జగన్ పాపం.. రైతులకు శాపం..!
ABN , Publish Date - Jul 23 , 2025 | 11:34 PM
ఓర్వకల్లు మండలం సోమయాజులపల్లె గ్రామంలో ఓ రైతు 40 ఏళ్ల క్రితం మూడెకరాలు కొనుగోలు చేశారు. అప్పటి ప్రభుత్వ సర్వేయర్‌తో సర్వే చేయించి రిజిస్ట్రేషన్ చేయించుకున్నారు.
ఏడాది దాటినా అన్నదాతలకు తీరని రీసర్వే కష్టాలు
దశాబ్దాలుగా సాగులో.. భూమి కొలతల్లో తేడాలు
జాయింట్ ఎల్‌పీఎంలతో తీవ్ర సమస్యలు
తహసీల్దారు కార్యాలయాల చుట్టూ బాధిత రైతులు
పథకాలను కోల్పోతున్న అర్హులు
ఓర్వకల్లు మండలం సోమయాజులపల్లె గ్రామంలో ఓ రైతు 40 ఏళ్ల క్రితం మూడెకరాలు కొనుగోలు చేశారు. అప్పటి ప్రభుత్వ సర్వేయర్‌తో సర్వే చేయించి రిజిస్ట్రేషన్ చేయించుకున్నారు. నాటి నుంచి వారి అనుభవంలోనే ఉంది. పట్టాదారు పాసు పుస్తకాలు తీసుకున్నారు. గత వైసీపీ ప్రభుత్వ హయాంలో చేసిన రీసర్వేలో 2.40 ఎకరాలే ఉన్నట్లు చూపారు. క్షేత్రస్థాయిలో మూడెకరాలు భూమి ఉన్నా, సర్వేలో 60 సెంట్లు మాయం చేశారు. తేడా ఎందుకొచ్చింది? సరిచేయమని గ్రామ సర్వేయర్, వీఆర్‌వో, తహసీల్దారును అడిగితే పొంతనలేని సమధానాలు చెబుతున్నారు.
వెల్దుర్తి మండం కృష్ణాపురం గ్రామంలో 60 ఏళ్ల క్రితం ప్రభుత్వ భూమిని అసైన్‌మెంట్ చేసి భూమి లేని నిరుపేదలకు డి-పట్టా ఇచ్చారు. అందులో భాగంగానే కురవ మల్లేశ్వరి పేరిట సర్వే నంబరు.557లో 1.74 ఎకరాలు ఇచ్చారు. రీసర్వేలో జాయింట్ ఎల్‌పీఎం నంబరు 1662 కింద ఆమె పేరిట 325 ఎకరాలు ఉన్నట్లు చూపించారు. సర్వే అధికారుల మాయాజాలం వల్ల వ్యవసాయ కూలీ భూమి ఆన్‌లైన్ రికార్డుల్లో మూడు వందల ఎకరాలకు పైగా భూస్వామిగా మారిపోయింది. కొడుకు కూతురుకు రావాల్సిన ‘తల్లికి వందనం’ సాయం రూ.26 వేలు ఖాతాలో జమ కాలేదు.
ఇలా ఒకరిద్దరు కాదు.. జిల్లాలో రీసర్వే జరిగిన గ్రామాల్లో వేలాది మంది బాధితులు ఉన్నారు. గత వైసీపీ ప్రభుత్వం చేసిన రీసర్వే పాపం రైతులకు శాపాలై వెంటాడుతోంది. కష్టజీవులకు అవస్థలు, కష్టాలు మిగిల్చింది. ఐదారుగు రైతులకు చెందిన భూములకు ఒకే ‘జాయింట్ ఎల్‌పీఎం నంబరు’ ఇవ్వడం, ప్రతి రైతు పేరిట మొత్తం భూమిని చూపడంతో ‘తల్లికి వందనం’ అందుకోలేకపోయారు. తాజాగా అననదాత సుభీభవ - పీఎం కిసాన్ సాయం కోల్పోయే పరిస్థితి వచ్చింది. భూ కొలతల్లో భారీ తేడాలు చూపడంలో గ్రామాల్లో న్యాయ సమస్యలు తలెత్తుతున్నాయి. ఇదే అదనుగా భావించిన రెవెన్యూ అధికారులు రికార్డులు సరిచేసే క్రమంలో లంచాల రూపంలో పిండేస్తున్నారు. ఉమ్మడి జిల్లాలో లక్షకు పైగా రీసర్వే బాధిత రైతులు ఉన్న ట్లు అంచనా. ఆ వివరాలపై ‘ఆంధ్రజ్యోతి’ ప్రత్యేక కథనం.
