గ్రీన్‌షెడ్డు ఏర్పాటు చేయాలన్నారు. సమయం ఎక్కువగా లేనందున పనులు త్వరగా చేయాలని ఎప్పటికప్పుడు పనులు ఎంతవరకు పూర్తయ్యాయో తనకు సమాచారం అందించాలని మార్కెటింగ్ శాఖ అధికారులను ఆదేశించారు. రైతుబజారు లోపల, బయట పరిసరాలు, టాయిలెట్లు శుభ్రంగా ఉండేలా చూసుకోవాలన్నారు. అనంతరం ధనలక్ష్మి నగర్‌లో స్వచ్ఛాంధ్ర పార్కుకు ముఖ్యమంత్రి శంకుస్థాపన చేయనున్న సందర్భంగా అక్కడ కోడ్ ఏర్పాట్లను పరిశీలించారు. పార్కులో ప్లాంటేషన్ ప్రోగ్రాం ఏర్పాటు చేయాలని అటవీ శాఖ అధికారిని ఆదేశించారు. ఈ పార్కులో సుందరీకరణ వివరాలను తెలియజేసే విధంగా ఫ్లెక్సీని రూపొందించాలన్నారు. అనంతరం కేంద్రీయ విద్యాలయం పక్కన ఉన్న ఖాళీ స్థలంలో ప్రజావేధిక ఏర్పాట్లను అధికారులను అడిగి తెలుసుకున్నారు. బందోబస్తు, పార్కింగ్, వేదిక తదితర ఏర్పాట్లపై ఎస్పీ విక్రాంత్ పాటిల్, రైతుబజార్ స్టేట్ సీఈవో మాధవీలత, మార్కెటింగ్ శాఖ కమిషనర్ అండ్ డైరెక్టర్ విజయ సునీత, జేసీ నవ్య, పత్తికొండ ఎమ్మెల్యే కేఈ శ్యాంబాబు, కర్నూలు ఆర్డీవో సందీప్, జడ్పీ సీఈవో నాసరరెడ్డి, టీడీపీ జిల్లా అధ్యక్షుడు తిక్కారెడ్డి పరిశీలించారు. అంతకుముందు సీఎం పర్యటన ఏర్పాట్లలో భాగంగా ఎస్పీతో కలిసి కలెక్టర్ ఓర్వకల్లు ఎయిర్‌పోర్టును పరిశీలించారు. అక్కడ భద్రతా ఏర్పాట్లను త్వరితగతిన పూర్తి చేయాలని డైరెక్టర్‌ను ఆదేశించారు.