మహనీయుల స్ఫూర్తితో ముందుకెళ్దాం
ABN , Publish Date - Aug 16 , 2025 | 12:23 AM
మహనీయుల స్ఫూర్తితో ముందుకు సాగుదామని రాష్ట్ర పరిశ్రమల శాఖ మంత్రి టీజీ భరత్ అన్నారు.
త్యాగధనుల పోరాటాలతోనే స్వాతంత్య్ర సిద్ధి
సమష్టి కృషితో అభివృద్ధిలో జిల్లాను అగ్రగామిగా నిలుపుదాం
అభివృద్ధి, సంక్షేమానికి కూటమి ప్రభుత్వం కృషి
రాష్ట్ర పరిశ్రమల శాఖ మంత్రి టీజీ భరత్
జాతీయ జెండా ఎగురవేత
సాయుధ దళాల గౌరవ వందనం స్వీకరణ
స్వాతంత్య్ర సమరయోధుల కుటుంబీలకు సన్మానం
ఘనంగా 79వ స్వాతంత్య్ర దిన వేడుకలు
కర్నూలు కల్చరల్, ఆగస్టు 15 (ఆంధ్రజ్యోతి): మహనీయుల స్ఫూర్తితో ముందుకు సాగుదామని రాష్ట్ర పరిశ్రమల శాఖ మంత్రి టీజీ భరత్ అన్నారు. శుక్రవారం నగరంలోని జిల్లా పోలీసు కవాతు మైదానంలో ఏర్పాటుచేసిన 79వ స్వాతంత్య్ర దిన వేడుకలకు మంత్రి టీజీ భరత్ ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. కలెక్టర్ పి.రంజిత్ బాషా, ఎస్పీ విక్రాంత్ పాటిల్, జేసీ డాక్టర్ బి.నవ్యఆయనకు స్వాగతం పలికారు. మంత్రి జాతీయ జెండాను ఎగురవేసి గౌరవ వందనం చేశారు. జిల్లా ప్రజలనుద్దేశించి మంత్రి టీజీ భరత్ ప్రసంగించారు. త్యాగధనుల పోరాటాలతోనే మనకు స్వాతంత్య్రం సిద్ధించిందని అన్నారు. సమష్టి కృషితో జిల్లాను రాష్ట్రంలో అభివృద్ధి పథంలో అగ్రగామిగా నిలుపుదామని ఆయన పిలుపునిచ్చారు. జాతిపిత మహాత్మా గాంధీజీ నేతృత్వంలో ఎందరో త్యాగధనులు అలుపెరుగని పోరాటాలు చేశారని, అమరులైన మహనీయులకు నా వినమ్ర జోహార్లు అర్పిస్తున్నానని అన్నారు. రాయలసీమ తొలి స్వాతంత్య్ర సమర యోధుడు ఉయ్యాలవాడ నరసింహారెడ్డి, బ్రిటీషు వారిని ఎదిరించిన తెర్నేకల్ గ్రామ పోరాట యోధుడు ముతుకూరు గౌడప్ప, జాతీయ భావాలను ప్రేరేపించిన గాడిచర్ల హరిసర్వోత్తమరావు వంటి ఎందరో మహానుభావులు స్వాతంత్య్ర పోరాటంలో పాల్గొన్నారని గుర్తుచేశారు. వారందరినీ ఈ సందర్భంగా స్మరించుకోవడం మన బాధ్యత అని అన్నారు. నాటి దేశభక్తి చైతన్యానికి ప్రతిరూపంగా నిలిచి, మనతో జీవనం సాగిస్తూ మనమధ్యలో ఉన్న స్వాతంత్య్ర సమరయోధుల కుటుంబీకులకు హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నానని అన్నారు. అభివృద్ధి, సంక్షేమం రెండు కళ్లుగా రాష్ట్రప్రభుత్వం ముందుకు వెళుతోందన్నారు. ప్రజలు ఇచ్చిన తీర్పును వమ్ము చేయకుండా సీఎం నారా చంద్రబాబునాయుడు నాయకత్వంలో రాష్ట్ర ప్రభుత్వం ముందడుగు వేస్తోందని ఆయన పేర్కొన్నారు. జిల్లాలోని ప్రజా ప్రతినిధులు, అధికారులు, ప్రజల సమష్టి కృషితో జిల్లాను అభివృద్ధి పథంలో నిలుపు దామని అన్నారు. రాష్ట్రాన్ని సమగ్రంగా అభివృద్ధి చేయాలన్న తలంపుతో ముఖ్యమంత్రి అహర్నిశలు శ్రమిస్తున్నారని, అన్నిరంగాల్లో అభివృద్ధి లక్ష్యంగా ముందడుగు వేస్తున్నామని అన్నారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీలన్నీ నెరవేరుస్తూ రాష్ట్ర అభివృద్ధికి కృషి చేస్తున్నామని అన్నారు. ఇందులో భాగంగానే స్వాతంత్య్ర దినోత్సవ వేళ మహిళలకు ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యం కల్పిస్తూ, స్త్రీ శక్తి పథకాన్ని అమలు చేస్తున్నామని అన్నారు. ఈ క్రమంలో జిల్లాలో సాధించిన అభివృద్ధిని ఆయన వివరించారు. జిల్లాను అభివృద్ధ్ధికి సహకరిస్తున్న ఎంపీ, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలకు, ఇతర ప్రజా ప్రతినిధులకు ఆయన కృతజ్ఞతలు తెలిపారు. పోలీసు సాయుధ దళాలను పరిశీలించి, వారి గౌరవ వందనాన్ని స్వీకరించారు. మంత్రి జిల్లాకు చెందిన స్వాతంత్య్ర సమరయోధుల కుటుంబీకులను పలుకరించి, వారిని శాలువాలు, పూలమాలలతో ఘనంగా సత్కరించారు. ఉత్తమ సేవలు అందించిన వివిధ శాఖల అధికారులు, ఉద్యోగులకు ఆయన ప్రశంసాపత్రాలు అందజేశారు. పరేడ్ గ్రౌండ్‌లో ఏర్పాటుచేసిన వివిధ ప్రభుత్వ శాఖల స్టాళ్లను పరిశీలించారు. కర్నూలు పరేడ్ గ్రౌండ్‌లో జరిగిన స్వాతంత్య్ర దినోత్సవ వేడుకల్లో జడ్పీ చైర్మన్ ఎర్రబోతుల పాపిరెడ్డి, వివిధ శాఖల అధికారులు, ఉద్యోగులు పాల్గొన్నారు.
ఆకట్టుకున్న శకటాలు
విద్యా శాఖ శకటానికి ప్రథమ బహుమతి
కర్నూలు న్యూసిటీ, ఆగస్టు 15(ఆంధ్రజ్యోతి): స్వాతంత్య్ర దిన వేడుకల్లో భాగంగా పోలీసు కవాతు మైదానంలో వివిధ శాఖల అధికారులు ఏర్పాటుచేసిన శకటాలు ఆకట్టుకున్నాయి. విద్యాశాఖ శకటానికి ప్రఽథమ బహుమతికి ఎంపికకాగా, డీఆర్‌డీఏ శాఖ శకటానికి ద్వితీయ బహుమతి, గృహనిర్మాణ, డ్వామా శాఖలకు మూడో బహుమతి లభించింది. వివిధ శాఖల స్టాళ్లు సందర్శకులను ఆకట్టుకున్నాయి.
దేశ్ రంగీలా రంగీలా రే..
అలరింపజేసిన బాలల సాంస్కృతిక ప్రదర్శనలు
కర్నూలు కల్చరల్, ఆగస్టు 15 (ఆంధ్రజ్యోతి): స్థానిక పోలీసు కవాతు మైదానంలో జరిగిన స్వాతంత్య్ర దిన వేడుకల్లో భాగంగా వివిధ పాఠశాలల విద్యార్థులు చేసిన సాంస్కృతిక ప్రదర్శనలు ఆహూతులను అలరింపజేశాయి. క్రిష్టగిరి కేజీబీవీ ప్రభుత్వ పాఠశాల విద్యార్థినుల ‘దేశ్ రంగీలా రంగీలా రే...’ నృత్య ప్రదర్శనతో ఆకట్టు కుంది. భారతీయ సంస్కృతి, సంప్రదాయాలను ప్రతిబింబించే వేషధారణలతో బా లలు ఈనృత్య ప్రదర్శనలిచ్చారు. మంత్రి టీజీ భరత్, కలెక్టర్ రంజిత్‌బాషా, ఎస్పీ విక్రాంత్ పాటిల్ ప్రత్యేకంగా ప్రశంసించారు. ఈసందర్భంగా బహూమతులు ప్రదానం చేశారు. మంత్రి టీజీ భరత్ తమ టీజీవీ గ్రూప్స్ సంస్థల నుంచి విద్యార్థులకు నగదు బహుమతులు ప్రకటించారు. మొదటి బహుమతి రూ.25 వేలు ఏపీ ట్రైబల్ వెల్ఫేర్ రెసిడెన్షియన్ పాఠశాల విద్యార్థులకు, రెండో బహుమతి రూ.20 వేలు క్రిష్టగిరి కేజీబీవీ పాఠశాల విద్యార్థులకు, మూడో బహుమతి రూ.15వేలు సిస్టర్ స్టాన్సిల్లాస్ పాఠశాల విద్యార్థులకు, నాలుగో బహుమతి రూ.10 వేలు దిన్నెదేవరపాడు అంబేద్కర్ గురుకులం పాఠశాలకు అందజేశారు.