రేషన్‌కార్డు కోసం వేలిముద్ర వేస్తే..
ABN , Publish Date - Aug 05 , 2025 | 12:35 AM
ఎనిమిదేళ్ల క్రితం ఇంటి నుంచి వెళ్లిపోయిన బాలుడు రేషన్ కార్డు కోసం వేలిముద్ర వేసేం దుకు రావడంతో అతడి ఆచూకీ లభ్యమైంది.
ఎనిమిది ఏళ్ల క్రితం తప్పిపోయిన బాలుడి ఆచూకీ గుర్తింపు
రేషన్‌కార్డు గుర్తింపుతో తల్లిదండ్రుల చెంతకు
ఆదోని, ఆగస్టు4(ఆంధ్రజ్యోతి): ఎనిమిదేళ్ల క్రితం ఇంటి నుంచి వెళ్లిపోయిన బాలుడు రేషన్ కార్డు కోసం వేలిముద్ర వేసేం దుకు రావడంతో అతడి ఆచూకీ లభ్యమైంది. అతడు ఉయ్యూరు పట్టణంలోని శిరీష రిహాబిలిటేషన్ సంస్థలో ఆశ్రయం పొందుతున్న ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. టూటౌన్ సీఐ రాజశేఖర్ రెడ్డి చొరవతో ఆ యువకుడిని తల్లిదండ్రుల చెంతకు చేరాడు. వివరాలు.. ఆదోనిలోని శివశంకర్‌నగర్‌కు చెందిన వడ్డే నాగరాజు, లక్ష్మి దంపతులకు నలుగురు సంతానం. అందులో ఇద్దరు కుమా ర్తెలు, ఇద్దరు కుమారులు. నాలుగో కొడుకు శ్రీకాంత్ 2018లో తప్పిపోయాడు. తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. అప్పుడు అతడి వయస్సు 12 ఏళ్లు. మతిస్థిమితం లేని అతడు ఎలాగో అలా ఆదోని రైల్వేస్టేషన్ నుంచి రైలులో విజయవాడకు చేరుకున్నారు. రైల్వేస్టేషన్లో మతిస్థిమితం లేక తిరుగుతున్న అతడిని విజయవాడ రైల్వే పోలీసులు గుర్తించి అక్కడి చైల్డ్‌కేర్ అధికారులకు అప్పగించారు. వారు కలెక్టర్ ఆదేశాలతో ఉయ్యూరు లోని శిరీష రిహాబిలిటేషన్ సంస్థకు అప్పగించారు. అతడు టీబీతో బాధపడుతున్నట్లు గుర్తించి గుంటూరులోని టీబీ ఆసుపత్రిలో చేర్చారు. మూడునెలల పాటు చికిత్సఅందించి ఆరోగ్యంగా తయారయ్యాక శ్రీకాంత్‌ను అక్కడే సంస్థ ఆలనాపాలనా చూశారు. రేషన్‌కార్డు చేయించి పింఛన్‌కు దరఖాస్తు చేసుకుందామన్న ఉద్దేశ్యంతో రేషన్‌కార్డు కోసం వేలిముద్ర వేయించారు. అప్పటికే రేషన్ కార్డు ఉందని ఎర్రర్ అని రావడంతో మరిన్ని వివరాలు సేకరించారు. రేషన్‌కార్డు సాయంతో తల్లిదండ్రుల వివరాలను రిహాబిలిటేషన్ సంస్థ ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లారు. కలెక్టరేట్ నుంచి ఆదోని టూటౌన్ పోలీస్‌స్టేషన్ పోలీసు లు ద్వారా తల్లిదండ్రులకు సమాచారం ఇచ్చారు. తప్పిపోయిన తమ కుమారుడు ఉయ్యూరులోని రిహాబిలిటేషన్ సంస్థలో ఉన్నాడని తెలుసుకొని అక్కడికి వెళ్లారు. ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ ఆదేశాలతో ఆసంస్థ వారు తల్లిదండ్రులకు అప్పజెప్పారు. ఎనిమిదేళ్ల తర్వాత తమ బిడ్డను కలుసుకోవడంతో తల్లిదండ్రులు ఆనందం వ్యక్తం చేశారు. చేరదీసిన ఆసంస్థకు, టూటౌన్ సీఐ రాజశేఖర్‌రెడ్డికి తల్లిదండ్రులు కృతజ్ఞతలు తెలిపారు.