Share News

ప్రతిపాదనలకే పరిమితం

ABN , Publish Date - Nov 21 , 2025 | 11:21 PM

ప్రతిపాదనలకే పరిమితం

ప్రతిపాదనలకే పరిమితం
ఎమ్మిగనూరు - మాలపల్లి రోడ్డు దుస్థితి ఇది

మరమ్మతులు, నిర్మాణాలకు శ్రీకారం

జిల్లాకు రూ.107.23 కోట్లు

గుంతలు పూడ్చలేని వైసీపీ ఐదేళ్ల పాలన

కూటమి ప్రభుత్వం వచ్చాక మరమ్మతులపై ప్రత్యేక దృష్టి

గత వైసీపీ ప్రభుత్వం రహదారుల మరమ్మతులను గాలికొదిలేసింది. అడుగుకో గుంత.. అవస్థలు జనజీవనం..! అన్నట్లుగా రోడ్ల పరిస్థితి ఉండేది. కూటమి ప్రభుత్వం వచ్చాక తక్షణమే రహదారులపై గుంతలు పూడ్చే కార్యక్రమం చేపట్టింది. అధ్వానంగా మారిన 972 కిలోమీటర్ల రోడ్లను రూ.2.62 కోట్లతో గుంతలు పూడ్చేసి ప్యాచులు వేశారు. వాహనదారులు కాస్త ఊపిరి పీల్చుకున్నారు. అయితే.. ఇటీవల భారీ వర్షాలకు ప్యాచులు లేచిపోయి రోడ్లు మళ్లీ యఽథాస్థితికి వచ్చాయి. ‘మిషన్‌ పాట్‌ హోల్‌ ఫ్రీ ఆంధ్రప్రదేశ్‌’ పేరుతో కూటమి ప్రభుత్వం మరమ్మతులు, నిర్మాణాలకు శ్రీకారం చుట్టింది. వివిధ పథకాల కింద జిల్లాకు రూ.107.23 కోట్లు మంజూరు చేసింది. దశాబ్దన్నర కాలంగా అభివృద్ధికి నోచుకొని ఢాణాపురం-హొళగుంద, ఎమ్మిగనూరు-మాలపల్లి-కోసిగి, బైచిగేరి క్రాస్‌-కపటి-పెద్దకడబూరు రహదారులకు ఎట్టకేలకు మోక్షం లభించింది. శాశ్వత నిర్మాణాలకు ప్రభుత్వం నిధులు మంజూరు చేసింది. త్వరలోనే పనులు మొదలు పెట్టేందుకు రోడ్డు భవనాల శాఖ ఇంజనీర్లు సన్నాహాలు చేస్తున్నారు.

