త్వరలో కల్వకుర్తి-నంద్యాల రహదారి పనులు
ABN , Publish Date - Oct 27 , 2025 | 11:58 PM
తెలంగాణ రాష్ట్రంలోని కల్వకుర్తి-నంద్యాల ఎన్‌హెచ్-167కే రహదారి నిర్మాణ పనులు త్వరలో ప్రారంభమవు తాయని ఆ శాఖ డీఈ జగదీశ్వరగుప్తా తెలిపారు.
డీఈ జగదీశ్వర గుప్తా
కొత్తపల్లి, అక్టోబరు 27 (ఆంధ్రజ్యోతి): తెలంగాణ రాష్ట్రంలోని కల్వకుర్తి-నంద్యాల ఎన్‌హెచ్-167కే రహదారి నిర్మాణ పనులు త్వరలో ప్రారంభమవు తాయని ఆ శాఖ డీఈ జగదీశ్వరగుప్తా తెలిపారు. సోమవారం డీఈ కొత్తపల్లి తహసీల్దార్ కార్యాలయంలో తహసీల్దార్ ఉమారాణి, ఏఈ రవికాంత్, డిప్యూటీ ప్రాజెక్టు మేనేజర్ జయకుమార్‌తో కలిసి విలేకరులతో మాట్లాడారు. కల్వకుర్తి నుంచి నంద్యాల వరకు 10 మీటర్ల వెడల్పుతో రహదారి నిర్మాణ పనులు కేసీవీఆర్ ఇన్‌ప్రా ప్రాజెక్టు ప్రైవేటు లిమిటెడ్ సంస్థ చేపడుతోందన్నారు. ఈ రహదారి నిర్మాణం కోసం 62.571 కిలోమీటర్ల పరిధిలో 620.289 ఎకరాలు అవసరం కాగా, అందులో 154.67 ఎకరాలు ప్రభుత్వ భూమి ఉందన్నారు. 465.67 ఎకరాలు ప్రైవేటు వ్యక్తుల నుంచి భూములు కొనుగోలు చేసినట్లు తెలిపారు. ఇప్పటి వరకు 334.446 ఎకరాలకు గానూ 79 శాతం రైతులకు పరిహారం ఇవ్వడం జరిగిందన్నారు. ఇంకా 21 శాతం మంది రైతులకు పరిహారం ఇవ్వాల్సి ఉండగా.. ఒకరు సాగులో ఉన్నారనీ, మరొకరు ఆన్‌లైన్‌లో ఉండటం వల్ల నిర్మాణ పనులకు కొంత జాప్యం జరుగుతోందని చెప్పారు. ఏదీ ఏమైనా వర్షాలు పూర్తిగా తగ్గిన వెంటనే కల్వకుర్తి నుంచి కొత్తపల్లి, ఆత్మకూరు, వెలుగోడు, బండి ఆత్మకూరు, నంద్యాల మండలాల మీదుగా నిర్మాణ పనులు చేపడుతామన్నారు. ఇప్పటికే వీటికి సంబంధించిన మెటీరియల్ సిద్ధంగా ఉంచినట్లు డీఈ జగదీశ్వర గుప్తా తెలిపారు.