తెగులు.. దిగులు
ABN , Publish Date - Dec 10 , 2025 | 12:13 AM
పూల తోటలు సాగు చేసిన రైతులకు అడుగడుగునా అవాంతరాలు తప్పడం లేదు. ఓ వైపు తెగుళ్ల బెడద, మరో వైపు తుఫాన్ వర్షాలతో పూల రైతులు అవస్థలు పడుతున్నారు. చాగలమర్రి మండలంలో పూల సాగుకు పెట్టింది పేరు. 1,000 ఎకరాల్లో మల్లెపూల తోటలు, 600 ఎకరాల్లో సన్నజాజి పూల తోటలు సాగు చేశారు. వీటిని పలు మార్కెట్‌లకు విక్రయిస్తారు. ఇక్కడి నుంచి హైదరాబాదు, కర్నూలు, తిరుపతికి తరలిస్తారు.
తగ్గిన జాజి, మల్లెపూల దిగుబడి
ఆందోళనలో రైతులు
చాగలమర్రి, డిసెంబరు 9 (ఆంధ్రజ్యోతి): పూల తోటలు సాగు చేసిన రైతులకు అడుగడుగునా అవాంతరాలు తప్పడం లేదు. ఓ వైపు తెగుళ్ల బెడద, మరో వైపు తుఫాన్ వర్షాలతో పూల రైతులు అవస్థలు పడుతున్నారు. చాగలమర్రి మండలంలో పూల సాగుకు పెట్టింది పేరు. 1,000 ఎకరాల్లో మల్లెపూల తోటలు, 600 ఎకరాల్లో సన్నజాజి పూల తోటలు సాగు చేశారు. వీటిని పలు మార్కెట్‌లకు విక్రయిస్తారు. ఇక్కడి నుంచి హైదరాబాదు, కర్నూలు, తిరుపతికి తరలిస్తారు. అధిక విస్తీర్ణంలో ఆయా గ్రామాల్లో మల్లె తోటలు సాగు చేశారు. పూల సాగు చేసే రైతులు ఎక్కువగా పండుగల సమయంలో లాభాలు గడిస్తారు. ఈ ఏడాది భారీ వర్షాల వల్ల మల్లెపూలు, జాజిపూల దిగుబడి భారీగా తగ్గింది ఎకరాకు 2 కేజీలు కూడా రావడం లేదని రైతులు ఆవేదన చెందుతున్నారు. అధిక వర్షాలు, తెగుళ్ల వల్ల చెట్లు దెబ్బతిని నష్టం వాటిల్లింది. ఉద్యాన పంటలకు అందించే రాయితీ కూడా రావడం లేదని, తోటల వైపు సంబంధిత అధికారులు కన్నెత్తి చూడటం లేదని, తెగుళ్ల నివారణకు సలహాలు ఇవ్వడం లేదని రైతులు వాపోతున్నారు.
తెల్లదోమ, ఎర్రదోమ తెగుళ్ల ప్రభావం
ప్రస్తుతం తోటల్లో తెల్లదోమ, ఎర్రదోమ లాంటి తెగుళ్లు ఆశిస్తున్నాయని రైతులు వాపోతున్నారు. తెగుళ్లతో మల్లె తోటల్లో ఎర్రమొగ్గ ఏర్పడి దిగుబడిపై ప్రభావం చూపుతోంది. వీటి నివారణకు పలుమార్లు మందులు పిచికారీ చేస్తున్నా నియంత్రణ కావడం లేదని రైతులు దిగాలు చెందుతున్నారు.
పంట దిగుబడి చేతికి అందాలంటే 6 విడతలుగా పిచికారీ చేయాల్సి వస్తుందన్నారు. వీటికి రూ.20 వేలు దాకా ఖర్చు వస్తుందని చెబుతున్నారు. ఈ నేపథ్యంలో అందిన పూల దిగుబడి మార్కెట్‌లో విక్రయాలతో సరి చూసుకుంటే లాభాలు ఆశాజనకంగా లేవని పూల రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. రెండు నెలల క్రితం సీజన్ బట్టి మల్లె పూల ధర కిలో రూ.170, జాజిపూలు కిలో రూ.150 పలికాయి. నెలన్నర వ్యవధిలోనే కిలో మల్లెలు రూ.300 వరకు చేరి ఆ తర్వాత రూ.120 ధర పడిపోయింది. ప్రస్తుతం మల్లె పూలు, జాజిపూలు దిగుబడి భారీగా తగ్గింది. ఎకరాకు 2 కేజీలు మాత్రమే దిగుబడి వస్తోందని రైతులు ఆవేదన చెందుతున్నారు. పూలను కోసే కూలీలకు కూలీకి ఇవ్వలేక అవస్థలు పడుతున్నారు. దిగుబడి తక్కువగా ఉండటంతో కేజీ ధర రూ.800 నుంచి రూ.1,000 పలుకుతోంది. ధర ఉన్నా దిగుబడి లేక కూలీ డబ్బులు వచ్చే పరిస్థితి లేదని రైతులు విలపిస్తున్నారు. కూలీలకు కూలీ ఇవ్వలేక కొందరు తోటలను ప్రత్యామ్నాయ పంటలు వేసేందుకు దున్నేస్తున్నారు. మరి కొందరు గొర్రెలకు మేతగా విడిచి పెట్టారు. ఈ ఏడాది దిగుబడి లేక రైతులు నష్టాలపాలవు తున్నారు. ప్రభుత్వం మల్లెతోటలకు రాయితీలు కల్పించి ఆదుకోవాలని కౌలు రైతులు కోరుతున్నారు.
ప్రభుత్వం ఆదుకోవాలి
నాలుగెకరాల్లో మల్లెలు, జాజు లు సాగుచేశా. గుత్త ఎకరాకు రూ.లక్ష. గత నెలలో కేజీ పూలు రూ.170 ధర పలికింది. ప్రస్తుతం దిగుబడి లేక నష్టపోతున్నాం. ఎక రాకు కేజీ పూలు మాత్రమే దిగుబడి వస్తోంది. ప్రభుత్వం స్పందించి ఆదుకోవాలి. షబ్బీర్, రైతు, చాగలమర్రి
దిగుబడి రాక నష్టపోతున్నాం
3 ఎకరాల్లో జాజి, మల్లెపూలు సాగు చేశా. కౌలు రూ.3.50 లక్షలు. భారీ వర్షాలు తెగుళ్ల వల్ల దిగుబడి రాక నష్టపోతున్నాం. కూలీలకు కూడా రావడం లేదు. వర్షాల వల్ల దెబ్బతిన్న తోటలకు పరిహారం అందలేదు. తెగుళ్ల నివారణకు సలహాలు, సూచనలు లేవు. పరిహారం అందించి ఆదుకోవాలి. ఉసేన్‌బాషా, కౌలురైతు, చాగలమర్రి