కర్నూలు జిల్లా త్యాగధనుల ఖిల్లా
ABN , Publish Date - Nov 02 , 2025 | 11:49 PM
‘ఉమ్మడి కర్నూలు జిల్లా త్యాగధనుల ఖిల్లా. ఎందరో మహనీయులు, కవులు, కళాకారులు, ప్రజా ప్రతినిధులు ఈ గడ్డకు పేరు ప్రఖ్యాతులు తెచ్చారు..’ అని పాణ్యం ఎమ్మెల్యే గౌరు చరితారెడ్డి అన్నారు.
యువత మహనీయుల స్ఫూర్తితో ముందుకు సాగాలి
పాణ్యం ఎమ్మెల్యే గౌరు చరితారెడ్డి
కర్నూలు కల్చరల్, నవంబరు 2 (ఆంధ్రజ్యోతి): ‘ఉమ్మడి కర్నూలు జిల్లా త్యాగధనుల ఖిల్లా. ఎందరో మహనీయులు, కవులు, కళాకారులు, ప్రజా ప్రతినిధులు ఈ గడ్డకు పేరు ప్రఖ్యాతులు తెచ్చారు..’ అని పాణ్యం ఎమ్మెల్యే గౌరు చరితారెడ్డి అన్నారు. నగరంలోని టీజీవీ కళాక్షేత్రంలో కొనసాగుతున్న ‘కర్నూలు ఉత్సవ్-2025’ రెండో రోజు ఆదివారం ఉదయం 10 గంటలకు ఏకాంకి పౌరాణిక పద్య నాటక పోటీలను టీజీవీ కళాక్షేత్రం అధ్యక్షుడు కళారత్న పత్తి ఓబులయ్య ప్రారంభించారు. సాయంత్రం 6 గంటల వరకు కొనసాగాయి. సాయంత్రం ప్రదర్శనలకు ముఖ్య అతిథిగా పాణ్యం ఎమ్మెల్యే గౌరు చరితారెడ్డి హాజరయ్యారు. ఆమె జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాలను ప్రారంభించారు. అంతకు ముందు కళాక్షేత్రం ఆవరణలో ఏర్పాటు చేసిన తెలుగుతల్లి, అమరజీవి పొట్టి శ్రీరాములు చిత్ర పటాలకు ఎమ్మెల్యే పూలదండలు వేసి నివాళులర్పించారు. అనంతరం అలనాటి స్వాంత్రంత్య సమరయోధులు, జిల్లాకు చెందిన సీనియర్ రంగస్థల కళాకారుల ఫొటో ఎగ్జిబిషన్‌ను ఆసక్తిగా తిలకించారు.ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో గౌరు చరితారెడ్డి ప్రసంగిస్తూ రాష్ట్ర అవతరణ దినోత్సవం సందర్భంగా వారర రోజుల పాటూ జిల్లా సంస్కృతి, సంప్రదాయాలను తెలియజేసే విధంగా కార్యక్రమాలను నిర్వహించడం అభినందనీయమన్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు జిల్లా అభివృద్ధిపై ప్రత్యేక దృష్టి ఉంచారని గుర్తు చేశారు. కళాకారులకు ఇళ్లు, ఇంటి స్థలాలు, పింఛన్లు ఇతర అంశాలపై తనవంతు సహకారం అందిస్తానని ఆమె హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో కార్యదర్శి సి.యాగంటీశ్వరప్ప, పూర్వ అధ్యక్షుడు పి.దస్తగిరి, కళాక్షేత్రం ప్రతినిధులు సీవీ రెడ్డి, మహమ్మద్ మియా, బాల వెంక టేశ్వర్లు, సంగా ఆంజనేయులు, పి.రాజారత్నం, జీవీ శ్రీనివాసరెడ్డి, గాండ్ల లక్ష్మన్న, కేవీ రమణ, రాముడు, కదిరి రమేష్, ఈశ్వరయ్య, పీపీ గురుమూర్తి తదితరులు పాల్గొన్నారు.
రంగస్థల కళాకారులకు పురస్కారాలు : కర్నూలు ఉత్సవ్-2025 రెండోరోజు నాటక రంగంలో విశేష కృషి చేసిన వారికి విశిష్ట పురస్కారాలు పాణ్యం ఎమ్మెల్యే గౌరు చరితారెడ్డి అందజేశారు. పురస్కారాలు అందుకున్న నటీనటుల్లో రంగారెడ్డి (పత్తికొండ), మల్లారెడ్డి (హుసేనాపురం), హెచ్. చంద్రన్న, ఎంఆర్ రాధిక, సి.శ్రీనివాసులు (మేక్‌పమెన్), (కర్నూలు), సిద్దయ్య (ఆళ్లగడ్డ), సాయిబాబా (తూడిచర్ల), శారదాబాయి, రామబ్రహ్మం (మేక్‌పమెన్, నంద్యాల) ఉన్నారు. కళాకారులకు జ్ఞాపిక, ప్రశంసాపత్రం, శాలువతో ఘనంగా సత్కరించారు. ఇదిలా ఉండగా సాయిప్రదీప్ ఆధ్వర్యంలో చిన్నారులు ప్రదర్శించిన కూచిపూడి నృత్య ప్రదర్శనలు ఆకట్టుకున్నాయి. శ్రీనివాసులు బృందం, ప్రజా వేదిక కరుణాకర్ బృందం కోలాట ప్రదర్శన, గజల్ గాయకుడు మహ్మద్ మియా ఆధ్వర్యంలో కళాకారుల జానపద సంగీత విభావరి ఆకట్టుకుంది.