కర్నూలు, నవంబరు 21 (ఆంధ్రజ్యోతి): జిల్లాలోని రోడ్ల మరమ్మతులు ప్రతిపాదనలకే పరిమితమేనా? లేక ఆచరణ జరు గుతుందా? జిల్లా రోడ్లు భవనాల శాఖ పర్యవేక్షణలో స్టేట్‌ హైవే (ఎస్‌హెచ్‌) రహదారులు 599.893 కి.మీలు జిల్లా ప్రధాన రోడ్లు (ఎండీఆర్‌) 1,286.624 కి.మీలు కలిపి 1.886.517 కిలో మీటర్లు పొడవు ప్రధాన రహదారులు ఉన్నాయి. కర్నూలు, ఆదోని డివిజన్ల పరిధిలో రోడ్లు భవనాల శాఖ ఇంజనీర్లు నిత్యం పర్యవేక్షిస్తున్నారు. అయితే.. గత వైసీపీ ప్రభుత్వ హయాంలో రోడ్ల మరమ్మతులు, నిర్మాణాలపై నిర్లక్ష్యం వాహనదారులకు శాపంగా మారింది. రాష్ట్ర విభజన తరువాత ఏర్పడిన సీఎం చంద్రబాబు సారథ్యంలోని టీడీపీ ప్రభుత్వం రహదారులు నిర్వహణపై ఫోకస్‌ పెట్టింది. జగన్‌ ప్రభుత్వం వచ్చాక ఐదేళ్లు మరమ్మతులు కూడా చేపట్టకపోవడం, నిధులు మంజూరైన రోడ్లను కూడా వేయకపోవడంతో వాహనదారులు చాలా ఇబ్బందులు పడ్డారు. 2024 జూన్‌ 12న సీఎం చంద్రబాబు సారథ్యంలో వచ్చిన కూటమి ప్రభుత్వం మళ్లీ రోడ్ల మరమ్మతులపై దృష్టి సారించింది. తాత్కాలికంగా గుంతలు పూడ్చి అతుకులు వేసినా, భారీ వర్షాలతో మళ్లీ అధ్వానంగా మారాయి. వాస్తవ పరిస్థితులను ముందే గుర్తించిన ప్రభుత్వం శాశ్వత మరమ్మతులు, కొత్త రహదారుల నిర్మాణాలకు శ్రీకారం చుట్టింది. వివిధ నియోజకవర్గాల్లో ప్రధాన రోడ్ల తాజా పరిస్థితిపై ఆంధ్రజ్యోతి బృందాలు పరిశీలించాయి. వర్షాలకు గుంతలు మయంగా మారిన రోడ్ల మరమ్మతులు తక్షణమే చేపట్టాలని ప్రజలు కోరుతున్నారు.

వివిధ రోడ్ల తాజా పరిస్థితి ఇది:

ఢాణాపురం - హొళగుంద వయా హెబ్బటం రహదారి 25 కి.మీ ఉంది. దాదాపు ఆంధ్ర, కర్ణాటక రాష్ట్రాలను కలిపే ప్రధాన రోడ్డు ఇది. దాదాపు 35 గ్రామాల ప్రజలు ఆదోని, కర్నూలుకు వెళ్లాలంటే ఈ ఒక్క రోడ్డే శరణ్యం. గత టీడీపీ ప్రభుత్వంలో నూతన రోడ్డు నిర్మాణానికి నిధులు మంజూరైతే ఆ తరువాత వచ్చిన వైసీపీ ప్రభుత్వం పట్టించుకోలేదు. ఐదేళ్లు గుంతల రోడ్డుపై నరకయాతన తప్పలేదు. ప్రస్తుతం కూడా అదే పరిస్థితి ఉంది. అయితే.. డాణాపురం నుంచి హెబ్బటం వరకు 0/0 నుంచి 12.8 కి.మీ వరకు రోడ్డు నిర్మాణానికి రూ.7 కోట్లతో టెండర్లు కూడా పూర్తి చేశారు. హెబ్బటం నుంచి హొళగుంద వరకు 12/8 - 25/8 కి.మీల వరకు రూ.6.70 కోట్లతో ప్రతిపాదనలు ఆమోదం దశలో ఉన్నాయి.

ఎమ్మిగనూరు-మాలపల్లి-కోసిగి రోడ్డు గత వైసీపీ హయాంలో పూర్తిగా నిర్లక్ష్యానికి గురైంది. ఎమ్మిగనూరు, పెద్దకడుబూరు, కోసిగి, కౌతాళం మండలాల్లోని సుమారుగా 45 గ్రామాల ప్రజలకే కాదు, ఎమ్మిగనూరు ప్రాంతం నుంచి ఉరుకుంద దేవస్థానికి వెళ్లే భక్తులకు ప్రధాన రోడ్డు ఇది. ప్రస్తుతం గుంతలతో అధ్వానంగా ఉంది. ఎమ్మిగనురు నుంచి జలవాడి వరకు 0/0 - 10/8 కి.మీల వరకు నూతన రోడ్డు నిర్మాణానికి రూ.5 కోట్లతో టెండర్లు పూర్తి చేశారు. 10/8 నుంచి 12 కి.మీల వరకు రోడ్డు నిర్మాణానికి మరో రూ.2.40 కోట్లు అవసరమని ప్రతిపాదనలు పంపారు.

