Share News

కౌలు రైతులకు సులభంగా రుణాలు అందించాలి

ABN , Publish Date - Jun 01 , 2025 | 12:29 AM

కౌలు రైతులకు ఆటంకాలను అధికమించి సులభంగా రుణాలు అందిం చాలని వారిని కష్టాల నుంచి గట్టెక్కించాలని జాయింట్‌ కలెక్టర్‌ బి.నవ్య జిల్లా వ్యవసాయ శాఖ యంత్రాంగాన్ని ఆదేశించారు.

కౌలు రైతులకు సులభంగా రుణాలు అందించాలి
జాయింట్‌ కలెక్టర్‌ నవ్య

జాయింట్‌ కలెక్టర్‌ నవ్య

కర్నూలు అగ్రికల్చర్‌, మే 31 (ఆంధ్రజ్యోతి): కౌలు రైతులకు ఆటంకాలను అధికమించి సులభంగా రుణాలు అందిం చాలని వారిని కష్టాల నుంచి గట్టెక్కించాలని జాయింట్‌ కలెక్టర్‌ బి.నవ్య జిల్లా వ్యవసాయ శాఖ యంత్రాంగాన్ని ఆదేశించారు. శనివారం కలెక్టరేట్‌ మినీ కాన్ఫరెన్స్‌ హాల్‌లో జిల్లా కోఆపరేటివ్‌ డెవలప్‌మెంట్‌ కమిటీ సమావేశం నిర్వహించారు. జేసీ మాట్లాడుతూ జిల్లాలో 43 ప్రాథమిక వ్యవసాయ పరపతి సంఘాలను కంప్యూటకరీంచడం పూర్తయిందని, అందువల్ల రైతులకు త్వరితగతిన రుణాలు అందించే కార్యక్రమాన్ని వేగవంతం చేయాలని జిల్లా కేంద్ర సహకార కేంద్ర బ్యాంకు అధికారులను ఆదేశించారు. జిల్లాలోని సీసీఆర్‌ కార్డులు కలిగిన కౌలు రైతులకు సహకార బ్యాంకులు రుణాలు వెంటనే అందించాలని ఆదేశించారు. వారు సాగు చేస్తున్న పొలం యజమాని పంట రుణం తీసుకుని ఉన్నట్లయితే అకౌంటును హోల్డ్‌లో పెట్టి, మళ్లీ వారికి రుణం ఇవ్వకుండా చూడాలని, రుణాల మంజూరులో కౌలు రైతుకే మొదటి ప్రాధాన్యం ఇవ్వాలని స్పష్టం చేశారు. సీసీఆర్‌ కార్డులను రెన్యువల్‌ చేసే విషయంలో నిర్లక్ష్యం వద్దని ఆదేశించారు. జిల్లాలో 10 మల్టీ పర్పస్‌ ఫెసిలిటీ గోదాముల నిర్మాణాన్ని చేపట్టేందుకు స్థలాలను ఎంపిక చేసినట్లు తెలిపారు. గ్రామీణ ప్రాంతల్లోని స్వయం సహాయక బృందాలకు రుణాలు మంజూరు చేయడంతో పాటు ఆ రుణాలు సద్వినియోగం అయ్యేలా చర్యలు తీసుకోవాలన్నారు. కర్నూలు జిల్లా మిల్క్‌ ఫెడరేషన్‌ సంఘాన్ని 15 రోజుల్లోగా ఏర్పాటు చేయాలని పశుసంవర్థక శాఖ జేడీ శ్రీనివాసులును ఆదేశించారు. డీసీవో రామాంజనేయులు, డ్వామా పీడీ వెంకటరమణయ్య, డీసీసీబీ సీఈవో రామాంజనేయులు, వ్యవసాయ శాఖ జేడీ వరలక్ష్మి, మెప్మా మేనేజర్‌ నాగశివలీల, సివిల్‌ సప్లయీస్‌ మేనేజర్‌ నాగసుధ తదితర శాఖల అధికారులు పాల్గొన్నారు.

Updated Date - Jun 01 , 2025 | 12:29 AM