Share News

గణపతి బప్పా మోరియా..

ABN , Publish Date - Sep 01 , 2025 | 01:11 AM

పట్టణంలో ఐదు రోజుల పాటు విశేష పూజలందుకున్న బొజ్జ గణపయ్యల నిమజ్జనం ఆదివారం కోలాహలంగా సాగింది.

గణపతి బప్పా మోరియా..
ఆదోనిలో గణనాథులను నిమజ్జనానికి తరలిస్తున్న నిర్వాహకులు

ఆదోనిలో ఆధ్యాత్మిక శోభ

ఎల్లెల్సీ వద్దకు భారీగా చేరుకున్న భక్తులు

ఘనంగా వినాయక నిమజ్జనం

పోలీసుల భారీ బందోబస్తు

ఆదోని/అగ్రికల్చర్‌/రూరల్‌, ఆగస్టు 31 (ఆంధ్రజ్యోతి): పట్టణంలో ఐదు రోజుల పాటు విశేష పూజలందుకున్న బొజ్జ గణపయ్యల నిమజ్జనం ఆదివారం కోలాహలంగా సాగింది. వందలాది వినాయకులు గంగమ్మ ఒడికి చేరారు. ఆధ్యాత్మిక శోభను సంతరించుకుంది. ఉదయం 9:30 గంటలకు విశ్వహిందూ పరిషత్‌ కార్యాల యంలో కొలువుదీరిన గణనాథుడి పూజలు అందుకొని శోభా యాత్రతో నిమజ్జనం కార్యక్రమం ప్రారంభమైంది. ఎమ్మెల్సీలు బీటీ నాయుడు, డాక్టర్‌ మధుసూదన్‌, కురువ కార్పొరేషన్‌ చైర్మన్‌ దేవేంద్రప్ప, మాజీ ఎమ్మెల్యేలు మీనాక్షి నాయుడు, సాయి ప్రసాద్‌రెడ్డి, టీడీపీ నాయకుడు మదిరె భాస్కర్‌రెడ్డి, జనసేన ఇన్‌చార్జి మల్లప్ప, వీహెచ్‌పీ అధ్యక్షుడు ఎగ్గాటి ప్రతాప్‌, ఉత్సవ కమిటీ సభ్యులు విట్టా రమేష్‌, బసవన్నగౌడ్‌, కునిగిరి నీలకంఠ, శ్రీకాంత్‌రెడ్డి, గుడిసె కృష్ణమ్మ, దేవిశెట్టి ప్రకాష్‌, తెలుగు యువత నాయకులు మారుతినాయుడు, వెంకటేష్‌చౌదరి తో పాటు పలువురు పూజలు చేశారు. శ్రీనివాస భవన్‌ వద్ద ధ్వజారోహణ చేసి ఎల్‌ఎల్‌సీ కాలువకు గణనాథులను తరలించారు. వాడవాడలా కొలువుదీరిన విఘ్నేశ్వరులు నిమజ్జనానికి బయలుదేరడంతో నిర్వాహకులు ఏర్పాటుచేసిన భారీ డీజేలు, ఎల్‌ఈడీలు మధ్య నృత్యం చేస్తూ గణనాథుడికి బైబై చెప్పారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా డీఎస్పీ హేమలత ఆధ్వర్యంలో పోలీసులు చేపట్టిన పటిష్ట బందోబస్తుతో గణేశ్‌ నిమజ్జనం చేశారు.

పోటాపోటీగా లడ్డూ వేలం

విశ్వహిందూ పరిషత్‌ కార్యాలయంలో కొలువుదీరిన గణనాథుడి లడ్డూ వేలం పాట పోటాపోటీగా సాగింది. మొదట రూ.10వేలతో ప్రారంభమై పోటాపోటీగా లడ్డూ దక్కించుకునేందుకు రాజకీయ నాయకులు పోటీ పడ్డారు. చివరకు కూటమి నాయకులు సి.మారుతినాయుడు, జనసేన మల్లప్ప, టీడీపీ నాయకుడు సూర్యనారాయణ కలిసి రూ.3.60 లక్షలకు లడ్డూను దక్కించుకున్నారు. గణనాథుడి ముందు ఏర్పాటుచేసిన హుండీని రూ.1.16 లక్షలకు ఎమ్మెల్సీ డాక్టర్‌ మధుసూదన్‌ వేలంలో దక్కించుకున్నారు.

భీమాస్‌ కూడలిలో విట్టా రమేష్‌, ప్రకాష్‌తో పాటు మరి కొంతమంది భక్తులకు అల్పాహారాన్ని మధ్యాహ్నం నుంచి సాయంత్రం వరకు అందించారు. శ్రీనివాస భవన్‌ కూడలిలో బద్రిస్వామి జ్ఞాపకార్థం మజ్జిగ, తాగునీటిని అందించారు.

ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా ఎస్పీ విక్రాంత్‌ పాటిల్‌ సమస్యాత్మక ప్రాంతాల్లో పర్యటిస్తూ నిమజ్జన బందోబస్తును పర్యవేక్షించారు. ఎల్‌ఎల్‌సీ కాలువ దగ్గర ఏర్పాట్లను పరిశీలించారు. గణనాథులను త్వరగా నిమజ్జనానికి తరలించాలంటూ సీఐలకు సూచనలు చేస్తూ ముందుకు సాగారు.

Updated Date - Sep 01 , 2025 | 01:11 AM