కరివేముల క్రాస్‌ నుంచి అగ్రహారం వయా తెర్నేకలు ప్రధాన రోడ్డు 14 కి.మీలు అధ్వానంగా మారింది. నూతన రోడ్డు నిర్మాణానికి రూ.3.50 కోట్లతో టెండర్ల ప్రక్రియ పూర్తి చేశారు. త్వరలో పనులు మొదలు పెట్టేందుకు సన్నాహాలు చేస్తున్నారు.

గుత్తి-పత్తికొండ-ఆదోని రోడ్డు ప్రధాన రహదారి ఎర్రగుడి నుంచి జొన్నగిరి 9/0 నుంచి 17/8 కి.మీలు వరకు రోడ్డు నిర్మాణానికి రూ.5 కోట్లు మంజూరు చేశారు. ఇదే రోడ్డు పలు ప్రాంతాల్లో అధ్వానంగా ఉంది. శాశ్వత మరమ్మతులు చేయాలని వాహనదారులు కోరుతున్నారు.

ఆదోని మండలం బైచిగేరి క్రాస్‌ (ఏజీ రోడ్డు) నుంచి పెద్దకడుబూరు వయా కపటి రోడ్డు దశాబ్దన్నర కాలంగా మరమ్మతులకు నోచుకోలేదు. పూర్తిగా అధ్వానంగా మారింది. 0/0 నుంచి 13/5 కి.మీల వరకు పునర్నిర్మాణం కోసం రూ.6.4 కోట్లకు పంపిణీ ప్రతిపాదనలు ఆమోదం దశలో ఉన్నాయి. త్వరలోనే పనులు చేపడుతామని ఇంజనీర్లు పేర్కొన్నారు. అలాగే.. మదిరె-కాత్రికి, మాధవరం-తాండా రోడ్ల ఆధునికీకరణకు రూ.3.50 కోట్లతో టెండర్లు ప్రక్రియ పూర్తి చేశారు.

కర్నూలు-బళ్లారి రోడ్డు ఆలూరు మండలం చిన్నహోతూరు, పెద్దహోతూరు దగ్గర అధ్వానంగా మారింది. శాశ్వత మరమ్మతుల కోసం 93/0 నుంచి 99/8 కి.మీల వరకు రూ.3.5 కోట్లతో టెండర్లు పిలిచారు. అలాగే.. కర్నూలు డివిజన్‌ పరిధిలోని కర్నూలు-కె.నాగులాపురం వరకు 8 నుంచి 9 కి.మీల మధ్య అధ్వానంగా తయారైంది. రూ.8 కోట్లతో శాశ్వత మరమ్మతులు చేపట్టనున్నారు.

నన్నూరు-చిన్నటేకూరు ప్రధాన రోడ్డు నిర్మాణానికి రూ.8కోట్లు మంజూరు చేశారు. గుంతలమయంగా మారిన ఈ రోడ్డుకు మహర్దశ వచ్చిందని స్థానికులు పేర్కొంటున్నారు. అలాగే.. శకునాల-తిప్పయిపల్లి-బ్రహ్మణపల్లె రోడ్డు 9.6 కి.మీ నిర్మాణానికి రూ.3.56 కోట్లతో చేపట్టిన పనులు వివిధ దశల్లో ఉన్నాయి.

కోడుమూరు-ఎమ్మిగనూరు మధ్యలో నాలుగు గ్రామాల వద్ద రూ.3.50 కోట్లతో రెండు కి.మీలు సీసీ రోడ్డు, 4/0 నుంచి 18/0 కి.మీల వరకు రూ.2.50 కోట్లతో 5.7 కిలో మీటర్లు రోడ్డు నిర్మాణ పనులు చేపట్టారు. కర్నూలు డివిజన్‌ పరిధిలో దాదాపు రూ.29.15 కోట్లతో వివిధ పథకాలు కింద రోడ్ల నిర్మాణాలకు శ్రీకారం చుట్టారు.

