Share News

పదమ్మా పోదాం..మన ఇంటికి..!

ABN , Publish Date - Nov 29 , 2025 | 12:20 AM

ఎన్నెన్నో కలలు కంటూ పుట్టింటి నుంచి మెట్టినింట అడుగుపెట్టిన అమూల్య.. తిరిగి పుట్టింటికి వెళ్లిపోయింది. అప్పగింతల నాడు భర్తతో కలిసి వెళ్లిన తమ బిడ్డను ‘చల్లగా వెళ్లిరా తల్లీ..’ అని చెమ్మగిల్లిన కళ్లతో దీవించిన తల్లిదండ్రులు, ఇప్పుడు గుండె పగిలేలా ఏడుస్తూ విగతజీవిగా మారిన తమ బిడ్డను తీసుకుపోయారు. అప్పుడు ఒంటరిగా మెట్టినింటికి వచ్చిన అమూల్య.. ఇప్పుడు తన ప్రాణప్రదమైన కొడుకును వెంట తీసుకుని పుట్టింటికి వెళ్లిపోయింది. మెట్టినింటితో మాత్రమే బంధం తెంచుకుని వెళ్లుంటే.. బాగుండేదేమో..! కానీ లోకంతోనే బంధం తెచుకుని, కొడుకుతో కలిసి వెళ్లిపోతూ.. కన్నవారికి గుండెకోతను మిగిల్చింది.

పదమ్మా పోదాం..మన ఇంటికి..!
అమ్మా నిన్నెప్పుడు చూడాలి.. రోదిస్తున్న తల్లి, బంధువులు

కొడుకుతో కలిసి పుట్టినింటికి.. అమూల్య

పోస్టుమార్టం అనంతరం మృతదేహాల తరలింపు

డీటీ రవికుమార్‌, ఆయన తల్లిదండ్రులపై ఫిర్యాదు

అర్ధరాత్రి కేసు నమోదు చేసిన అనంతపురం వన్‌టౌన్‌ పోలీసులు

అదనపు కట్నం కోసం వేధింపులే కారణమని స్పష్టం

అనంతపురం క్రైం, నవంబరు 28 (ఆంధ్రజ్యోతి): ‘అమూల్య’ జీవితం అర్ధాంతరంగా ముగియడానికి భర్త వేధింపులే కారణమని అర్థమవుతోంది. ‘పెళ్లి సమయంలో రూ.70లక్షలకు పైగా కట్నం ఇచ్చాం. ఇల్లు కట్టుకునేందుకు ఇంకా డబ్బు కావాలని వేధించాడు. డబ్బులకే కాదు.. వేరే విషయాల్లోనూ వేధించాడు..’ అని అమూల్య దగ్గరి బంధువు ఒకరు మీడియా ఎదుట కంటతడి పెట్టారు. అతన్ని కఠినంగా శిక్షించి, మాకు ఉపశమనం కలిగించాలి అని ప్రభుత్వానికి విన్నవించాడు. బాధిత కుటుంబ సభ్యులు పలువురు అమూల్య భర్త తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. వేధింపుల కారణంగానే పసివాడిని చంపేసి అమూల్య తనతో తీసుకువెళ్లిందని కంటతడి పెట్టారు. ముద్దుల కొడుకుతో, భర్తతో ప్రశాంతంగా జీవించాల్సిన అమూల్య ఇలా బలవన్మరణానికి పాల్పడటం అందరినీ కంటతడి పెట్టిస్తోంది. శ్రీసత్యసాయి జిల్లా రామగిరి డిప్యూటీ తహసీల్దారు రవికుమార్‌కు కర్నూలు జిల్లా వెల్దుర్తికి చెందిన రామకృష్ణ, రమాదేవి దంపతుల కూతురు అమూల్యను ఇచ్చి ఐదేళ్ల కిందట వివాహం జరిపించారు. వీరికి సహర్ష అనే బాలుడు సంతానం. వీరు అనంతపురం నగరంలోని జేఎన్టీయూ రోడ్డులోని ఓ అపార్టుమెంట్‌లో నివాసం ఉంటున్నారు. కాగా అమూల్య, కుమారుడు సహర్ష అనుమానాస్పద స్థితిలో మృతిచెందిన విషయం తెలిసిందే. భర్త వేధింపులను భరించలేక.. కన్నకొడుకును చంపేసి, అమూల్య ఆత్మహత్యకు పాల్పడినట్లు పోలీసులు నిర్ధారణకు వచ్చారు.

