1 నుంచి కర్నూలు ఉత్సవ్
ABN , Publish Date - Oct 12 , 2025 | 11:57 PM
ఉమ్మడి కర్నూలు జిల్లాలోని చారిత్రక వైభవం, ఆధ్యాత్మిక, సాంస్కృతిక, సాహిత్య అంశాలను మేళవిస్తూ వారం రోజుల పాటు ‘కర్నూలు ఉత్సవ్’ పేరిట భారీ కార్యక్రమానికి టీజీవీ కళాక్షేత్రం సంకల్పించింది.
తొలిసారిగా వారం రోజుల పాటు రాష్ట్ర అవతరణ సంబరాలు
టీజీవీ కళాక్షేత్రం అధ్యక్షుడు పత్తి ఓబులయ్య
కర్నూలు కల్చరల్, అక్టోబరు 12 (ఆంధ్రజ్యోతి): ఉమ్మడి కర్నూలు జిల్లాలోని చారిత్రక వైభవం, ఆధ్యాత్మిక, సాంస్కృతిక, సాహిత్య అంశాలను మేళవిస్తూ వారం రోజుల పాటు ‘కర్నూలు ఉత్సవ్’ పేరిట భారీ కార్యక్రమానికి టీజీవీ కళాక్షేత్రం సంకల్పించింది. ఆంధ్రరాష్ట్ర అవతరణ సందర్భంగా నవంబరు ఒకటో తేదీ నుంచి 7వ తేదీ వరకు వారం రోజుల పాటు టీజీవీ కళాక్షేత్రంలో ఆధ్వర్యంలో ‘కర్నూలు ఉత్సవ్’ నిర్వహిస్తున్నట్లు కళాక్షేత్రం అధ్యక్షులు పత్తి ఓబులయ్య తెలిపారు. ఆదివారం కళాక్షేత్రంలో జరిగిన కార్యవర్గ సమావేశంలో పలు వివరాలను వెల్లడించారు. మాజీ రాజ్యసభ సభ్యులు టీజీ వెంకటేశ్, పారిశ్రామికవేత్త బీవీ రెడ్డి, విద్యాసంస్థల అధినేతలు రవీంద్ర, జి.పుల్లయ్య, మాంటిస్సోరి రాజశేఖర్ సూచనల మేరకు సాంస్కృతిక, చారిత్రాత్మక, సాహిత్య, జానపద అంశాలను వెల్లడించే విధంగా ఈ ఉత్సవానికి కార్యాచరణ రూపొందించామన్నారు. గతంలో కర్నూలు జిల్లా వ్యాప్తంగా ఇలాంటి వేడుకలు జరగలేదని, ఇదే ప్రథమమని తెలిపారు. ఇందుకోసం డీఐజీ, కలెక్టర్, ఎస్పీల సహకారం తీసుకుంటామన్నారు. కర్నూలు ఖ్యాతిని పెంచేలా ఉన్న ఈ ఉత్సవాల్లో అధికారులు, ప్రభుత్వం కూడా పాలుపంచుకోవాలన్నారు. ఈ సమావేశంలో కళాక్షేత్రం కార్యదర్శి సి.యాగంటీశ్వరప్ప, ప్రతినిధులు పి.రాజారత్నం, మహమ్మద్ మియా, గాండ్ల లక్ష్మన్న, ఎన్‌వీ రమణ, లక్ష్మీకాంతరావు, ఈశ్వరయ్య, చంద్రకంటి మద్దయ్య, పీపీ గురుమూర్తి తదితరులు పాల్గొన్నారు.
‘కర్నూలు ఉత్సవ్’ ఇలా..
టీజీవీ కళాక్షేత్రంలో నవంబరు 1న సాయంత్రం పొట్టి శ్రీరాములు చిత్రపటానికి నివాళి, అనంతరం నగరంలోని నృత్య గురువుల ఆధ్వర్యంలో శాస్త్రీయ నృత్య ప్రదర్శనలు.
నవంబరు 2న ఉమ్మడి జిల్లా కళాకారులతో జానపద నృత్య సంగీత ప్రదర్శనలు.
నవంబరు 3న ఉమ్మడి జిల్లాకు చెందిన కవులు, కవయిత్రులతో కవి సమ్మేళనం.
నవంబరు 4న ఉమ్మడి జిల్లా సాహిత్యవేత్తలు, రచయితలతో సాహిత్య సభ,
నవంబరు 5న ‘ఆంధ్ర రాష్ట్ర అవతరణ-మొదటి రాజధాని కర్నూలు’ అనే అంశంపై విద్యార్థులకు వ్యాసరచన పోటీలు.
నవంబరు 6న అంతరించిపోతున్న తొలుబొమ్మలాట, బుర్రకథ, హరికథ ఇతర ప్రదర్శనలు
నవంబరు 7న ఔత్సాహిక పౌరాణిక కళాకారులతో ఏకాంకిక నాటక ప్రదర్శనలు ఉదయం నుంచి రాత్రి వరకు కొనసాగుతాయి. ఈ కార్యక్రమాల్లో భాగంగా జిల్లాలోని ప్రముఖుల ఛాయాచిత్ర ప్రదర్శన వారం రోజులు కళాక్షేత్రంలో కొనసాగుతుంది.