ప్రధాని పర్యటనను విజయవంతం చేద్దాం
ABN , Publish Date - Oct 10 , 2025 | 11:18 PM
ఈనెల 16న జిల్లాలో జరిగే ప్రధాని మోదీ పర్యటనను విజయవంతం చేద్దామని టీడీపీ జిల్లా అధ్యక్షుడు తిక్కారెడ్డి పిలుపునిచ్చారు.
టీడీపీ జిల్లా అధ్యక్షుడు తిక్కారెడ్డి పిలుపు
కర్నూలు అర్బన్, అక్టోబరు 10(ఆంధ్రజ్యోతి): ఈనెల 16న జిల్లాలో జరిగే ప్రధాని మోదీ పర్యటనను విజయవంతం చేద్దామని టీడీపీ జిల్లా అధ్యక్షుడు తిక్కారెడ్డి పిలుపునిచ్చారు. నగరంలోని టీడీపీ జిల్లా కార్యాలయంలో శుక్రవారం ఆయన అధ్యక్షతన సమన్వయ కమిటీ సమావేశం నిర్వహించారు. ఎంపీ బస్తిపాటి నాగరాజు, ఎమ్మెల్సీ బీటీ నాయుడు, ఎమ్మెల్యేలు కేఈ శ్యాంబాబు, బొగ్గుల దస్తగిరి, ‘కుడా’ చైర్మన్ సోమిశెట్టి వెంకటేశ్వర్లు, కేడీసీసీబీ చైర్మన్ విష్ణువర్ధన్ రెడ్డి, డీసీఎంఎస్ చైర్మన్ వై.నాగేశ్వరరావు యాదవ్ హాజరయ్యారు. తిక్కారెడ్డి మాట్లాడుతూ మోదీ సభకు 3లక్షల నుంచి 5 లక్షల మందిని సమీకరించడానికి కృషిచేస్తున్నామని తెలిపారు. సూపర్ జీఎస్టీ-సూపర్ సేవింగ్స్ కార్యక్రమంతో పేద, మధ్య తరగతి ప్రజలకు ఎంతో ఊరట కల్పించే దిశగా చారిత్రక నిర్ణయం తీసుకున్నారన్నారు. ఎంపీ మాట్లాడుతూ జీఎస్టీ తగ్గింపుతో ప్రజలకు ప్రయోజనం కలుగుతోందని అన్నారు. ఎమ్మెల్సీ మాట్లాడుతూ కూటమి పాలనలో ఎక్కడ చూసినా అభివృద్ధి, సంక్షేమం దిశగా రాష్ట్రం పయనిస్తోందని, దీంతో ప్రజలు సంతోషంగా ఉన్నారని అన్నారు. కోడుమూరు ఎమ్మెల్యే మాట్లాడుతూ సీఎం నారా చంద్రబాబు నాయుడు అంటేనే ఓ విజనరీ అనేది ప్రధాని సైతం గుర్తించారని, చంద్రబాబు తలపెట్టే ప్రతి కార్యక్రమాన్ని మోదీ ప్రత్యేకంగా మద్దతు తెలుపుతున్నారని అన్నారు. సోమిశెట్టి మాట్లాడుతూ ప్రధాని పర్యటనను విజయవంతం చేసేందుకు ప్రతి ఒక్కరం సమన్వయంతో కలిసి పని చేస్తామన్నారు. అనంతరం మోదీ పర్యటన ఏర్పాట్లకు పరిశీలించడానికి నాయకులు, సమన్వయ కమిటీ సభ్యులు వెళ్లారు. సమావేశంలో మాజీ ఎంపీ సంజీవకుమార్, టీడీపీ ఆదోని ఇన్‌చార్జి, మాజీ ఎమ్మెల్యే మీనాక్షినాయుడు, ఆలూరు ఇన్‌చార్జి వైకుంఠం జ్యోతి, మంత్రాలయం ఇన్‌చార్జి రాఘవేంద్రరెడ్డి, బీసీ సెల్ జిల్లా అధ్యక్షుడు సత్రం రామకృష్ణ, సాంస్కృతిక విభాగం జిల్లా అధ్యక్షుడు వి. హనుమంతరావు చౌదరి, బేతం కృష్ణుడు, మాదిగ కార్పొరేషన్ డైరెక్టర్ థరూర్ జేమ్స్, కేవీ సుబ్బారెడ్డి, కార్పొరేటర్ పద్మలతారెడ్డి, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.