కూటమి నేతల్లో జోష్
ABN , Publish Date - Oct 17 , 2025 | 11:05 PM
బహుముఖ ప్రజ్ఞతో సినీ రంగంలో, కోట్లాది హృదయాల్లో పదిలమైన స్థానం సొంతం చేసుకున్న యుగపురుషుడు ఎన్టీఆర్ 1982లో తెలుగుదేశం పార్టీ స్థాపించిన తరువాత చైతన్య రథయాత్రలో భాగంగా కర్నూలుకు వ చ్చారు.
ఎన్టీఆర్ చైతన్య రథయాత్ర తర్వాత ఆ స్థాయిలో మోదీ సభ
జీఎస్టీ 2.0 సభ సూపర్ సక్సెస్
సమష్టి కృషి సఫలం.. వెల్లువలా తరలిచ్చిన జనం
కర్నూలు, అక్టోబరు 17 (ఆంధ్రజ్యోతి): బహుముఖ ప్రజ్ఞతో సినీ రంగంలో, కోట్లాది హృదయాల్లో పదిలమైన స్థానం సొంతం చేసుకున్న యుగపురుషుడు ఎన్టీఆర్ 1982లో తెలుగుదేశం పార్టీ స్థాపించిన తరువాత చైతన్య రథయాత్రలో భాగంగా కర్నూలుకు వ చ్చారు. ఆసమయంలో రహదారులు జనవరద కట్టాయి. 1992-93 మధ్యలో సింహగర్జన సభకు లక్షలాదిగా ప్రజలు తరలివచ్చారు. ఆ తర్వాత ఉమ్మడి కర్నూలు జిల్లాలో ఆ స్థాయిలో జరిగిన సభ బహిరంగ సభ ప్రధాని మోదీ హాజరైన సూపర్ జీఎస్టీ-సూపర్ సేవింగ్స్ సభనే అంటున్నారు రాజకీయ విశ్లేషకులు. ముఖ్యమంత్రి చంద్రబాబు నేతృత్వంతోని కూటమి ప్రభుత్వం, టీడీపీ, జనసేన, బీజేపీ నేతలు ప్రతిష్టాత్మకంగా సభా ఏర్పాట్లు, జన సమీకరణ చేపట్టినా.. ప్రధానమంత్రి నరేంద్రమోదీ మన జిల్లాకు వస్తున్నారు.. ఆయనను చూడాలి.. స్ఫూర్తి మాటలు వినాలన్నా సంకల్పంతో నేను సైతం అంటూ.. వెల్లువలా ప్రజలు తరలివచ్చారు. రాగమయూరి గ్రీన్‌హిల్స్ జనతోటగా మారింది. ఆనాడు రాజకీయాలకు అతీతంగా ఎన్టీఆర్‌ను చూడాలని స్వచ్ఛందంగా ప్రజలు ఎలా తరలివచ్చారో.. గురువారం జరిగిన ప్రధాని మోదీ సభకు కూడా అదేవిధంగా తరలిరావడం కొసమెరుపు. మొత్తం మీద ప్రధాని సభకు 3.50 లక్షల నుంచి 4 లక్షల దాకా ప్రజలు వచ్చి ఉంటారని అంచనా. జనవెల్లువను చూసి ఆనాటి నందమూరి తారకరామారావు చైతన్య రథయాత్ర, సింహాగర్జన సభలను గుర్తు చేసుకుంటున్నారు. సూపర్ జీఎస్టీ-సూపర్ సక్సెస్ సభ సూపర్ హిట్ కావడంతో కూటమి నేతల్లో జోష్ నింపింది.
నాడు ఎన్టీఆర్: 1983లో తెలుగుదేశం పార్టీ స్థాపించి చైతన్య రథయాత్ర పేరిట ఎన్టీఆర్ జనం ముంగిటకు వచ్చారు. ఆనాడు ఎన్టీఆర్ సైతం శ్రీశైలం నుంచి ఉమ్మడి కర్నూలు జిల్లా పర్యటనకు శ్రీకారం చుట్టారు. శ్రీశైల జ్యోతిర్లింగం, శక్తిపీఠ క్షేత్రాలు దర్శించుకొని మల్లికార్జునస్వామి, భ్రమరాంబికాదేవికి ప్రత్యేక పూజులు నిర్వహించి చైతన్య రథం ఎక్కారు. ఆత్మకూరు, నండికొట్కూరు మీదుగా కర్నూలు నగరం చేరుకున్నారు. ఎన్టీఆర్ రాక కోసం ప్రజలు రోడ్లపైనే రోజుల తరబడి నిరీక్షించారు. అధికారం చేపట్టాక 1983లో పాణ్యంలో నిర్వహించిన రూ.2 కిలో బియ్యం ప్రారంభ సభకు ప్రజా జాతర అయింది. 1992-93 మధ్య కర్నూలులో జరిగిన సింహాగర్జన సభకు మేము సైతం అంటూ జనఉప్పెన ఉరకలేసింది.
