కార్యదర్శుల జీవితాల్లో వెలుగులు
ABN , Publish Date - Nov 16 , 2025 | 11:39 PM
పంచాయతీ రాజ్ దీపానికి కూటమి ప్రభుత్వం చమురు పోసి గ్రామజ్యోతి వెలిగించింది. అధికారంలోకి వచ్చాక ఆశాఖను సంస్కరణ బాటను పట్టింది. పంచాయతీ కార్యదర్శుల జీవితాల్లో వెలుగులీననున్నాయి.
పంచాయతీ అభివృద్ధి అధికారులుగా కార్యదర్శులు
క్లస్టర్ వ్యవస్థ రద్దు
పెరుగుతున్న జీతాలు
పనుల విభజన కోసం ప్రత్యేక విభాగాలు
సంస్కరణ బాట పట్టిన పంచాయతీ రాజ్
పంచాయతీ రాజ్ దీపానికి కూటమి ప్రభుత్వం చమురు పోసి గ్రామజ్యోతి వెలిగించింది. అధికారంలోకి వచ్చాక ఆశాఖను సంస్కరణ బాటను పట్టింది. పంచాయతీ కార్యదర్శుల జీవితాల్లో వెలుగులీననున్నాయి. ఇకపై ప్రతి పంచాయతీ స్వతంత్ర పరిపాలన వ్యవస్థగా పని చేయనున్నాయి. క్లస్టర్ వ్యవస్థ పూర్తిగా రద్దు కానుంది. ఈమేరకు పంచాయతీరాజ్ శాఖ సమూల మార్పులను ప్రతిపాదిస్తూ జీవో.నెం.91 విడుదల చేసింది. పంచాయతీ కార్యదర్శి పేరును కూడా పంచాయతీ అభివృద్ధి అధికారిగా వ్యవహరించనున్నారు. గతంలో కార్యదర్శుల కొలువు అంటే ఉసురుమనిపించేలా ఉండేది. నేడు పంచాయతీరాజ్ శాఖలో పండుగ వాతావరణం నెలకొంది.
కర్నూలు కలెక్టరేట్, నవంబరు 16 (ఆంధ్రజ్యోతి): పంచాయతీ కార్యదర్శుల జీవితాల్లో ప్రభుత్వం వెలుగులు నింపింది. ఉమ్మడి కర్నూలు జిల్లాలో 973 గ్రామ పంచాయతీలు ఉండగా వాటిని స్పెషల్ గ్రేడ్ రూర్బన్ పంచాయతీలుగానూ, గ్రేడ్ 1, 2, 3లుగా వర్గీకరించారు. రూర్బన్ గ్రామ పంచాయతీలకు డిప్యూటీ ఎంపీడీవో స్థాయి అధికారులను నియమిస్తారు. ఇవి ఉమ్మడి కర్నూలు జిల్లాలో 25ఉన్నాయి (కర్నూలు 19, నంద్యాల 6). ప్రస్తుతం ఆరు గ్రేడ్లుగా ఉన్న పంచాయతీ కార్యదర్శులు ఇకపై మూడు గ్రేడ్లుగా మారనున్నారు. పంచాయతీ కార్యదర్శి పేరును కూడా పంచాయతీ అభివృద్ధి అధికారిగా వ్యవహరించనున్నారు.
గత ప్రభుత్వంలో..
గత ప్రభుత్వంలో ఉమ్మడి జిల్లాలో దాదాపు 400 మంది గ్రేడ్-5 పంచాయతీ కార్యదర్శులను నియమించారు. డిగ్రీ అర్హత కలిగిన వీరికి జూనియర్ అసిస్టెంట్ స్థాయి వేతనం ఇవ్వాల్సి ఉండగా రికార్డు అసిస్టెంట్ స్థాయిలో జీతమిచ్చి వారి జీవితాలతో ఆడుకున్నారు. ప్రస్తుతం గ్రేడ్-5 పంచాయతీ కార్యదర్శుల వేతనం రూ.23,120 ఉండగా వారందరినీ గ్రేడ్-3 కార్యదర్శులుగా మారుస్తూ రూ.28,120 స్కేల్ ఇవ్వనున్నారు. 2007లో పీజీ అర్హతతో కాంట్రాక్టు, ఔట్ సోర్సింగ్ పద్ధతిలో రూ.3వేలు వేతనం చెల్లించి పంచాయతీ కార్యదర్శులను నియమించారు. వారందరి ఉద్యోగాలు క్రమబద్ధీకరించినప్పటికీ వేతనాలు తక్కువ స్థాయిలో ఉండేవి. ప్రస్తుతం వారందరినీ గ్రేడ్-2గా మారుస్తూ రూ.32,670 కనీస వేతన స్కేల్ ఇవ్వనున్నారు. ఇక పదోన్నతులు పొంది తక్కువస్థాయి వేతనాలు పొందుతున్న గ్రేడ్-1 పంచాయతీ కార్యదర్శులకు ఇకపై రూ.44,570 స్కేల్ ఇవ్వనున్నారు. రూర్బన్ పంచాయతీలో పనిచేయబోయే డిప్యూటీ ఎంపీడీవో స్థాయి అధికారులకు రూ.45,830 కనీస వేతనం కేటాయించారు.
