ఉర్దూ చదవాలంటే.. ఊరు వదలాల్సిందే..!
ABN , Publish Date - Oct 29 , 2025 | 12:18 AM
ఉర్దూ దక్షిణాసియాలో మాట్లాడే ఇండో-ఆర్యన్ భాష. భారతదేశంలో అధికారికంగా గుర్తించిన భాషల్లో ఉర్దూ ఒకటి. ఉర్దూకు ఎంతో ప్రాముఖ్యత ఉన్నప్పటికీ నేటికీ పలుచోట్ల ఉర్దూను చిన్న చూపు చూస్తున్నారు. ఉర్దూ మీడియం స్కూళ్లు ఉన్నా కాలేజీలు మాత్రం చాలా తక్కువ అనే చెప్పవచ్చు.
పదో తరగతితోనే చదువును ఆపేస్తున్న విద్యార్థులు
మిథ్యగా మారిన ఉర్దూ జూనియర్ కళాశాల
ఇంటర్ కోసం 50 కిలోమీటర్ల్లు ప్రయాణించాల్సిందే
నత్తనడకన ఉర్దూ ఐటీఐ కళాశాల నిర్మాణం
పిల్లల భవిష్యత్తుపై తల్లిదండ్రుల్లో ఆందోళన
ఉర్దూ దక్షిణాసియాలో మాట్లాడే ఇండో-ఆర్యన్ భాష. భారతదేశంలో అధికారికంగా గుర్తించిన భాషల్లో ఉర్దూ ఒకటి. ఉర్దూకు ఎంతో ప్రాముఖ్యత ఉన్నప్పటికీ నేటికీ పలుచోట్ల ఉర్దూను చిన్న చూపు చూస్తున్నారు. ఉర్దూ మీడియం స్కూళ్లు ఉన్నా కాలేజీలు మాత్రం చాలా తక్కువ అనే చెప్పవచ్చు. నంద్యాల జిల్లాలోని ఆళ్లగడ్డ పరిసర మండలాల విద్యార్థులు ఉర్దూ మీడియంలో ఇంటర్మీడియట్ చదవాలంటే ఊరి వదలాల్సిన పరిస్థితి నెలకొంది. ఉర్దూను ఎక్కువగా మైనార్టీ విద్యార్థులు (బాల, బాలికలు) చదువుతారు. ముఖ్యంగా బాలికలు పదో తరగతి వరకు ఆయా మండలాల్లో ఉన్న ఉర్దూ పాఠశాలల్లో చదువును కొనసాగించి చదువులను ఆపేస్తున్నారు. కారణం దగ్గర్లో సరైన ఉర్దూ జూనియర్ కళాశాలలు లేకపోవడమే. దీంతో తల్లిదండ్రులు తమ పిల్లలను బయటికి పంపలేక వారి భవిష్యత్తుపై ఆందోళన చెందుతున్నారు.
ఆళ్లగడ్డ, అక్టోబరు 28(ఆంధ్రజ్యోతి): నియోజకవర్గంలో ఉర్దూ చదువుకునే విద్యార్థులకు పదో తరగతి వరకు ఎలాంటి ఇబ్బందులు ఉండవు. ఇక ఇంటర్‌లో చేరాలంటే అసలు సమస్య. ఎం దుకంటే ఆళ్లగడ్డ నుంచి అటు.. ఇటుగా ఇంటర్ కళాశాలలు. దాదాపు 50కిలోమీటర్ల దూరంలో ఉన్నాయి. నంద్యాలకు రావాల్సిన పరిస్థితులు నెలకొన్నాయి. ఉర్దూ కళాశాల విద్య మిథ్యగా మారింది. చాలామంది ముస్లిం మైనార్టీ విద్యార్థులు చేసేదేమీ లేక చదువు మానుకొని ఇంటి పనులకు పరిమితమౌతున్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు మైనార్టీల విద్యాభివృద్ధి కోసం తీసుకుంటున్న చర్యలు సత్ఫలితాలు ఇవ్వడం లేదు.
‘ప్రధాన మంత్రి జన వికాస్’ పేరిట..
