Share News

బస్టాండ్‌ను శుభ్రంగా ఉంచండి

ABN , Publish Date - Dec 10 , 2025 | 11:40 PM

కర్నూలు కొత్త బస్టాండ్‌ను, పరిసరాలను పరిశుభ్రంగా ఉంచాలని కలెక్టర్‌ డాక్టర్‌ ఏ. సిరి జిల్లా ప్రజా రవాణా అధికారి శ్రీనివాసులను ఆదేశించారు.

బస్టాండ్‌ను శుభ్రంగా ఉంచండి
కొత్తబస్టాండ్‌లో హోటల్స్‌ను పరిశీలిస్తున్న కలెక్టర్‌

అకస్మిక తనిఖీ చేసిన కలెక్టర్‌ డా. ఏ. సిరి

ఆర్టీసీ డార్మిటరీ నిర్వహణపై అసంతృప్తి

స్టాళ్లు, హోటళ్లలో నిబంధనలు పాటించాలని ఆదేశం

కర్నూలు రూరల్‌ డిసెంబరు 10(ఆంధ్రజ్యోతి): కర్నూలు కొత్త బస్టాండ్‌ను, పరిసరాలను పరిశుభ్రంగా ఉంచాలని కలెక్టర్‌ డాక్టర్‌ ఏ. సిరి జిల్లా ప్రజా రవాణా అధికారి శ్రీనివాసులను ఆదేశించారు. బుధవారం కలెక్టర్‌ కర్నూలు కొత్త బస్టాండ్‌ను అకస్మిక తనిఖీ చేశారు. ఈ సందర్భంగా బస్టాండ్‌లో ఉన్న శ్రీలక్ష్మీ వెంకటేశ్వర డార్మిటరీలో టాయిలెట్లు అపరిశుభ్రంగా ఉండటాన్ని గమనించిన కలెక్టర్‌ అసంతృప్తి వ్యక్తం చేసి సంబంధిత కాంట్రాక్టర్‌పై ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రయాణికులకు ఇబ్బంది లేకుండా శుభ్రంగా ఉంచేలా చర్యలు చేపట్టాలని కలెక్టర్‌ ఆర్టీసీ అధికారి శ్రీనివాసులను ఆదేశించారు. బస్టాండ్‌లో ఉన్న వివిధ స్టాల్స్‌లో నిబంధనల మేరకు అమ్ముతున్నారా అని నిర్వాహకులను అడిగి తెలుసుకున్నారు. వాటితో పాటు భోజనం, టిఫిన్‌ హోటళ్లను సైతం కలెక్టర్‌ తనిఖీ చేశారు. హోటళ్ల నిర్వహణలో కచ్చితంగా శుభ్రత పాటించాలని, నాణ్యమైన నూనెను వాడాలన్నారు. ప్రజా రవాణాను భద్రతను మరింత బలోపేతం చేయాలనే ఉద్దేశంతో బస్టాండులో ఉన్న నిఘా, భధ్రత విభాగాలను పరిశీలించారు. ప్రయాణికులు వినియోగించే టాయిలెట్‌ ఎంట్రెన్స్‌ వద్ద డోర్‌ ఏర్పాటు చేయాలని ఆమె ఆదేశించారు. బస్టాండులో ఏర్పాటు చేసిన త్రాగునీటి కేంద్రాన్ని పరిశీలించి, అ ప్రాంతంలో దుర్వాసన రావడం గమనించి, పరిశుభ్రం చేయాలని ఆదేశించారు. డిపోలో డ్రైవర్లు, సిబ్బందిని బ్రీత్‌ అనలైజర్‌ ద్వారా క్షుణ్ణంగా చెక్‌ చేస్తున్న తీరును కలెక్టర్‌ పరిశీలించారు. డిపో గ్యారేజిలో డీజిల్‌ బంకులో డీజిల్‌ సాంద్రత, ఉష్టోగ్రతను స్వయంగా పరిశీలించారు. ఇంధన నాణ్యత విషయంలో ఎలాంటి రాజీ ఉండకూడదని కలెక్టర్‌ అధికారులను ఆదేశించారు. కలెక్టర్‌ వెంట ఆర్టీసీ ప్రజా రవాణా అధికారులు, సిబ్బంది ఉన్నారు.

Updated Date - Dec 10 , 2025 | 11:40 PM