కర్నూలులో చివరి మజిలీ
ABN , Publish Date - Oct 28 , 2025 | 12:15 AM
తమిళనాడు రాష్ట్రం ధర్మవపురం జిల్లా జితన్‌హల్లికి చెందిన ప్రశాంత్ రాజన్(29) కర్నూలు సమీపంలోని చిన్నటేకూరు వద్ద బస్సు ప్రమాదంలో మృతి చెందిన విషయం విదితమే. అతడి మృతదేహానికి సోమవారం ఉదయం కర్నూలులోని జమ్మిచెట్టు వద్ద ఉన్న ఎలక్ట్రికల్ కిమాటోరియంలో కుటుంబ సభ్యులు, బంధవుల సమక్షంలో అంత్యక్రియలు నిర్వహించారు
తమిళనాడు వాసికి అంత్యక్రియలు
పూర్తయిన మృతదేహాల అప్పగింత
కర్నూలు హాస్పిటల్, అక్టోబరు 27(ఆంధ్రజ్యోతి): తమిళనాడు రాష్ట్రం ధర్మవపురం జిల్లా జితన్‌హల్లికి చెందిన ప్రశాంత్ రాజన్(29) కర్నూలు సమీపంలోని చిన్నటేకూరు వద్ద బస్సు ప్రమాదంలో మృతి చెందిన విషయం విదితమే. అతడి మృతదేహానికి సోమవారం ఉదయం కర్నూలులోని జమ్మిచెట్టు వద్ద ఉన్న ఎలక్ట్రికల్ కిమాటోరియంలో కుటుంబ సభ్యులు, బంధవుల సమక్షంలో అంత్యక్రియలు నిర్వహించారు. కర్నూలు నుంచి సొంత ప్రాంతమైన తమిళనాడుకు తీసుకెళ్లడం కష్టమని భావించి తండ్రి ఇక్కడే అంత్యక్రియలు చేయాలని కలెక్టర్‌ను కోరారు. దీంతో స్థానికంగానే అంత్యక్రియలకు ఏర్పాటు చేశారు. ఉదయం 10 గంటలకు కర్నూలు జీజీహెచ్‌లోని మార్చురీ నుంచి మహాప్రస్థానం వాహనంలో ప్రశాంత్ రాజన్ మృతదేహాన్ని తీసుకెళ్లారు. జమ్మిచెట్టు వద్ద ఎలక్ట్రికల్ కిమాటోరియంలో బంధువుల సమక్షంలో అంత్యక్రియలు నిర్వహించారు. ఎక్కడో పుట్టి ఎక్కడో పెరిగి చివరి చూపు లేకుండా ఏ మాత్రం సంబంధం లేని కర్నూలులో ఖననం చేయాల్సి వస్తోందని తండ్రి రాజన్ కన్నీరు మున్నీరయ్యారు. ప్రశాంత్ రాజన్ అంత్యక్రియలతో బస్సు అగ్ని ప్రమాద ఘటనలో మృతి చెందిన అందరి మృతదేహాలను వారి బంధువులకు అప్పగించే ప్రక్రియ పూర్తయిందని కర్నూలు జీజీహెచ్ సూపరింటెండెంట్ డా.కె. వెంకటేశ్వర్లు తెలిపారు. ఆదివారం రాత్రి 8.45 గంటలకు 18 మృతదేహాలను వారి బంధువులకు అప్పగించామని, బీహార్‌కు చెందిన వ్యక్తి మృతదేహాన్ని కూడా ఎలక్ట్రికల్ కిమాటోరియంలో అంత్యక్రియలు నిర్వహించినట్లు తెలిపారు.