Share News

బరా‘బార్‌’ వేయం

ABN , Publish Date - Aug 22 , 2025 | 11:11 PM

వ్యూహాత్మక బార్‌ పాలసీని ప్రభుత్వం తెరపైకి తెచ్చింది.

బరా‘బార్‌’ వేయం

నాలుగు దరఖాస్తుల విధానంపై విముఖత

బార్‌ పాలసీతో సతమతం

ప్రభుత్వం ఏమైనా ప్రకటన చేస్తుందా?

ఎదురుచూస్తున్న బార్ల యాజమాన్యాలు

ఎక్సైజ్‌ శాఖ ముమ్మర ప్రచారం

నేటికీ అందని ఒక్క దరఖాస్తు

వ్యూహాత్మక బార్‌ పాలసీని ప్రభుత్వం తెరపైకి తెచ్చింది. కొత్త పాలసీలో ఒక్కో బార్‌కు నాలుగు దరఖాస్తులు ఉంటేనే లాటరీ పద్ధతి అని ప్రకటించడంతో యాజమాన్యాలు జీర్ణించుకోలేక పోతున్నాయి. జిల్లాలోని బార్ల నిర్వాహకులు సిండికేట్‌గా మారి బార్లకు దరఖాస్తులు వేయకూడదనే నిర్ణయానికి వచ్చారు. బార్‌ పాలసీ విధానంలో లైసెన్సు దారులు నష్టపోయే నిర్ణయాలు ఉన్నాయంటూ గుసగుసలాడుకుం టున్నారు. గతంలో జిల్లాలో 27 బార్లు ఉండేవి. ప్రస్తుతం 26 బార్లకు కుదించారు. అందులో మూడు గీత కులాలకు మంజూరు చేశారు. మిగిలిన 23బార్లలో అన్నివర్గాల వారు దరఖాస్తు చేసుకునేలా విధి విధానాలు ఖరారు చేశారు. ఎక్సైజ్‌ శాఖ ముమ్ముర ప్రచారం చేస్తున్నా నేటికీ ఒక్క దరఖాస్తు కూడా రాలేదు.

కర్నూలు అర్బన్‌, ఆగస్టు 22(ఆంధ్రజ్యోతి): ప్రైవేట్‌ మద్యం దుకాణాలకు పర్మిట్‌ రూమ్‌లు ప్రకటించాక బార్లకు ప్రభుత్వం నోటిఫికేషన్‌ జారీ చేసింది. బార్ల యాజమాన్యాలు కోర్టును ఆశ్రయించే పరిస్థితి కూడా లేకుండాపోయింది. ఈక్రమంలో బార్ల నుంచి వ్యతిరేకత ఎదురైన్పప్పటికీ ఫీజును కాస్త తగ్గిస్తూ లాటరీ పద్ధతిని తెరపైకి తెచ్చింది. ప్రభుత్వం ఏమైనా ఊరటనిచ్చే దిశగా మరో నిర్ణయం తీసుకుంటుందా అనే కోణంలో బార్ల యాజమాన్యాలు ఎదురు చూస్తున్నాయి.. ఫలితంగా దరఖాస్తులు వేసేందుకు ఆసక్తి చూపడం లేదు. పాత బార్ల యాజమాన్యాలే తప్పని సరిగా దరఖాస్తులు వేస్తారనే ధీమాలో ఎక్సైజ్‌ శాఖ ఉంది. కొత్త పాలసీలో ఒక్కో బార్‌కు నాలుగు దరఖాస్తులు ఉంటేనే లాటరీ పద్ధతి అని ప్రకటించడంతో యాజమాన్యాలు జీర్ణించుకోలేకపో తున్నాయి. ఒక్కో దరఖాస్తు రుసుం గతంలో రూ.7.50లక్షలు ఉండేది. ఈసారి రూ.5లక్షలకు తగ్గించింది. ఈ రూ.5లక్షలు నాన్‌ రీఫండ్‌బుల్‌గా ప్రకటించడంతో ఇబ్బందికరంగా తయారైందనే చర్చ సాగుతోంది.

ఒక్క దరఖాస్తు రాని వైనం..

