కపాస్ కిసాన్ యాప్
ABN , Publish Date - Sep 02 , 2025 | 11:20 PM
కపాస్ కిసాన్ యాప్
పత్తి కొనుగోలు చేసేందుకు సీసీఐ చొరవ
క్వింటానికి రూ.8,110లు మద్దతు ధర
రాష్ట్రంలోనే పత్తి పంట సాగులో మొదటి స్థానంలో ఉన్న ఉమ్మడి కర్నూలు జిల్లా రైతులకు పత్తి కొనుగోలులో ఈ సంవత్సరం అత్యధికంగా ప్రయోజనాన్ని కల్పించేందుకు సీసీఐ (కాటన్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా) సంస్థ అధికారులు ప్రత్యేక చొరవ తీసుకుంటున్నారు. క్వింటానికి రూ.8,110లు మద్దతు ధరలు రైతులకు అందనుంది. పత్తి రైతుల కోసం కపాస్ కిసాన్ యాప్‌ను కేంద్ర ప్రభుత్వం రూపొందించింది. ఈ యాప్‌తో రైతులకు దళారుల నుంచి విముక్తి కలుగుతుంది. కనీస మద్దతు ధర పొందా లంటే ఈ యాప్‌లో రిజిస్టర్ అయిన రైతులు పత్తి విక్రయ సమయంలో స్లాట్ బుక్ చేసుకోవాల్సి ఉంటుంది. ఏరోజు సీసీఐ కేంద్రంలో ఆ రైతులు విక్రయించాలో వివరాలు తెలుపుతూ సీసీఐ అధికారులు, యాప్ ద్వారా సమాచారాన్ని అందిస్తారు. ఇలా చేయడం వల్ల పత్తిని అమ్ముకునేందుకు సీసీఐ కేంద్రాల వద్ద రైతులు రోజుల తరబడి నిరీక్షించాల్సిన బాధ తప్పుతుంది.
కర్నూలు అగ్రికల్చర్, సెప్టెంబరు 2 (ఆంధ్రజ్యోతి): కపాస్ (పత్తి) రైతుల కోసం కపాస్ కిసాన్ యాప్‌ను కేంద్ర ప్రభుత్వం రూపొందించింది. రైతులు కేంద్రం ప్రకటించిన క్వింటానికి రూ.8,110లు అందుకునే అవకాశాన్ని సీసీఐ(కాటన్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా) ఈసారి కల్పించింది. ఇందులో భాగంగా ప్రతి పత్తి రైతు మద్దతు ధరను అందుకు నేందుకు ఈయాప్‌ను అందుబాటులోకి తెచ్చింది. పంట పండించే రైతులు తమపేర్లను సెప్టెంబరు 1నుంచి 30వ తేదీ వరకు ఈయాప్‌లో నమోదు చేసుకోవాల్సి ఉంటుంది. అలా నమోదు చేసుకున్న వారే సీసీఐ కొనుగోలు కేంద్రాల్లో తమ సరుకును విక్రయించుకునే అవకాశం ఉంటుంది. ఈ నూతన కార్యక్రమంపై రైతుల్లో విస్తృతంగా అవగాహన కల్పించాలని సీసీఐ ఉన్నతాధికారులు మార్కెటింగ్, వ్యవసాయ శాఖల యంత్రాంగాలకు సమాచారాన్ని అందజేశారు.
యాప్ ద్వారా ప్రయోజనం ఇలా
ప్రతి పత్తి రైతు తన వద్దఉన్న పత్తిని నేరుగా సీసీఐ కేంద్రంలోనే అమ్ముకునేందుకు ఈ కపాస్ కిసాన్ యాప్‌ను కచ్చితంగా డౌన్‌లోడు చేసుకోవాలి. ఆ రైతుకు సంబంధించి భూమి రికార్డులు, రెవెన్యూ శాఖ అధికారుల ద్వారా ధ్రువీకరించిన పత్తి పంట రికార్డు, ఆధార్ కార్డు వివరాలు ఈ యాప్‌లో నమోదు చేయాలి. ఫలితంగా ఉమ్మడి జిల్లాలో పత్తి రైతులు పంట విస్తీర్ణం, సాంధ్రత వివరాలన్నీ సీసీఐ అధికా రులకు నేరుగా అందుతాయి. ఈనెలాఖరుకు రైతులు ఈయాప్‌లో రిజిస్టర్ చేసుకో వాల్సి ఉంటుందని సీసీఐ అధికారులు చెబుతున్నారు.
దళారుల నుంచి విముక్తి
గత ఏడాది క్వింటాం పత్తికి సీసీఐ రూ.7,520లు ధర చెల్లించింది. మార్కెటింగ్ శాఖ అధికారుల సహకారంతో దళారులు రైతులకు తక్కువ ధరను చెల్లించి ఆ పత్తిని వారే సీసీఐ కేంద్రాలకు తీసుకెళ్లి మద్దతు ధర పొంది పెద్ద ఎత్తున లాభపడ్డారు. గత సంవత్సరం ఖరీఫ్‌లో సాగైన పత్తికి సంబంధించి దాదాపు రూ.235 కోట్ల దాకా సీసీఐ కొనుగోలు చేసింది. ఇందులో కనీసం 30 శాతానికి మించి రైతుల నుంచి కొనుగోలు చేయలేదు. మిగిలిన 70 శాతం పత్తిని దళారులే సీసీఐకు అమ్మి లాభపడ్డారు. ఈ ఏడాది ఆ పరిస్థితులు తలెత్తకుండా దళారుల ప్రమేయం లేకుండా సీసీఐ సంస్థకు రైతులే నేరుగా పత్తిని అమ్ముకునే విదంగా ఏర్పాట్లను చేపట్టడం జరిగింది. ఈ సంవత్సరం క్వింటం పత్తికి రూ.8,110లు మద్దతు ధరను ప్రకటించింది. గత సంవత్సరం పోలిస్తే క్వింటానికి రూ.500 పెంచింది. కనీస మద్దతు ధర పొందా లంటే ఈ యాప్‌లో రిజిస్టర్ అయిన రైతులు పత్తి విక్రయ సమయంలో స్లాట్ బుక్ చేసుకోవాల్సి ఉంటుంది. ఏరోజు సీసీఐ కేంద్రంలో ఆ రైతులు విక్రయించాలో వివరాలు తెలుపుతూ సీసీఐ అధికారులు, యాప్ ద్వారా సమాచారాన్ని అందిస్తారు. ఇలా చేయడం వల్ల పత్తిని అమ్ముకునేందుకు సీసీఐ కేంద్రాల వద్ద రైతులు రోజుల తరబడి నిరీక్షించాల్సిన బాధ తప్పుతుంది. స్లాట్ బుక్ చేసుకునే వారికి మాత్రమే ఈ వెసలు బాటు ఉంటుంది.
ప్రతి రైతు యాప్‌ను సద్వినియోగం చేసుకోవాలి
పత్తి రైతులకు సీసీఐ సంస్త అమలులోకి తెచ్చిన కపాస్ కిసాన్ యాప్ ఒక సువర్ణావకాశం వంటిదే. దళారులను ఆశ్రయించి మోసపోవాల్సిన అవసరం ఉండదు. ఇప్పుడే ప్రతి పత్తి రైతు కపాస్ కిసాన్ యాప్‌ను డౌన్‌లోడు చేసుకుని పంట సాగుకు సంబంధించిన వివరాలు నమోదు చేసుకోవాలి. ఈ యాప్‌ను సద్వినియోగం చేసుకోవాలి.
నారాయణమూర్తి, ఏడీఎం, కర్నూలు