Share News

ప్రేమ జంట ఆత్మహత్య

ABN , Publish Date - Jul 07 , 2025 | 12:17 AM

నంద్యాల జిల్లా ప్యాపిలి మండలంలోని మాధవరం గ్రామానికి చెందిన ఓ ప్రేమ జంట చెట్టుకు ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకుంది.

ప్రేమ జంట ఆత్మహత్య

ప్రకాశం జిల్లాలో చెట్టుకు ఉరివేసుకున్న ప్రేమికులు

నంద్యాల జిల్లా మాధవరంలో విషాదం

ప్యాపిలి, జూలై 6 (ఆంధ్రజ్యోతి): నంద్యాల జిల్లా ప్యాపిలి మండలంలోని మాధవరం గ్రామానికి చెందిన ఓ ప్రేమ జంట చెట్టుకు ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకుంది. ఈ విషాధ ఘటన ఆదివారం ప్రకాశం కొమరోలు మండలంలోని అక్కపల్లి గ్రామ శివారు ప్రాంతంలో జరిగింది. మాధవరం గ్రామానికి చెందిన కంబగిరి రాముడు(24), భారతి(22) ఇద్దరూ గ్రామంలో కూలీ పనులకు వెళ్లేవారు. ఈ క్రమంలో ఇద్దరికి పరిచయం ఏర్పడింది. ఈ పరిచయం కాస్తా ప్రేమకు దారి తీసింది. ఏడాదిగా వీరిద్దరూ ప్రేమించుకుంటున్నారు. అయితే భారతికి రెండేళ్ల క్రింతం మండలంలోని అలేబాదు గ్రామానికి ఓ వ్యక్తితో వివాహమైంది. కుటుంబ కలహాలతో ఆ యువతి భర్తను వదిలేసి ఏడాదిగా పుట్టింటిలోనే ఉంటోంది. ఈ క్రమంలో భారతి, కంబగిరి రాముడు మధ్య ప్రేమ వ్యవహారం నడుస్తోంది.

ఈనెల 4న ఇంటి నుంచి వెళ్లిపోయిన ప్రేమికులు

ప్రేమ వివాహానికి పెద్దలు అంగీకరించకపోవడంతో ఈ నెల 4న ప్రేమికులు ఇంటి నుంచి వెళ్లిపోయారు. ప్రకాశం జిల్లాలోని కొమరోలు మండలంలోని అక్కపల్లి గ్రామ శివారు ప్రాంతంలో చెట్టుకు ఉరి వేసుకున్నారు. అక్కడి పోలీసులు ఘటనా స్థలాన్ని పరిశీలించారు. సెల్‌ ఫోన్‌ ఆధారంగా ప్రేమికుల అడ్రస్సులు తెలుసుకున్న పోలీసులు కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు.

మాధవరంలో విషాదఛాయలు

యువతి, యువకుడు ఆత్మహత్య చేసుకోవడంతో మాధవరంలో తీవ్ర విషాద ఛాయలు అలుముకున్నాయి. ఇంటి నుంచి వెళ్లిపోయిన వారు వివాహం చేసుకొని వస్తారని అనుకున్నామని, అయితే ఇలాంటి నిర్ణయం తీసుకుంటారని అనుకోలేదని కుటుంబ సభ్యులు ఆవేదన వ్యక్తం చేశారు.

Updated Date - Jul 07 , 2025 | 12:17 AM