మాదక ద్రవ్యాలతో జీవితాలు నాశనం
ABN , Publish Date - Jun 27 , 2025 | 12:02 AM
మాదక ద్రవ్యాలకు యువత బానిసలైతే జీవితాలు సర్వనాశనం అవుతాయని కర్నూలు రేంజ్ డీఐజీ డాక్టర్ కోయ ప్రవీణ్ అన్నారు.
డీఐజీ డాక్టర్ కోయ ప్రవీణ్
కర్నూలు నగరంలో భారీ ర్యాలీ
పాల్గొన్న కలెక్టర్, ప్రజాప్రతినిధులు
కర్నూలు హాస్పిటల్, జూన్ 26 (ఆంధ్రజ్యోతి): మాదక ద్రవ్యాలకు యువత బానిసలైతే జీవితాలు సర్వనాశనం అవుతాయని కర్నూలు రేంజ్ డీఐజీ డాక్టర్ కోయ ప్రవీణ్ అన్నారు. గురువారం అంతర్జాతీయ మాదక ద్రవ్యాల దుర్వినియోగం, అక్రమ రవాణా వ్యతిరేక దినం సందర్భంగా కర్నూలు నగరంలోని రాజ్‌విహార్ సెంటర్ నుంచి అవగాహన ర్యాలీ ప్రారంభించారు. ఈ ర్యాలీ కలెక్టరేట్ వరకు కొన సాగింది. అదేవిధంగా కలెక్టరేట్‌లోని సునయన ఆడిటోరియంలో అవగాహన సమావేశం నిర్వహిం చారు. ఈ కార్యక్రమాల్లో డీఐజీతో పాటు కలెక్టర్ రంజిత్ బాషా, ఎంపీ బస్తిపాటి నాగరాజు, ఎమ్మెల్యే గౌరు చరితారెడ్డి, కుడా చైర్మన్ సోమిశెట్టి వెంకటేశ్వర్లు, మేయర్ బీవై రామయ్య తదితరులు పాల్గొన్నారు.
డీఐజీ కోయ ప్రవీణ్ మాట్లాడుతూ సీఎం చంద్రబాబు నాయుడు స్ఫూర్తి పిలుపుతో మాదక ద్రవ్యాల నియంత్రణకు పెద్ద ఎత్తున కార్యక్రమాలు చేపట్టినట్లు తెలిపారు. ఉమ్మడి కుటుంబాలు కనుమరుగవుతున్న నేపథ్యంలో చిన్న కుటుంబాల వల్ల ఒంటరి తనంతో మానవ సంబంధాలు దెబ్బతిని యువత మాదకద్రవ్యాల అలవాట్లకు గురవుతున్నారన్నారు. ప్రస్తుతం ప్రభుత్వం మాదక ద్రవ్యాల నియంత్రణకు ప్రత్యేక చర్యలు తీసుకుంటుం దన్నారు. పోలీస్ శాఖ సైతం డ్రగ్స్ నివారణపై ప్రత్యేక దృష్టి సారించిందన్నారు. కలెక్టర్ రంజిత్ బాషా మాట్లాడుతూ డ్రగ్స్ బారిన పడి జీవితాలు నాశనం అవుతున్నాయనీ, ఇలాంటి డ్రగ్స్ మహమ్మారీని నాశనం చేయక పోతే మనుగడ కష్టమన్నారు. మాదక ద్రవ్యాలను నియంత్రించడం, వీటిని సేవించే వారికి రీహాబిలేషన్ చికిత్స అందించడం కార్యక్రమాలను అమలు చేస్తుందన్నారు. జిల్లాలో ప్రతి నెల మాదక ద్రవ్యాల నియంత్రణ కోసం వివిధ శాఖల అధికారులతో సమన్వయ సమావేశాన్ని నిర్వహిం చారు. ఎస్పీ విక్రాంత్ పాటిల్ మాట్లాడుతూ ఎక్కడైనా కాలేజీ, పాఠశాలల్లో ఎవరైనా యువత డ్రగ్స్‌కు అలవాటు పడినట్లు తెలిస్తే టోల్ ఫ్రీ నెంబర్ 1972కు కాల్ చేసి సమాచారం అందించా లన్నారు. డ్రగ్స్ వినియోగించినా, సరఫరా చేసినా వారిపై ఎన్‌డీపీఎస్ యాక్టు ప్రకారం కేసులు నమోదు చేస్తామని 6 నెలల వరకు బెయిల్ కూడా రాదన్నారు. కర్నూలు ఎంపీ బస్తిపాటి నాగరాజు మాట్లాడుతూ మత్తు పదార్థాల వల్ల