శ్రీగిరిపై కార్తీక సందడి
ABN , Publish Date - Nov 17 , 2025 | 11:29 PM
శ్రీశైల మహా క్షేత్రంలో కార్తీక మాసోత్సవాలు వైభవంగా కొనసాగుతున్నాయి.
ఆఖరి సోమవారం భక్తులతో కిటకిటలాడిన శ్రీశైల క్షేత్రం
దర్శనానికి రెండు గంటల సమయం
శ్రీశైలం, నవంబరు 17 (ఆంధ్రజ్యోతి): శ్రీశైల మహా క్షేత్రంలో కార్తీక మాసోత్సవాలు వైభవంగా కొనసాగుతున్నాయి. ఆఖరి సోమవారం సందర్భంగా వేలాదిగా తరలివచ్చిన భక్తులు కృష్ణానదిలో పుణ్యస్నానాలు, కార్తీక దీపదానాలు చేసుకున్నారు. తెల్లవారుజామున సుప్రభాతసేవ మహామంగళ హారతి అనంతరం 4 గంటల నుంచి రాత్రి 10:30 గంటల వరకు స్వామి, అమ్మవార్ల సర్వ దర్శన సౌకర్యం కల్పించారు. ఉభయ దేవాలయాల్లో సుమారు రెండు గంటలపాటు దర్శన సమయం పడుతున్నట్లు ఈవో శ్రీనివాసరావు తెలిపారు. క్షేత్రానికి వచ్చే ప్రతి భక్తులందరికీ దర్శనం కల్పించే దిశగా తగు చర్యలు తీసుకున్నట్లు చెప్పారు. అదే విధంగా క్యూలైన్లలో వేచి ఉండే యాత్రికులకు సాంబార్ అన్నం, పులిహోర, పాలు, తాగునీరు, బిస్కెట్లు వంటి అల్పాహారాన్ని శివసేవకులతో నిరంతర పంపిణీ చేస్తున్నట్లు చెప్పారు. అన్నదాన భవనంలో రోజూ సుమారు ఐదువేల మంది అన్నప్రసాదాన్ని స్వీకరిస్తున్నట్లు తెలిపారు. భక్తుల రద్దీకి అనుగుణంగా 10 కౌంటర్లు ఏర్పాటు చేసి ప్రసాదాలను అందిస్తున్నారు. ఉత్తర మాడవీధితో పాటు గంగాధర మండపం వద్ద కార్తీక దీపాలు వెలిగించుకునేందుకు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. ఆఖరు సోమవారం సుమారు 40 వేల మంది భక్తులు దర్శించుకున్నట్లు అధికారులు అంచనా వేశారు.
లక్ష దీపోత్సవం
శ్రీశైల మహాక్షేత్రంలో పరమశివునికి ప్రీతికరమైన కార్తీకమాసంలో ఆఖరి సోమవారం రోజున భ్రమరాంబ మల్లికార్జున స్వామిఅమ్మవార్లకు శాస్త్రోక్త పూజలు ఘనంగా నిర్వహించారు. సాయంకాలం ఉత్సవమూర్తులను ఆలయ ఉత్సవంగా పుష్కరిణి వద్దకు తీసుకువచ్చి దశవిధ హారతులను ఇచ్చారు. పుష్కరిణి నాలుగువైపులా లక్షదీపోత్సవాన్ని నిర్వహించి శివసేవకులు, భక్తులు దీపాలు వెలిగించుకోవటానికి అవకాశం కల్పించారు. కార్యక్రమంలో ఈవో శ్రీనివాసరావు, ఆలయ పీఆర్వో శ్రీనివాసరావు, ఎడిటర్ అనిల్‌కుమార్, ఈఈ నర్సింహ రెడ్డి, డీఈ శాస్త్రి, ఏఈవోలు, పర్యవేక్షకులు, ఇతర సిబ్బంది పాల్గొన్నారు.