రూ.107.23 కోట్లు మంజూరు

వర్షాలకు దెబ్బతిన్న రోడ్లు అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం సన్నాహాలు చేపట్టింది. మిషన్‌ పాట్‌ హోల్‌ ఫ్రీ ఏపీ (గుంతలు రహిత రహదారుల మిషన్‌)లో భాగంగా 838.70 కిలో మీటర్ల రహదారులు శాశ్వత మరమ్మతుల కోసం 240 పనులకు రూ.19.87 కోట్లు మంజూరు చేశారు. త్వరలోనే పనులు చేపట్టేందుకు సన్నాహాలు చేస్తున్నారు. అదే క్రమంలో నాబార్డు, ఎండీఆర్‌ ప్లాన్‌, అడిషనల్‌ ప్లాన్‌, ఎస్‌హెచ్‌ ప్లాన్‌, అడిషనల్‌ ప్లాన్‌ పథకాల కింద 26 రహదారులు, 191.53 కిలో మీటర్లు నూతన రోడ్డు నిర్మాణం కోసం రూ.87.36 కోట్లు మంజూరు చేశారు. నాబార్డు నిధులు రూ.18.81 కోట్లతో చేపట్టిన 47.62 కి.మీల ఏడు రోడ్ల నిర్మాణాల పనులు వివిధ దశల్లో ఉన్నాయి. మిగిలిన పనులు టెండర్ల దశలో ఉన్నాయి. టెండర్ల ప్రక్రియ పూర్తి నిర్మాణాలు చేపడుతామని ఇంజనీర్లు తెలిపారు. అంతేకాకుండా రహదారుల నిర్వహణ కోసం మరో రూ.4 కోట్లు అవసరం ఉందని ప్రతిపాదనలు పంపించారు. పనులన్నీ పూర్తయ్యాక జిల్లా ప్రధాన రోడ్లు అందంగా తయారు అవుతాయని పలువురు పేర్కొంటున్నారు.

రోడ్ల అభివృద్ధిపై ప్రత్యేక దృష్టి

జిల్లాలో ప్రధాన రహదారుల మరమ్మతులు, నిర్మాణాలపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టిని పెట్టింది. 838.70 కి.మీ రోడ్లకు మరమ్మతులు చేపట్టాం. వివిధ పథకాలు కింద 26 రోడ్లు 191.53 కిమీ నిర్మాణానికి రూ.87.36 కోట్లు మంజూరు చేశారు. ఇప్పటికే ఏడు పనులు మొదలు పెట్టాం. 19 రోడ్ల పనులు టెండరు దశలో ఉన్నాయి.

- మహేశ్వరరెడ్డి, ఎస్‌ఈ, రోడ్లు భవనాలు శాఖ, కర్నూలు:

జిల్లాలో ప్రధాన రోడ్లు మరమ్మతులు,

నిర్మాణాలకు నిధులు మంజూరు, ప్రస్తుత పరిస్థితి (రూ.కోట్లల్లో):

పథకం పనులు నిధులు కి.మీలు ప్రస్తుత పరిస్థితి

నాబార్డు 7 18.81 47.62 వివిద దశల్లో పనులు

ఎండీఆర్‌ ప్లాన్‌ 5 12.90 38.91 టెండరు పిలిచారు

ఎస్‌హెచ్‌ ప్లాన్‌ 7 18.50 30.70 టెండరు పిలిచారు

ఎండీఆర్‌ అడిషనల్‌ ప్లాన్‌ 4 19.15 46.70 టెండర్లు పిలవాల్సి ఉంది

ఎస్‌హెచ్‌ అడిషనల్‌ ప్లాన్‌ 3 18.00 27.60 టెండర్లు పిలవాల్సి ఉంది

మొత్తం 26 87.36 191.53

మిషన్‌ పాట్‌హోల్‌ ఫ్రీ ఏపీ 240 19.87 838.70 పనులు జరుగుతున్నాయి

మొత్తం 266 107.23 1,030.23

Updated Date - Nov 21 , 2025 | 11:21 PM