ప్రత్యేక సిబ్బందిని..
గతంలో గ్రామ పంచాయతీలో పంచాయతీ కార్యదర్శి మాత్రమే ఉండేవారు. అన్ని విభాగాల పని ఒక్కరే పర్యవేక్షిస్తుండటంతో పనిభారం ఉండేది. సచివాలయ వ్యవస్థకు డీడీవోగా వ్యవహరించాల్సి రావడంతో పనిఒత్తిడి శాపంగా మారింది. ప్రస్తుతం తీసుకొచ్చిన సంస్కరణల్లో భాగంగా ఇకపై గ్రామ పంచాయతీలో పారిశుధ్యం, నీటి సరఫరా, గ్రామ ప్రణాళిక, రెవెన్యూ విభాగం ఏర్పాటుతో ప్రత్యేక సిబ్బందిని నియమించ నున్నారు. సచివాలయంలో పని చేస్తున్న ఇంజనీరింగ్, డిజిటల్ అసిస్టెంట్లను ఇకపై కంట్రీ ప్లానింగ్ అసిస్టెంట్లుగా మార్చనున్నారు. పంచాయతీల్లో ఐటీ విభాగాన్ని కూడా ఏర్పాటు చేయనున్నారు.
ఉమ్మడి జిల్లాలో 973 పోస్టులు
ఉమ్మడి జిల్లాలో 973 పంచాయతీ కార్యదర్శుల పోస్టులలో కర్నూలు జిల్లాలో స్పెషల్ గ్రేడ్-19, గ్రేడ్-1 కేటగిరి కింద 140, గ్రేడ్-2 కింద 133, గ్రేడ్-3 కింద 192 కాగా.. నంద్యాల జిల్లాలో స్పెషల్ గ్రేడ్-6, గ్రేడ్-1 కేటగిరి కింద 111, గ్రేడ్-2 132, గ్రేడ్-3 237 పోస్టులు కల్పించనున్నారు.
పరస్పర పదోన్నతులు పొందే..
గతంలో మినిస్టీరియల్ విభాగాల్లో పనిచేసే జూనియర్, సీనియర్ అసిస్టెంట్లు పంచాయతీ కార్యదర్శులుగా వచ్చే అవకాశముండేది. పంచాయతీ కార్యదర్శులుగా పని చేసేవారు మినిస్టీరియల్ అధికారులుగా వెళ్లేందుకు అవకాశం ఉండేది కాదు. ప్రస్తుతం అటూ ఇటు మారేందుకు పరస్పర పదోన్నతులు పొందే అవకాశాలు పంచాయతీ కార్యదర్శులకు కల్పించారు. గత ప్రభుత్వం ఐదేళ్లలో ఒక్క పదోన్నతి కల్పించకపోగ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఉమ్మడి కర్నూలు జిల్లాలో దాదాపు 550కి పైగా పదోన్నతులు కల్పించారు.
సంస్కరణలను స్వాగతిస్తాం
పంచాయతీ రాజ్ శాఖలో తీసుకొస్తున్న సం స్కరణలను స్వాగతిస్తున్నాం. వేతన సవరణ అనేది ఓ విప్లవాత్మకమైన మార్పు. జీతాలు పె రుగుతాయి. జీవితాలు బాగుపడుతాయి. సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్‌కళ్యాణ్‌కు ప్రత్యేక ధన్యవాదాలు.
కే.గిరి శ్రీకాంత్, కన్వీనర్, నవీన పంచాయతీ కార్యదర్శుల సంఘం