ముగ్గురిపై ఫిర్యాదు

తమ అల్లుడు రవికుమార్‌ వేధింపుల కారణంగానే తమ కూతురు అమూల్య, మనవడు సహర్ష ప్రాణాలను కోల్పోయారని ఆమె తల్లిదండ్రులు రామకృష్ణ, రమాదేవి పోలీసులకు ఫిర్యాదు చేశారు. అదనపు కట్నం కోసం రవికుమార్‌ తమ కూతురును వేధించారని, అల్లుడితోపాటు అతడి తల్లిదండ్రులు కుళ్లాయప్ప, శివాంజినమ్మ కూడా వేధించారని ఫిర్యాదులో పేర్కొన్నారు. పెద్ద మొత్తంలో వరకట్నం ఇచ్చినా, అదనపు కట్నం కోసం వేధించారని పేర్కొన్నారు. అల్లుడు, అతని తల్లిదండ్రులపై కేసు నమోదు చేయాలని కోరారు. దీంతో వన్‌టౌన్‌ పోలీసులు సంఘటన జరిగిన రోజు అర్ధరాత్రి బీఎన్‌ఎస్‌ 304బి కింద కేసు నమోదు చేశారు. డిప్యూటీ తహసీల్దార్‌ రవికుమార్‌ ప్రస్తుతం పోలీసుల అదుపులో ఉన్నాడు. ఒకటి రెండు రోజుల్లో అరెస్టు చూపించే అవకాశం ఉందని పోలీసు వర్గాల ద్వారా తెలిసింది.

మీతో బంధం చాలు..

తల్లీకొడుకుల మృతదేహాలకు సంఘటనా స్థలం నుంచి ప్రభుత్వ సర్వజన వైద్యశాలకు గురువారం అర్ధరాత్రి తరలించారు. వైద్యులు, ఫోరెన్సిక్‌ అధికారులు, పోలీసుల సమక్షంలో శుక్రవారం పోస్టుమార్టం నిర్వహించారు. ఫోరె న్సిక్‌ అధికారులు సమగ్ర వివరాలను సేకరిం చారు. పోస్టుమార్టం అనంతరం అమూల్య, ఆమె కుమారుడి మృతదేహాలకు తమకు అప్ప గించాలని రవి, ఆమె బంధువులు డిమాండ్‌ చేశారు. దీనికి అమూల్య తల్లిదండ్రులు అభ్యంతరం తెలిపారు. ‘ఇక మీ బంధం చాలనుకునే మా అమ్మాయి ఇలా చేసుకుంది. మేమే ఇద్దరి మృతదేహాలను తీసుకువెళతాం..’ అన్నారు. దీంతో పోలీసులు కలుగజేసుకుని, అమూల్య కుటుంబానికే ఎక్కువ నష్టం జరిగిందని, వారే మృతదేహాలను తీసుకు వెళ్లడం సరైనదని అన్నారు. మృతదేహాలను శుక్రవారం సాయంత్రం 5 గంటలకు అప్పగిం చారు. తమ స్వగ్రామం కర్నూలు జిల్లా వెల్దు రికి ఇద్దరి మృతదేహాలను అమూల్య కుటుంబ సభ్యులు తీసుకువెళ్లారు.

Updated Date - Nov 29 , 2025 | 12:20 AM