ఈ-ఆఫీస్‌లో ముందంజ
ABN , Publish Date - Dec 10 , 2025 | 11:50 PM
వివిధ శాఖల మంత్రులు, కార్యదర్శ్శులు, జిల్లా కలెక్టర్లు, జాయింట్ కలెక్టర్లు ఈ-ఆఫీస్ దస్త్రాలు పరిష్కారంలో ఏమేరకు చొరవ చూపారో సీఎం చంద్రబాబు బుధవారం సమీక్షించారు.
రాష్ట్రంలో 9వ స్థానంలో కలెక్టరు
2వ స్థానంలో జాయింట్ కలెక్టర్
ప్రజలకు జవాబుదారీ పాలన అందించడమే లక్ష్యం
కర్నూలు, డిసెంబరు 10 (ఆంధ్రజ్యోతి): వివిధ శాఖల మంత్రులు, కార్యదర్శ్శులు, జిల్లా కలెక్టర్లు, జాయింట్ కలెక్టర్లు ఈ-ఆఫీస్ దస్త్రాలు పరిష్కారంలో ఏమేరకు చొరవ చూపారో సీఎం చంద్రబాబు బుధవారం సమీక్షించారు. ఈ-ఆఫీస్ ఫైళ్ల పరిష్కారంలో కలెక్టరు డాక్టర్ ఏ. సిరి 9వ స్థానంలో ఉంటే.. జాయింట్ కలెక్టర్ (జేసీ) నూరల్ ఖమర్ రెండో స్థానంలో నిలిచారు. రాష్ట్రంలో సముచిత స్థానంలో నిలిచి సీఎం చంద్రబాబు చేత ప్రశంసలు అందుకున్నారు.
9వ స్థానంలో కలెక్టరు
జిల్లా కలెక్టరు డాక్టర్ ఏ. సిరి పర్యవేక్షణలో దాదాపు 34 శాఖలు ఉంటాయి. ఆయా శాఖలకు సంబంధించిన సమస్యల పరిష్కారంలో ఎంతో చొరవ చూపారు. జిల్లాలో వివిధ విభాగాల ద్వారా జూలై 15 నుంచి ఈ నెల 9వ తేది వరకు సంబంధించిన ఈ-ఆఫీస్ ఫైళ్లు 1023 వచ్చాయి. అందులో కేవలం ఒక రోజు 14.07 గంటల్లోగా 714 సమస్యలు పరిష్కరించి రాష్ట్రంలో 9వ స్థానంలో నిలిచారు. దాదాపు 250కి పైగా ఫైల్స్ గత కలెక్టరు ద్వారా వచ్చినవే. డాక్టర్ ఏ. సిరి కలెక్టరుగా బాధ్యతలు చేపట్టిన వెంటనే ప్రధాని మోదీ పర్యటన ఏర్పాట్లలో బీజీ అయ్యారు. ఆ తరువాత జిల్లాలో విస్తృత పర్యటనలు చేసినా, ఈ-ఫైళ్లు పరిష్కారంలో సకాలంలో స్పందించి వేగంగా పరిష్కరించారు. అదే వేగంతో ముందుకు వెళ్లాలని ప్రభుత్వం ఆదేశించినట్లు తెలిసింది.
రెండో స్థానంలో జేసీ
జిల్లా జాయింట్ కలెక్టర్ (జేసీ) నూరల్ ఖమర్ ఈ-ఆఫీస్ ఫైళ్ల పరిష్కారంలో రెండో స్థానంలో నిలిచారు. ఆయన రెవెన్యూ, సివిల్ సప్లయ్ వంటి శాఖలు కీలకంగా చూస్తున్నారు. ఆ శాఖల నుంచి 274 దస్త్రాలు రాగా, కేవలం ఒకరోజు, 2.43 గంటల్లో మొత్తం ఫైళ్లు పరి ష్కరించి రాష్ట్రంలో రెండో స్థానంలో నిలిచారు. ఈ-ఆఫీస్ ఫైళ్ల పరిష్క రించడంతో కలెక్టరు, జేసీలు వేగంగా స్పందిస్తున్నారంటూ రాష్ట్ర ప్రభుత్వం కితాబు ఇచ్చిందని అధికారులు ద్వారా తెలిసింది.
ఈ-ఆఫీస్ ఫైల్ అంటే..
డిజిటల్ ఆంధ్రప్రదేశ్‌లో భాగంగా రాష్ట్ర ప్రభుత్వం ఈ-ఆఫీస్ ఫైల్ విధానం తీసుకొచ్చింది. ప్రతి కార్యాయంలో ఈ-ఆఫీస్ వ్యవస్థను అమలు చేయాలంటూ ఈ ఏడాది ఫిబ్రవరి 12న జరిగిన మంత్రులు, కార్యదర్శుల సమావేశంలో సీఎం చం ద్రబాబు స్పష్టమైన ఆదేశాలు ఇచ్చారు. కాగితపు రహిత పాలన, లాగిన్ ద్వారా వచ్చి న ఫైళ్లు, సమస్యలు తక్షణమే పరిష్కరించి ప్రజలకు జవాబుదారీ పాలన అందించా లన్నదే ఈ-ఆఫీస్ ప్రధాన్య లక్ష్యం. ఆర్థిక అంశాలతో ముడిపడి ఫైళ్లు, మరీ సంక్లిష్ట మైన అంశాలు తప్ప మిగిలిన అంశాలను తక్షణమే పరిష్కరించాల్సి ఉంది. అలాగే.. ఆర్థికపరమైన సమస్యలను ఆర్థిక లభ్యతను బట్టి ప్రాధాన్యత క్రమంలో పరిష్కారం చూపాలని ఇప్పటికే ప్రభుత్వం స్పష్టమైన ఆదేశాలు ఇచ్చింది.
పారదర్శక పాలనే లక్ష్యం
ప్రజలకు జవాబుదారీ, పారదర్శక పాలన అందించడమే ఈ-ఆఫీస్ వ్యవస్థ ప్రధాన లక్ష్యం. జిల్లాలో వివిధ శాఖలకు సంబంధించిన ఈ-ఆఫీస్ ఫైళ్లు 1,023 వచ్చాయి. అందులో 714 ఫైళ్లు ఒక రోజు 14.07 గంటల్లో క్లీయర్ అయ్యాయి. మిగిలిన దస్త్రాలు కూడా తక్షణమే క్లీయర్ చేస్తాం. కాగితపు రహిత పాలనలో భాగంగా ఈ-ఆఫీస్ ఫైళ్ల క్లియర్ చేడయంతో రాష్ట్రంలో 9వ స్థానంలో ఉండడం సంతోషంగా ఉంది. రెండో స్థానంలో జేసీ ఉండడం అభినందనీయం. మునుముందు వేగంగా పరిష్కరించి ఉత్తమమైన స్థానంలో జిల్లాను ఉంచాలని, ప్రజలకు మెరుగైన సేవలు ద్వారా పారదర్శక పాలన అందించాలనే ఆశయంగా ముందుకు వెళ్తాం.
డాక్టర్ ఏ. సిరి, కలెక్టరు