కర్నూలు, జూలై 23 (ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలో నెలకొన్న భూ వివాదాలు పరిష్కరించే లక్ష్యంగా గత వైసీపీ హయాంలో ‘భూముల రీసర్వే’కు శ్రీకారం చుట్టింది. నాడు జగన్ ప్రభుత్వం చేపట్టిన రీసర్వే పాపాలు ఏడాది దాటినా రైతులను వెంటాడుతూనే ఉన్నాయి. ఉమ్మడి కర్నూలు, నంద్యాల జిల్లాల్లో మూడు విడుతల్లో రీసర్వే చేశారు. 48,514 జాయింట్ ఎల్‌పీఎం నంబర్లు పరిధిలో 1,37,979 మంది రైతుల ఖాతాలు ఉన్నాయి. కర్నూలు జిల్లాలో 252 గ్రామాల్లో రీసర్వే చేశారు. 21,588 జాయింట్ ఎల్‌పీఎం నంబర్లు పరిధిలో 61,817 రైతుల ఖాతాలున్నాయి. 1907లో అప్పటి బ్రిటీష్ ప్రభుత్వం భూములు రీసర్వే చేసింది. భూమి రికార్డులు, విస్తీర్ణానికి సంబంధించి పక్కా వివరాలతో రీ-సెటిల్‌మెంట్ రిజిస్టర్(ఆర్‌ఎస్‌ఆర్)ను రూపొందించింది. స్వాతంత్య్రం అనంతరం భూముల క్రయవిక్రయాలు, అన్నదమ్ముల విభాగాలు దృష్ట్యా సరిహద్దుల మార్పు జరిగాయి. వాటిని సరి చేస్తూ 1979లో భూమి హక్కులు, యాజమాన్య వివ రాలతో రికార్డ్ ఆఫ్ రైట్స్ (ఆర్‌వోఆర్) తీసుకొచ్చింది. భూము లకు సంబంధించిన కీలకపత్రం ఇది. ఒక సర్వే నంబరులో ఎంత భూమి ఉంది..? యాజమాన్యం హక్కులు ఎవరి పేరిట ఉన్నాయి..? కచ్చితంగా చెప్పే రికార్డు ఇది. గత వైసీపీ ప్రభుత్వం హయాంలో భూ వివాదాలు పరిష్కారం పేరిట రీసర్వేకు శ్రీకారం చుట్టింది. అయితే రీసర్వేలో ఆర్‌వోఆర్‌కు బదులుగా బ్రిటీష్ కాలం నాటి ఆర్‌ఎస్‌ఆర్ రికార్డులను పరిగణలోకి తీసుకోవడం, గ్రామ సచివాలయ సర్వేయర్లకు రీసర్వేపై సరైన అవగాహన లేకపోవడం వెరసి తప్పుల తడకగా మారింది. ముఖ్యంగా దశాబ్దాల కాలంగా అమలులో ఉన్న సర్వే నంబర్ల స్థానంలో జాయింట్ ల్యాండ్ పార్సిల్ మ్యాప్ (ఎల్‌పీఎం)లను తీసుకొచ్చారు. 118 ఏళ్ల నాటి ఆర్‌ఎస్‌ఆర్ రిజిస్టర్ ప్రకారం సర్వే నంబరు స్థానంలో జాయింట్ ఎల్‌పీఎం నంబరు ఇవ్వడంతో సమస్యలు తలెత్తా యి. ఉదాహరణకు.. నాడు ఓ రైతుకు ఓ సర్వే నంబరులో 25 ఎకరాలు ఉంటే, వారసత్వంగానో, క్రయవిక్రయాల వల్లనో ప్రస్తుతం ఐదారుగు రైతుల పేరిట మారింది. సబ్ డివిజన్ పరిగణలోకి తీసుకోకుండా మొత్తం 25 ఎకరాలకు ఒకే జాయింట్ ఎల్‌పీఎం నంబరు ఇచ్చారు. దీంతో భూమి లేకపోవడంతో పాటు ఉన్న ప్రభుత్వ పథకాలు సైతం అందకుండాపోతున్నాయి.