నేడు మోదీ: ప్రధాని మోదీ సైతం ఉమ్మడి జిల్లా కర్నూలు జిల్లా పర్యటనను శ్రీశైలం నుంచి మొదలు పెట్టారు. ఢిల్లీ నుంచి కర్నూలు (ఓర్వకల్లు) విమానాశ్రయం చేరుకున్న ఆయన ముందుగా శ్రీశైలం చేరుకున్నారు. శ్రీశైల జ్యోతిర్లింగం, శక్తిపీఠ క్షేత్రాలను దర్శించుకొని ప్రత్యేక పూజలు చేశారు. ఆ అక్కడి నుంచి ప్రత్యేక హెలికాప్టర్‌లో కర్నూలుకు చేరుకున్నారు. జీఎస్టీ 2.0 సంస్కరణల ప్రయోజనాలు ప్రజలకు వివరించేందుకు సూపర్ జీఎస్టీ - సూపర్ సక్సెస్ సభలో పాల్గొన్నారు. ఈ సభకు లక్షలాది ప్రజలు వెల్లువలా తరలివచ్చారు.
కూటమి నేతల్లో సంబరం
జీఎస్టీ 2.0 ఫలాలు ఇంటింటికి చేర్చాలి.. ప్రయోజనాలపై ప్రజల్లో చైతన్యం కలిగించాలనే లక్ష్యంగా సీఎం చంద్రబాబు నేతృత్వంలోని కూటమి ప్రభుత్వం వేర్వేరు థీమ్స్‌తో ప్రచారం కార్యక్రమాలకు శ్రీకారం చుట్టింది. ఇందుకు విద్య, ఐటీ మంత్రి నారా లోకేశ్ నాయకత్వం వహిస్తున్నారు. ఇప్పటికే 98 వేలకు పైగా వివిధ కార్యక్రమాలు నిర్వహించారు. అందులో భాగంగా దేశంలో తొలిసారిగా సూపర్ జీఎస్టీ - సూపర్ సేవింగ్స్ పేరిట కర్నూలులో భారీ బహిరంగ సభ గురువారం నిర్వహించారు. ప్రధాని మోదీ పాల్గొన్న ఈ సభను విజయవంతం చేయడానికి రాష్ట్ర మంత్రులు, టీడీపీ, బీజేపీ, జనసేన అగ్ర నాయకత్వం నాలుగైదు రోజులు జిల్లాలోనే మకాం వేసి ఏర్పాట్లు మొదలు జన సమీకరణ వరకు సమష్టిగా కృషి చేశారు. రాష్ట్ర పాలన, అధికార యంత్రాంగం మొత్తం కర్నూలులోనే వాలిపోయింది. రాగమయూరి గ్రీన్ హిల్స్‌లో దాదాపు 350 ఎకరాల్లో ఏ ఒక్కరికి ఇబ్బంది లేకుండా ఏర్పాట్లు చేశారు. ముఖ్యంగా ఉమ్మడి జిల్లాకు చెందిన మంత్రులు టీజీ భరత్, బీసీ జనార్ధన్‌రెడ్డి, ఎన్‌ఎండీ ఫరూక్, ఎంపీలు, ఎమ్మెల్యేలు, కార్పొరేషన్ల చైర్మన్లు, పార్టీ నాయకులు ఎవరి స్థాయిలో వాళ్లు సభను విజయవంతం చేసేందుకు కృషి చేశారు.
అధికారుల కసరత్తు
కర్నూలులో ‘సూపర్ జీఎస్టీ-సూపర్ సేవింగ్స్’ను కూటమి ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. మూడు లక్షలకుపైగా జన సమీకరణ అంచనాలు వేశారు. 6వ తేది రాత్రి వరకు సభా ప్రాంగణం స్థలం ఎక్కడో కూడా ఎంపిక చేయలేదు. జిల్లా ఇన్‌చార్జి మంత్రి నిమ్మల రామానాయుడు, జిల్లా మంత్రి టీజీ భరత్, ఆర్థిక శాఖ మంత్రి పయ్యావుల కేశవ్, జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎ.సిరి, ఎస్పీ విక్రాంత్ పాటిల్, ఎమ్మెల్యేలు మూడు స్థలాలను పరిశీలించారు. అదే రోజు రాత్రికి రాగమయూరి గ్రీన్‌హిల్స్‌ను ఫైనల్ చేశారు. 14వ తేదీ సాయంత్రానికల్లా సభా ప్రాంగణం ఎస్పీజీ అధికారులకు పూర్తిస్థాయిలో అప్పగించారు. ఎనిమిది రోజులు పదికిపైగా బృందాలుగా ఏర్పడిన అధికారులు పనులను శరవేగంగా ముగించారు.