పోరాటాలతో పార్టీని బలోపేతం చేద్దాం
ABN , Publish Date - Jun 12 , 2025 | 12:06 AM
కూటమి ప్రభుత్వ వైఫల్యాలపై పోరాడుతూ కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేద్దామని పీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల అన్నారు.
అంతా కలిసి పని చేద్దాం- పీసీసీ అధ్యక్షురాలు షర్మిల
నాయకులు, కార్యకర్తలు, కో ఆర్డినేటర్లకు నిర్దేశం
కర్నూలు అర్బన్, జూన్ 11(ఆంధ్రజ్యోతి): కూటమి ప్రభుత్వ వైఫల్యాలపై పోరాడుతూ కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేద్దామని పీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల అన్నారు. బుధవారం జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో నాయకులు, కార్యకర్తలతో విస్తృత స్థాయి సమావేశం జరిగింది. జిల్లా పార్టీ వ్యవహారాల ఇన్‌చార్జి, పీసీసీ ప్రధాన కార్యదర్శి అంబటి రామకృష్ణ యాదవ్, నంద్యాల డీసీసీ జె. లక్ష్మీనరసింహయాదవ్, నగర అధ్యక్షుడు షేక్ జిలానీ బాషా ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమానికి జిల్లాలోని 7 నియోజక వర్గాల నాయకులు, కార్యకర్తలు హాజరయ్యారు. ఈసందర్భంగా కర్నూలు, కోడుమూరు, ఎమ్మిగనూరుకు సంబంధించిన నాయకులు పార్టీలోని సంస్థాగత సమస్యలు, లోపాలను లేవనెత్తారు. డీసీసీ నియామకం లేకపోవడంతో పార్టీలో నాయకత్వ లోపం ఏర్పడిందని, గాడిలో పెట్టాల్సిన అవసరం ఉందని వారు పీసీసీ దృష్టికి తీసు కెళ్లారు. పలువురు కోఆర్డినేటర్లు తమను కలుపుకుని పోవడం లేదని ఫిర్యాదు చేశారు. దీనిపై షర్మిల మాట్లాడుతూ నగర అఽధ్యక్షుడు షేక్ జిలానీ చొరవ తీసుకుని పార్టీని మూడు నెలల్లో గాడిలో పెట్టేలా చర్యలు తీసుకోవాలన్నారు. పార్టీలో నాయకులు, కార్యకర్తలు, కో ఆర్డినేటర్లు సమన్వయంతో పనిచేయాలని, స్థానిక సమస్యలపై పోరాటాలు చేయాలని దిశా నిర్దేశం చేశారు. సమన్వయం లేక పోవడంతో ఇబ్బందులు ఉన్నట్లు తెలుస్తోందని, ఇకపై అలాంటి సమస్యలు లేకుండా చర్యలు తీసుకుంటామని, అందరం కలిసి పని చేద్దామని అన్నారు. ఈ కార్యక్రమంలో దామోదరం రాధాకృష్ణ, అనంతరత్నం మాదిగ, మాజీ ఎమ్మెల్సీ సుఽధాకర్ బాబు, ఐన్‌టీ యూసీ జిల్లా అధ్యక్షుడు బ్రతుకన్న, బజారన్న, లాజరస్, ప్రమీలమ్మ, పలువురు నాయకులు పాల్గొన్నారు.