కలిగే నష్టాల గురించి యువత తెలుసుకుని మంచి మార్గంలో నడవాలని సూచించారు. ఎమ్మెల్యే గౌరు చరితారెడ్డి మాట్లాడుతూ డ్రగ్స్ తీసుకోవడం వల్ల యువత జీవితాలు నాశనం అవుతుందన్నారు. గతంలో డ్రగ్స్ కేవలం పెద్ద నగరాల్లో మాత్రమే ఉండేవని, ఇప్పుడు జిల్లాలకు వ్యాప్తి చెందిందన్నారు. కర్నూలు నగర మేయర్ బీవై రామయ్య మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ మాదక ద్రవ్యం వాడకం, రవాణా విషయంలో ప్రతి ఒక్కరూ బాధ్యతగా వ్యవహరించాలన్నారు. ఈ కార్యక్రమంలో కార్యక్రమంలో ఎక్సైజ్ శాఖ డిప్యూటీ కమిషనర్ శ్రీదేవి, అసిస్టెంట్ కమిషనర్ హనుమంతరావు, ఎక్సైజ్ సూపరింటెండెంట్ సుధీర్‌బాబు, అసిస్టెంట్ ఎక్సైజ్ కమిషనర్ రామకృష్ణారెడ్డి, ఈగల్ టీం ఎస్‌ఐ సుజన్ కుమార్, ఇన్‌చార్జి ఆర్‌డీవో వెంకటేశ్వర్లు, కర్నూలు ఆర్డీవో సందీప్ కుమార్, డీఎంహెచ్‌వో పి.శాం తికళ, అడిషినల్ డీఎంహెచ్‌వో ఎల్.భాస్కర్, ఆర్‌బీఎస్‌కే జిల్లా కోఆర్డినేటర్ మహేశ్వర్ ప్రసాద్, ఐసీడీఎస్ పీడీ నిర్మల, డీఈవో శామ్యూల్ పాల్, మెప్మా పీడీ నాగ శివలీల పాల్గొన్నారు.
సమష్టి కృషితో డ్రగ్స్ నివారణ
నంద్యాల టౌన్, జూన్ 26(ఆంధ్రజ్యోతి): డ్రగ్స్‌ను నివారించడంలో ప్రతి ఒక్కరి కృషి అవసరం అని కలెక్టర్ రాజకుమారి, ఎస్పీ అధిరాజ్ సింగ్ రాణా అన్నారు. గురువారం మాదక ద్రవ్యాల దుర్వినియోగం, అక్రమ రవాణా వ్యతిరేక దినోత్సవం సందర్భంగా స్థానిక ఎస్పీజీ గ్రౌండ్ నుంచి మున్సిపల్ కార్యాలయం వరకు ర్యాలీ నిరహించారు. వారు మాట్లాడుతూ.. మాదక ద్రవ్యాల వినియోగం అనేది మానసికంగా ఆర్థికంగా నాశనం చేస్తుందని అన్నారు. దీంతో యువత చాలా మంది ప్రమాదాల బారిన పడుతున్నారు. ఇందుకోసం పోలీసు శాఖ ఈగల్ టీం ఏర్పాటు చేసిందన్నారు. ఈ బృందం డ్రగ్స్ ముఠాలకు వ్యతిరేకంగా నిర ంతరం నిఘా కొనసాగిస్తుందన్నారు. ఇప్పటి వరకు 37 కేజీల గంజాయిని, 47 మందిని అమ్మిన వారిపై చర్యలు తీసుకున్నామన్నారు. ఆపరేషన్ గరుడలో భాగంగా ఎన్‌ఫోర్స్‌మెంట్ ఆధ్వర్యంలో తనీఖీలు చేసి పది మెడికల్ షాపులపై కేసు నమోదు చేసినట్లు తెలిపారు. పాఠశాలలు, కళశాలలు ల్లో 108 పైగా ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి 208 అవగాహన కార్యక్రమాలు నిర్వహించమన్నారు. ఇటీవల డోన్ పోలీసు స్టేషన్ పరిధిలో గంజాయి కేసులో నలుగురికి ఐదేళ్లు కఠి కారాగార శిక్షతో పాటు రూ.25 వేలు జరిమానా విధించినట్లు తెలిపారు. ఎక్సైజ్ సూపరింటెండెంట్ రవికమార్, జిల్లా అధికారులు రాముడు, డీఎంహెచ్‌వో వెంకటరమణ, లీలావతి పాల్గొన్నారు.