రైతును ఆదుకొనే మాంథన్ యోజన
ABN , Publish Date - Nov 27 , 2025 | 12:39 AM
ఆదరణ కోల్పోయి, వృద్ధాప్యంలో కష్టాల్లో ఉన్న రైతులకు అండగా ఉండటానికి కేంద్ర ప్రభుత్వం పీఎం కిసాన్ మాంథన్ యోజన పథకం తెచ్చింది.
అవగాహన లేక అవకాశాన్ని కోల్పోతున్న రైతులు
తక్కువ ప్రీమియంతో వృద్ధాప్యంలో ఆసరా ఫ ప్రచారంలోకి రాని కేంద్ర ప్రభుత్వ పథకం
కర్నూలు అగ్రికల్చర్, నవంబరు 26 (ఆంధ్రజ్యోతి): ఆదరణ కోల్పోయి, వృద్ధాప్యంలో కష్టాల్లో ఉన్న రైతులకు అండగా ఉండటానికి కేంద్ర ప్రభుత్వం పీఎం కిసాన్ మాంథన్ యోజన పథకం తెచ్చింది. అయితే ఈ పథకం గురించి రైతులకు పెద్దగా తెలియదు. చెప్పే వాళ్లూ లేరు. గ్రామాల్లో రైతు సేవా కేంద్రాల సిబ్బందిగానీ, వారానికో, నెలకో గ్రామాలకు వెళ్లే వ్యవసాయ శాఖ అధికారులుగానీ ఈ పథకం గురించి రైతులకు చెబుతున్న పాపాన పోవడం లేదు. రైతులకు ఉపయోగపడే ఈ పథకం గురించి వ్యవసాయ శాఖ అధికారులే గాకుండా అన్ని విభాగాల అధికారులు రైతులకు తెలియచెప్పాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఇప్పటి వరకు రాష్ట్ర ప్రభుత్వం వృద్ధులు, దివ్యాంగులు, వితంతువులు, ఒంటరి మహిళలకు పింఛన్లు అందిస్తుండగా.. ప్రస్తుతం కేంద్రం ప్రత్యేకంగా కష్టాల్లో రైతుల కోసం ఈ పథకాన్ని అమలులోకి తెచ్చింది.
ఐదెకరాల్లోపు రైతులే అర్హులు
ఈ పథకానికి 40 ఏళ్లలోపు, ఐదెకరాల్లో వ్యవసాయ భూమి ఉన్న చిన్న, సన్నకారు రైతులే ఈ పథకానికి అర్హులు. భూరికార్డుల్లో పేరుండాలి. రైతు నిర్ణీత ప్రీమియం చెల్లించి ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలి. ఇప్పటికే నేషనల్ పెన్షన్ స్కీమ్, ఈఎస్‌ఐ, ఈపీఎఫ్‌లో చేరిన వారు పథకానికి అనర్హులు. ప్రభుత్వ ఉద్యోగులు ఆదాయపు పన్ను చెల్లింపుదారులు, ఆర్థిక స్థోమత ఉన్న వారు, ఇతర సామాజిక భద్రతా పథకాలను పొందుతున్న రైతులకు ఈ పథకం వర్తించదు.
ప్రీమియం నామ మాత్రమే..
రైతులు తమ వయస్సును బట్టి ప్రతి నెలా రూ.55 నుంచి రూ.200 వరకు ప్రీమియం చెల్లించే వెసలుబాటు ఈ పథకం ద్వారా కల్పించబడింది. దీనికి సమానంగా కేంద్ర ప్రభుత్వం అంతే మొత్తాన్ని జమ చేస్తుంది. 60 ఏళ్ల వరకు ప్రీమియం చెల్లిస్తే.. ఆ తర్వాత ప్రతి నెలా రైతులకు రూ.3వేల పింఛన్ అందుతుంది. రైతు మరణించిన పక్షంలో భార్య, లేదా నామినీకి నెలకు రూ.1,500 సాయం అందజేస్తారు. ఈ పథకంలో లబ్ధి పొందాలనుకునే రైతులు తమ గ్రామాల్లోనే రైతు సేవా కేంద్రాల ద్వారా కానీ, పీఎం కిసాన్ పోర్టల్‌లో గానీ దరఖాస్తు చేసుకోవాలి. ఆధార్ నెంబర్, నామినీ, రైతు బ్యాంకు ఖాతా తదితర వివరాలను అప్‌లోడు చేయాలి. ఈ ప్రక్రియ పూర్తయిన తర్వాత పింఛన్‌కార్డు జారీ అవుతుంది. ఆ తర్వాత రైతు ప్రతి నెలా తమకు నిర్దేశించిన ప్రీమియాన్ని బ్యాంకు ఖాతాకు జమ చేయాలి.
రైతులందరూ ఉపయోగించుకోవాలి
కేంద్ర ప్రభుత్వం రైతుల కోసం అమలు చేస్తున్న పథకాల్లో ఈ పథకం ఎంతో ప్రయోజకరమైంది. రైతులకు వయసు మళ్లాక, ఆర్థిక ఇబ్బందులకు గురి కాకుండా ఈ పథకం కాపాడుతుంది. ప్రతి రైతు ఈ పథకం ద్వారా లబ్ధి పొందాలని కేంద్ర ప్రభుత్వం తక్కువ ప్రీమియం చెల్లించేలా ఈ పథకాన్ని అందుబాటులోకి తెచ్చింది. - వరలక్ష్మి, జేడీ