మైనార్టీ విద్యార్థులకు విద్య, నైపుణ్యాభివృద్ధి స్వయం సంవృద్ధి కోసం ప్రధాన మంత్రి జనవికాస్ పేరిట పథకాన్ని ప్రారంభించారు. ఉమ్మడి కర్నూలు జిల్లాలో ఆరు మండలాలు ఈ పథకానికి ఎంపిక య్యాయి. వీటిలో ఆళ్లగడ్డ నియోజకవర్గంలోని ముస్లిం మైనార్టీలు ఎక్కువగా ఉన్న చాగలమర్రి, శిరివెళ్ల మండలాలను ఎంపిక చేశారు. మండలాల్లో రూ 6కోట్లతో ఉర్దూ ఐటీఐ కళాశాలల నిర్మాణానికి నిధులు మంజూరు చేశారు. ఈపనులు నాలుగేళ్లగా నత్తనడకన సాగుతున్నాయి. చాగలమర్రి మండలంలోని పెద్దవంగలి గ్రామంలో రూ 3.99 కోట్ల తో ఐటిఐ కళాశాల భవన నిర్మాణ పనులు చేపట్టి అర్థంతరంగా నిలిపి వేశారు. అలాగే శిరివెళ్ల లో రూ 1.99 కోట్లతో ఉర్దూ ఉన్నత పాఠశాల నిర్మాణం ఇంకా ప్రారంభించ లేదు.
ఇంటికే పరిమితం
ఉర్దూ పదో తరగతి చదువుకున్న విద్యార్థులు ఇంటర్ చేయాలంటే నంద్యాల, కడప జిల్లా కేంద్రాలకు వెళ్లాల్సిన పరిస్థితి. చాలా మంది ముస్లింలు తమ పిల్లలను దూర ప్రాంతానికి పంపలేక ఇంటి పనులకు పరిమితం చేస్తున్నారు. వచాగలమర్రి, శిరివెళ్ల, ఆళ్లగడ్డ మండలాల్లో ముస్లింల జనాభా అధికంగా ఉంది. ఆళ్లగడ్డ మండలంలోని ఓబులంపల్లెలో 60 శాతం మంది ముస్లింలున్నారు. ఉర్దూ పాఠశాలలో కేవలం నలుగురు మాత్రమే విద్యార్థులు ఉన్నారు. పాఠశాలలో మౌలిక సదుపాయాలు లేక పోవడం, ఉపాధ్యాయులు విద్యార్థుల సంఖ్య పెంచేందుకు తగు చర్యలు తీసుకోక పోవడం తో ఏడాదికి ఏడాది విద్యార్థుల సంఖ్య తగ్గు ముఖం పడుతూ వస్తుంది. మరి మఖ్యంగా పది తరకు చదవు కొన్న తరువాత ఏమి చదవాలి. ఎక్కడ చదవాలి అన్న ప్రశ్న కూడా తల్లితండ్రులలో ఉండడంతో ఉర్దూపై ఆశలు సన్నగిల్లుతున్నాయి. ఇప్పటికైనా ప్రభుత్వం చొరవ తీసుకొని రెండు మండాల్లో ఉర్దూ కళాశాలల నిర్మాణాలు చేపట్టి త్వరిత గతిన పూర్తి చేసి అందుబాటులోకి తీసుకురావాలని కోరుతున్నారు.
చదువు మాన్పించి వేస్తారేమోనని..
చాగలమర్రిలోని ఉర్దూ ఉన్నత పాఠశాలలో పదోతరగతి చదువుతున్నా. మా పాఠశాలలో మాకంటే ముందు చదువుకున్న అక్కలు పదో తరగతి చదివి ఏమి చేయాలో తెలియక చదువులు మానేశారు. మాకు కూడా అదే గతి పడుతుందేమోనని, తల్లిదం డ్రులు చదువులు మాన్పించి వేస్తారేమోనని భయమేస్తోంది. మాబుచాన్, పదో తరగతి, చాగలమర్రి
విద్యార్థుల సంఖ్య పెంచేందుకు చర్యలు
ఆళ్లగడ్డలోని పాత మసీదు సమీపంలో ఉర్దూ ప్రాథమికోన్నత పాఠశాల ఉంది. ఇందులో పదో తరగతి నడపడానికి ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపుతాం. ముస్లింలు ఎక్కువగా ఉన్న ఓబులంపల్లె ఉర్దూ ప్రాథమిక పాఠశాలలో విద్యార్థుల సంఖ్య పెంచేందుకు చర్యలు తీసుకుంటాం. శోభావివేకవతి, ఎంఈవో, ఆళ్లగడ్డ