ప్రేమ జంటలే టార్గెట్ !
ABN , Publish Date - Aug 29 , 2025 | 12:07 AM
నాలుగో పట్టణ పోలీస్ స్టేషన్ పరిధిలో ప్రేమ జంటలను బెదిరించి దోపిడీ చేస్తున్న ముగ్గురు నిందితులను పోలీసులు అరెస్టు చేశారు.
వారిని బెదిరించి దోపిడీ చేస్తున్న ముఠా అరెస్టు
కర్నూలు క్రైం, ఆగస్టు 26 (ఆంధ్రజ్యోతి): నాలుగో పట్టణ పోలీస్ స్టేషన్ పరిధిలో ప్రేమ జంటలను బెదిరించి దోపిడీ చేస్తున్న ముగ్గురు నిందితులను పోలీసులు అరెస్టు చేశారు. సీఐ విక్రమసింహ, ఎస్‌ఐ మోహన్ కిషోర్ రెడ్డి తెలిపిన మేరకు వివరాలు ఇలా.. గోర్లగుట్ట నాగేంద్రుడు (ముజఫర్‌నగర్), కురువ రమేష్ (టీవీ9 కాలనీ), దూదేకుల మాలిక్ బాషా (దిన్నెదేవర పాడు)లు ముఠాగా ఏర్పడి ప్రేమ జంటలను వెంబడించి వారి ఫొటోలను తీసి బెదిరించేవారు. జంటల నుంచి డబ్బు, బంగారు బలవంతంగా లాక్కుని పరారయ్యేవారు. ఈ క్రమంలో ఈ నెల 19న ఓ యువతి తన స్నేహితుడితో కలిసి రాయలసీమ యూని వర్సిటీ వైపు వెళ్తుండగా.. హ్యాంగ్ అవుట్ హోటల్ వద్ద నిందితులు వీరి ఆటోను ఆపారు. యువతి అతని స్నేహితుని ఫొటోలు తీసి మీ తల్లిదండ్రులకు చెబుతామని కత్తితో బెదిరించి బంగారు గొలుసు, నగదు లాక్కుని పరారయ్యారు. మరో రెండు రోజుల తర్వాత ఆ యువతికి ఫోన్ చేసి మరోసారి డబ్బు డిమాండ్ చేశారు. దీంతో యువతి పోలీసులకు ఫిర్యాదు చేసింది. నిందితులను పోలీసులు గుర్తించి వారిని అరెస్టు చేశారు. నిందితుల నుంచి కారు, స్కూటీ, పది లీటర్ల సారా స్వాధీనం చేసుకున్నారు.