ఈనెల 18న నోటిఫికేషన్‌ జారీ చేసినప్పటికీ ఒక్క దరఖాస్తు కూడా రాక పోవడంతో అమావాస్య సాకు చూపి ఎక్సైజ్‌ శాఖ దాట వేస్తోంది. జిల్లాలోని బార్ల యాజమాన్యాలు సిండికెట్‌ దిశగా బార్లకు దరఖాస్తులు వేయకూడదనే నిర్ణయానికి కొందరు వచ్చారు. ప్రతి ఏటా లైసెన్‌ ్సలు దక్కించుకోవడానికి బార్ల యాజమానులంతా ఒక్కటయ్యే వారు. బార్‌ పాలసీ విధానంలో లైసెన్సుదారులు నష్టపోయే నిర్ణయాలు ఉన్నాయంటూ నిర్వాహకులు గుసగుసలాడుకుంటున్నారు. గడిచిన మూడేళ్ల పాటు బార్లు నిర్వహించిన బార్‌ లైసెన్సు దారులంతా ఇప్పుడు దరఖాస్తులు వేయడానికి విముఖత చూపుతున్నారు.

ఈనెల 26 లోపు దరఖాస్తులు

ఈనెల 26 లోపు దరఖాస్తులు సమర్పించాలి. జిల్లాలో 27 బార్లు ఉండేవి. ప్రస్తుతం 26 బార్లకు కుదించారు. మూడు గీత కులాలకు మంజూరు చేశారు. మిగిలిన 23 బార్లలో అన్నివర్గాల వారు దరఖాస్తు చేసుకునేలా విధివిధానాలు ఖరారు చేశారు. ఏళ్ల తరబడి బార్ల నిర్వహణలో ప్రమేయం ఉన్నవారే దరఖాస్తులు చేస్తున్నారు. కొత్తవారు అసక్తి చూపడం లేదు. ప్రతి ఏటా సిండికెట్‌ అయి ముందుగానే బార్లు మాట్లాడుకునే వారు. వైసీపీ హయంలోనూ ఇదేజరిగింది. అప్పట్లో వైసీపీ నాయకులు పెత్తనం చలాయించారు. జిల్లాలోని కర్నూలు, ఆదోని, ఎమ్మిగనూరు వంటి పట్టణాల్లో ముడుపులు చెల్లించి మరీ బార్లు దక్కించుకున్నారు. ఈసారి జిల్లాలోని అన్నిబార్లలోనూ దరఖాస్తులు వేయకూడదని అంతా ఏకమయ్యారు. ఈనెల 26 లోగా దరఖాస్తులు సమర్పించాలి. ఇప్పటిదాకా ఒక్క దరఖాస్తు కూడా అందలేదు.

పడిపోయిన అమ్మకాలు..

వైసీపీ హయాంలో బార్లలో అమ్మకాలు జోరుగా సాగాయి. మద్యం షాపుల్లో నాణ్యమైన మద్యం దొరికేది కాదు. ఎంఆర్‌పీ కంటే అదనంగా రూ.50 అధిక ధరలకు విక్రయించేవారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ప్రైవేట్‌ మద్యం పాలసీ అమలు చేసింది. ప్రైవేట్‌ దుకాణాల్లో నాణ్యమైన బ్రాండ్లు అమ్మకాలు సాగిస్తున్నాయి. ధరలు కూడా తగ్గాయి. బార్లలో అమ్మకాలు పడిపోయాయి. బార్లలలో అమ్మకాలు గతంతో పోల్చుకుంటే 50శాతం కూడా ఉండడం లేదు. ఇది కూడా ఆందోళనకు గురి చేస్తోంది.

ఐవీఆర్‌ పద్ధతిలో ఫోన్‌కాల్స్‌

కొత్త బార్‌ లైసెన్సు విధానంపై ఎక్సైజ్‌ శాఖ ముమ్మర ప్రచారం చేస్తోంది. పట్టణాల్లో ఏర్పాటుచేసే బార్లకు దరఖాస్తు చేసుకోవాలంటూ ఐవీఆర్‌(ఇంటరాక్టివ్‌ వాయిస్‌ రెస్పాన్స్‌) పద్ధతిలో ఫోన్‌ కాల్స్‌ చేస్తున్నారు. మహిళలకు ఇటువంటి కాల్స్‌ వెళ్తున్నాయి. ఈనెల 18న నోటిఫికేషన్‌ జారీ చేశారు. ఇప్పటివరకు జిల్లాలో ఒక్క బార్‌కు కూడా దరఖాస్తు నమోదు కాలేదు. ప్రస్తుతానికి దరఖాస్తు సమర్పించకూడదంటూ జిల్లా బార్‌ అసోసియేషన్‌ ఒక నిర్ణయానికి వచ్చింది. ఇప్పటిదాకా ఒక్క దరఖాస్తు రాకపోవడంపై అధికారుల్లోనూ చర్చ సాగుతోంది.

Updated Date - Aug 22 , 2025 | 11:11 PM