Share News

మరణానంతర జీవితం

ABN , Publish Date - Oct 23 , 2025 | 12:19 AM

అవయవ దానం చేస్తే మరణించిన తర్వాత కూడా జీవించినట్లేనని అంటారు. వ్యాధులతో, ప్రమాదాలతో మృత్యుముఖంలో ఉన్న వాళ్ల జీవితం నిలబెట్టినట్లవుతుంది.

మరణానంతర జీవితం
నివాళులర్పిస్తున్న కిమ్స్‌ హాస్పిటల్‌ వైద్యులు, సిబ్బంది ఇన్‌సెట్‌లో అవయవదాత భాగ్యమ్మ

తల్లి అవయవాలు దానం చేసిన కొడుకులు

ఫిట్స్‌తో మెదడులో రక్తస్రావమై బ్రెయిన్‌ డెడ్‌

నలుగురికి అవయవాల దానం

పోలీసులు గ్రీన్‌ చానల్‌ ద్వారా అవయవాల తరలింపు

కర్నూలు హాస్పిటల్‌, అక్టోబరు 22 (ఆంధ్రజ్యోతి): అవయవ దానం చేస్తే మరణించిన తర్వాత కూడా జీవించినట్లేనని అంటారు. వ్యాధులతో, ప్రమాదాలతో మృత్యుముఖంలో ఉన్న వాళ్ల జీవితం నిలబెట్టినట్లవుతుంది. బ్రెయిన్‌ డెడ్‌ అయిన ఓ తల్లి అవయవాలు దానం చేయడానికి కొడుకులు సిద్ధపడ్డారు. తద్వారా ఆమెకు పునర్జన్మ కలిగేలా చేశారు. ఆమె భర్త ఎప్పుడో 15 ఏళ్ల క్రితమే మరణించారు. తన రెక్కల కష్టంతో ఆమె ఆరుగురు పిల్లను పెంచి పెద్ద చేసింది. అలాంటి తల్లికి ఫిట్స్‌ వచ్చి మెదడులో రక్తస్రావం జరిగి బ్రెయిన్‌ డెడ్‌ అయింది. అవయవదానంతో తమ తల్లి మరణానంతరం కూడా జీవించాలని పిల్లలు భావించారు. ఈ ఘటన కర్నూలు కిమ్స్‌ హాస్పిటల్‌లో జరిగింది. నంద్యాల జిల్లా శ్రీశైలంలోని

కొత్తపేటకు చెందిన భాగ్యమ్మ (50)కు ఈ నెల 18వ తేదీ రాత్రి ఉన్నట్టుండి ఫిట్స్‌ వచ్చాయి. మొదట ఆమెను శ్రీశైలం దేవస్థానం హాస్పిటల్‌లో చూపించారు.

అక్కడి నుంచి 19వ తేదీ కర్నూలులోని మౌర్య హాస్పిటల్‌కి తీసుకువచ్చారు. మెదడులో రక్తస్రావమైనట్లు వైద్యులు గ్రహించారు. అక్కడ వైద్యం చేయించినా పరిస్థితి విషమించడంతో మెరుగైన వైద్యం కోసం కర్నూలు కిమ్స్‌ హాస్పిటల్‌కు తరలించారు. అక్కడ చికిత్స పొందుతుండగా ఈ నెల 21వ తేదీన బ్రెయిన్‌ డెడ్‌ అయినట్లు వైద్యులు ప్రకటించారు. ఆమె అవయవాలను దానం చేసే అవకాశం ఉండటంతో జీవన్‌దాన్‌ స్టేట్‌ కోఆర్డినేటర్‌ డా.కే. రాంబాబు బృందం బ్రెయిన్‌ డెడ్‌ అయిన మహిళ పిల్లలకు కౌన్సెలింగ్‌ చేసి అవయవదానంపై అవగాహన కల్పించారు. వారు తమ తల్లి అవయవాలను దానం చేసేందుకు అంగీకరించారు. ఒక కిడ్నీని, కాలేయాన్ని కర్నూలు కిమ్స్‌ హాస్పిటల్‌లోనే చికిత్స పొందుతున్న రోగులకు దానం చేయగా.. మరో కిడ్నిని నెల్లూరులోని అపోలో సూపర్‌ స్పెషాలిటీ ఆసుపత్రికి, ఊపిరితిత్తులను హైదరాబాదులోని గ్లోబల్‌ హాస్పిటల్‌కు పంపారు. ఇందుకోసం కర్నూలు పోలీసులు గ్రీన్‌ చానల్‌ ఏర్పాటు చేసి ఎలాంటి ఆలస్యం లేకుండా అవయవాలను తక్కువ సమయంలోనే నెల్లూరు, హైదరాబాదుకు చేరడానికి కృషి చేశారు. అవయవదాత భాగ్యమ్మ కిమ్స్‌ హాస్పిటల్‌ యాజమాన్యం, వైద్యబృందం, జీవన్‌దాన్‌ బృందం అశ్రునయనాలతో పుష్పాంజలి ఘటించారు.

Updated Date - Oct 23 , 2025 | 12:19 AM