Share News

శ్రీశైలంలో కార్తీకం

ABN , Publish Date - Nov 10 , 2025 | 11:23 PM

ద్వాదశ జ్యోతిర్లింగం, అష్టాదశ శక్తి పీఠమైన శ్రీశైల పుణ్యక్షేత్రం కార్తీక శోభతో కళకళలాడుతోంది. కార్తీకమాసం సోమవారం కావడంతో తెల్లవారుజాము నుంచే పాతాళగంగలో పుణ్యస్నానాలను చేసుకొని కృష్ణమ్మకు దీపాలను వెలిగించి పసుపు కుంకుమలతో సారెను సమర్పించారు.

శ్రీశైలంలో కార్తీకం
ఆలయ పుష్కరిణి వద్ద లక్షదీపోత్సవం

కృష్ణమ్మ ఒడిలో పుణ్యస్నానాలు, దీప దానాలు

ఆది దంపతులకు లక్ష దీపోత్సవం

పుష్కరిణికి దశవిధ హారతులు

శ్రీశైలం నవంబరు 10 (ఆంధ్రజ్యోతి) : ద్వాదశ జ్యోతిర్లింగం, అష్టాదశ శక్తి పీఠమైన శ్రీశైల పుణ్యక్షేత్రం కార్తీక శోభతో కళకళలాడుతోంది. కార్తీకమాసం సోమవారం కావడంతో తెల్లవారుజాము నుంచే పాతాళగంగలో పుణ్యస్నానాలను చేసుకొని కృష్ణమ్మకు దీపాలను వెలిగించి పసుపు కుంకుమలతో సారెను సమర్పించారు. పరమశివుని దర్శించేందుకు ఉభయ తెలుగు రాష్ట్రాలతో పాటు ఉత్తర, దక్షిణాది రాష్ట్రాల నుండి అధిక సంఖ్యలో భక్తులు క్యూలైన్‌ల్లో బారులు దీరారు. స్వామి, అమ్మవార్ల దర్శనానికి సుమారు రెండు గంటల సమయం పట్టిందని అధికారులు తెలిపారు. కార్తీక మాసాంతం శని, ఆది, సోమవారాలతోపాటు ప్రభుత్వ సెలవు రోజులు భక్తులందరికీ అలంకార దర్శనం కల్పిస్తున్నట్లు ఈవో శ్రీనివాసరావు అన్నారు. అదేవిధంగా మాసాంతం గర్భాలయ అభిషేకాలు, సామూహికాభిషేకాలను తాత్కాలికంగా నిలిపివేశారు. క్యూలైన్‌లో వేచి ఉండే యాత్రికులకు నిరంతరం అల్పాహారం, మంచినీరు అందిస్తున్నట్లు ఆలయ పీఆర్‌వో శ్రీనివాసరావు తెలిపారు.

లక్ష దీపోత్సవం.. పుష్కరిణికి దశవిధ హారతులు

శ్రీశైలంలో సోమవారం సాయంకాలం భ్రమరాంబ మల్లికార్జున స్వామి, అమ్మవార్ల ఉత్సవ మూర్తులను ఆలయ ఉత్సవంగా పుష్కరిణి వద్దకు తోడ్కొని వచ్చి ప్రత్యేక పుష్పాలతో అలంకరించిన వేదికపై పూజా క్రతువులు జరిపించారు. అనంతరం స్వామి, అమ్మవార్లతోపాటు పుష్కరిణికి దశవిధ హారతులను ఇచ్చారు. కార్యక్రమంలో చైర్మన్‌ రమేష్‌నాయుడు, ఈవో శ్రీనివాసరావు, ఆలయ పీఆర్‌వో శ్రీనివాసరావు, ఈఈ నర్సింహరెడ్డి, డీఈ శాస్ర్తి, ఏఈవోలు పాల్గొన్నారు.

Updated Date - Nov 10 , 2025 | 11:23 PM