విశాఖ తరహాలో నగరాన్ని తీర్చిదిద్దుదాం
ABN , Publish Date - Jul 17 , 2025 | 12:17 AM
విశాఖపట్టణం తరహాలో కర్నూలు నగరాన్ని తీర్చిదిద్దేందుకు అధికారులందరూ కలిసికట్టుగా పనిచేయాలని రాష్ట్ర పరిశ్రమలు, వాణిజ్యం, ఫుడ్ ప్రా సెసింగ్ శాఖ మంత్రి టీజీ భరత్ పేర్కొన్నారు.
అభివృద్ధి పనుల్లో కాలయాపన తగదు
నాణ్యతా ప్రమాణాలను తప్పక పాటించాలి
పార్కుల అభివృద్ధిపై దృష్టి సారించాలి
సచివాలయాలను వేరే చోటికి తరలించండి
పరిశ్రమల శాఖ మంత్రి టీజీ భరత్
మున్సిపల్ అధికారులతో సమీక్ష
కర్నూలు న్యూసిటీ, జూలై 16(ఆంధ్రజ్యోతి): విశాఖపట్టణం తరహాలో కర్నూలు నగరాన్ని తీర్చిదిద్దేందుకు అధికారులందరూ కలిసికట్టుగా పనిచేయాలని రాష్ట్ర పరిశ్రమలు, వాణిజ్యం, ఫుడ్ ప్రా సెసింగ్ శాఖ మంత్రి టీజీ భరత్ పేర్కొన్నారు. బుధవారం ప్రభుత్వ అతిథిగృహంలో మున్సిపల్ అధికారులతో మంత్రి సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నూతన కమిషనర్ పి. విశ్వనాథ్‌పై ఉన్నతాధికారుల్లో మంచి అభిప్రాయం ఉందని, పనితీరు బాగుంటుందని మంత్రి కితాబునిచ్చారు. నగరాన్ని ఆధునిక హంగులతో తీర్చిదిద్ది ‘న్యూ లుక్’ తేవాలని అన్నారు. కూటమి ప్రభుత్వం ఏర్పడి ఏడాదిన్నర కాలం పూర్తి అయిందని, ఒక మిగిలిన మూడున్నరేళ్లలో అభివృద్ధి పనులను పూర్తిచేయడంలో ఎలాంటి కాలయాపన చేయరాదని స్పష్టంచేశారు. గత సమావేశాల్లో తీసుకున్న నిర్ణయాల పురోగతిపై మంత్రి ఆరాతీశారు. అభివృద్ధి పనుల్లో నాణ్యతా ప్రమాణాలు తప్పనిసరిగా పాటించాలని, పనులు పటిష్టంగా ఉండేం దుకు అవసరమైన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. రాజ్‌విహార్ సమీపంలోని ఎల్లమ్మ గుడి నుంచి జమ్మి చెట్టు వరకు హంద్రీనది ఒడ్డున నిర్మిస్తున్న రహదారి పనులను వేగవంతం చేయాలన్నారు. ఆస్తిపన్ను, ట్రేడ్ లైసెన్సు రుసుముల మొండి బకాయిల వసూళ్లకు ప్రత్యేక యాక్షన్ ప్లాన్ అమలు చేయాలన్నారు. పార్కుల అభివృద్ధికి ప్రత్యేక దృష్టి సారించాలని, ఆగస్టు ఆఖరు నాటికి పార్కుల్లో మరమ్మతులు పూర్తిచేయాలని ఆదేశించారు. రహదారులపై ఎక్కడ గుంతలు పడకుండా ఎప్పటి కప్పుడు పూడ్చడానికి చర్యలు తీసుకోవాలన్నారు. డిసెంబర్ నాటికి 30వేల మొక్కలు నాటడమే కాకుండా వాటి సంరక్షణకు అవసరమైన జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. కమ్యూనిటీ హాల్స్‌లో ఉన్న సచివాలయాలను ఖాళీచేసి వాటిని పైకి తరలించడం, లేదం టే మరో చోటికి మార్చే ప్రక్రియ త్వరితగతిన పూర్తి చేయాలన్నారు. సమావేశంలో డిప్యూటీ కమిషనర్ సతీష్‌రెడ్డి, మేనేజర్ చిన్నరా ముడు, ప్రజారోగ్య అధికారి డా.కే.విశ్వేశ్వరరెడ్డి, సిటి ప్లానర్ ప్రదీప్ కుమార్, ఇన్‌చార్జి ఎస్‌ఈ శేషసాయి, ఆర్‌వో జునైద్, టిడ్కో అధికారి పెంచలయ్య, టీపీఆర్‌వో వెంకటలక్ష్మి పాల్గొన్నారు.