వివాదాస్పదంగా నాలెడ్జ్ సెంటర్
ABN , Publish Date - Nov 25 , 2025 | 01:19 AM
ర్నూలు మెడికల్ కాలేజీలో నార్త్ అమెరికా కేఎంసీ ఓల్డ్ స్టూడెంట్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో నిర్మించతలపెట్టిన నాలెడ్స్ సెంటర్ అండ్ స్పోర్ట్స్ కాంప్లెక్స్ మరోసారి వివాదానికి దారి తీసింది
కర్నూలు హాస్పిటల్, నవంబరు 24 (ఆంధ్రజ్యోతి): కర్నూలు మెడికల్ కాలేజీలో నార్త్ అమెరికా కేఎంసీ ఓల్డ్ స్టూడెంట్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో నిర్మించతలపెట్టిన నాలెడ్స్ సెంటర్ అండ్ స్పోర్ట్స్ కాంప్లెక్స్ మరోసారి వివాదానికి దారి తీసింది. రూ.50 కోట్ల వ్యయంతో కర్నూలు మెడికల్ కాలేజీలో వైద్య విద్య విజ్ఞానానికి సంబంధించిన నాలెడ్జ్ సెంటర్ భవనం నిర్మించడానికి అల్యూమి అసోసియేషన్ ప్రభుత్వానికి ప్రతిపా దనలు పంపింది. దీంతో పాటు క్రీడల భవనాన్ని నిర్మించాలని కూడా తలపెట్టారు. ఈ మేరకు గత వైసీపీ ప్రభుత్వం 2023 జూన్‌లో అనుమతి ఇస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. అయితే మెడికల్ కాలేజీ ఆవరణలో నాలెడ్స్ సెంటర్ ఎక్కడ నిర్మించాలనే అంశంపై వివాదం నెలకొంది. కేఎంసీ మైదానంలోని రోడ్డు వైపు నిర్మించాలని అల్యూమి అసోసియేషన్ తలపెట్టింది. అయితే గ్రౌండ్ ఆటస్థలంలో 60 సెంట్లు కేటాయించడంపై జూనియర్ డాక్టర్లు, ఏపీ ప్రభుత్వ వైద్యుల సంఘం నాయకులు అభ్యంతరం వ్యక్తం చేశారు. దీనిపై నిరసన కార్యక్రమాలు చేపట్టడంతో తాత్కాలికంగా పనులు ఆపేశారు. మళ్లీ ఈ ఏడాది జూలై 28న నాలెడ్స్ సెంటర్ భవన నిర్మాణానికి శ్రీకారం చుట్టగా అప్పడు ఏపీజీడీఏ వైద్యుల సంఘం అధ్యక్షుడు డా.పి. బ్రహ్మాజీ మాస్టర్‌తో కొందరు ప్రొఫెసర్లు వైద్యులు, జూనియర్ డాక్టర్లతో కలిసి పూర్వ విద్యార్థుల సంఘం నేతలతో గొడవకు దిగారు. నాలెడ్జ్ సెంటర్ పేరుతో 60 సెంట్ల స్థలంలో భవనం నిర్మిస్తే అడ్డుకుంటామని హెచ్చరించడంతో పనులు ఆగిపోయాయి. సెప్టెంబరు 19వ తేదీ ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ వైస్ చాన్స్‌లర్ డా. పి. చంద్రశేఖర్ మెడికల్ కాలేజీలో నాలెడ్జ్ సెంటర్ భవనం కోసం న్యూలెక్చరర్ గ్యాలరీకి ఎదురుగా ఉన్న స్థలాన్ని, మరో కొన్ని స్థలాలను పరిశీలించి అందరికీ ఆమోదయోగ్యమైన స్థలంలో నిర్మాణం చేపట్టాలని ఆదేశించారు. ఈ నేపథ్యంలో సోమవారం కర్నూలు మెడికల్ కాలేజీ అభివృద్ది కమిటీ సమావేశాన్ని రాష్ట్ర పరిశ్రమల శాఖ మంత్రి టీజీ భరత్ నిర్వహించారు. ఈ సందర్భంగా కేఎంసీ అల్యూమి (ఎన్‌ఆర్‌ఐ) సంఘం నిర్మించతలపెట్టిన నాలెడ్జ్ సెంటర్ అంశం తెరమీదకు వచ్చింది. సంఘం రూ.50 కోట్లతో ఖర్చు చేసేందుకు ముందుకు వస్తే ఎందుకు అభ్యంతరం చెబుతున్నారో అర్థం కావడం లేదని మంత్రి వ్యాఖ్యానించారు. నాలెడ్జ్ సెంటర్‌కు 60 సెంట్ల స్థలాన్ని ప్రభుత్వం కేటాయించాలని, దీన్ని కట్టకుండా అభ్యంతరాలు చెబుతున్న జూనియర్ డాక్టర్లు, ఏపీజీడీఏ వైద్యుల సంఘం నేతలతో మాట్లాడుతానని అన్నారు. పరిపాలనపరంగా తమకు ఎలాంటి ఇబ్బంది లేదని, ప్రభుత్వం ఆదేశాలను పాటిస్తామని ప్రిన్సిపాల్ మంత్రికి వివరించారు. ఆ తర్వాత కొందరు జూనియర్ డాక్టర్లతో మంత్రి మాట్లాడారు. ఏపీజీడీఏ వైద్యుల సంఘం అధ్యక్షుడు డా. బ్రహ్మాజీ మాస్టర్ సమావేశానికి వస్తుండగా.. మంత్రి వెళ్లడంతో వెనుదిరిగారు. ఎట్టి పరిస్థితుల్లో నాలెడ్జ్ సెంటర్‌ను కేఎంసీ గ్రౌండ్స్‌లో నిర్మించేందుకు అనుమతించమని డా. బ్రహ్మాజీ మాస్టర్ తేల్చి చెప్పారు. ఈ వ్యవహారం ఏ మలుపు తిరుగుతుందో వేచి చూడాలి.