ఆందోళనలో బాధిత రైతులు
జిల్లాలో ఫేజ్-1 కింద 67 గ్రామాల్లో 1,25,260.98 ఎకరాలు, ఫేజ్-2 కింద 21 గ్రామాల్లో 73,060.05 ఎకరాలు, ఫేజ్-3 కింద 164 గ్రామాల్లో 5,37,180.28 ఎకరాలు కలిపి 252 గ్రామాల్లో 7,45,501.316 ఎకరాలు రీసర్వే చేశారు. 61,817 మంది రైతుల ఖాతాలకు 21,588 జాయింట్ ఎల్‌పీఎం నంబర్లు ఇచ్చారు. సర్వే నంబరు స్థానంలో జాయింట్ ఎల్‌పీఎం నంబర్లు తీసుకురావడం, ఐదారుగురు రైతుకు ఒకే ఎల్‌పీఎం నంబరు ఇవ్వడంతో సమస్యలు చుట్టిమట్టాయి. ఒక ఎల్‌పీఎం నంబరులో ఐదురుగురు రైతులకు 25 ఎకరాలు ఉంటే, ఏ రైతు పేరిట ఎంత భూమి ఉందో అంతే చూపాలి. ఇందుకు విరుద్ధంగా మొత్తం రైతులకు 25 ఎకరాలు చొప్పున వారి పేరిట చూపిచడం వల్ల అర్హులు కూడా సంక్షేమ పథకాలకు అనర్హులు అవుతున్నారు. క్షేత్రస్థాయిలో ఉన్న భూమి విస్తీర్ణం కంటే ఎక్కువ తక్కువలు రికార్డుల్లో చూపడం వల్ల గ్రామాల్లో న్యాయపరమైన సమస్యలు ఉత్పన్నం అవుతున్నాయి.
రికార్డులు సరి చేసేందుకు మామూళ్లు..!
రీసర్వే వల్ల తలెత్తిన సమస్యను పరిష్కరించమని బాధిత రైతులు వీఆర్‌వోలు, గ్రామ సచివాలయ సర్వేయర్లు, తహసీల్దారు కార్యాలయాల చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నారు. చేసిన తప్పులు సరిచేయాల్సిన రెవెన్యూ అధికారులు ఇది తన పరిధిలో లేదు.. సబ్ కలెక్టర్/ఆర్డీవో, జాయింట్ కలెక్టర్ (జేసీ) పరిధిలో ఉందంటూ కాలయాపన చేస్తున్నారు. కుటుంబ అవసరాల కోసం భూములు అమ్ముకున్న భూములకు రిజిస్ట్రేషన్లు జరగక, అధికారుల తప్పిదం వల్ల ఎక్కువ భూమి చూపిచడంతో తల్లికి వందనం, అన్నదాత సుఖీభవ.. వంటి సంక్షేమ పథకాల వర్తించక న్యాయం కోసం ఆఫీసులకు వెళ్తే.. ఇదే అదనుగా వేలు, లక్షల రూపాయలు ఇవ్వాలంటూ లంచం రూపంలో డిమాండ్ చేస్తున్నారు. జగన్ ప్రభుత్వంలో రీసర్వే సమస్యలు తలెత్తాయి. కూటమి ప్రభుత్వం వస్తే ఈ కష్టాలు తీరుతాయని భావిస్తే, ఏడాది గడిచినా కష్టాలు కన్నీళ్లు పెట్టిస్తున్నాయే తప్పా పరిష్కారం చేయడం లేదు.
పాలకుల పాపాలు.. పథకాలకు శాపాలు..
రీసర్వేలో జరిగిన లోపాల వల్ల రైతులు సంక్షేమ పథకాలకు దూరం అవుతున్నారు. లేని భూమిని ఉన్నట్లు రికార్డుల్లో చూపడంతో జిల్లాలో దాదాపు 45 వేల మందికి పైగా ‘తల్లికి వందనం’ సాయం అందక ఆఫీసుల చుట్టూ తిరుగుతున్నారు. తాజాగా అన్నదాత సుఖీభవ - పీఎం కిసాన్ యోజన సాయంపై కూడా అనుమానాలు ఉన్నాయి. ఉమ్మడి కర్నూలు, నంద్యాల జిల్లాలో 8.65 లక్షల మంది రైతులు ఉన్నారు. వారిలో అన్నదాత సుఖీభవకు 6.28 మందిని అర్హులుగా గుర్తించారు. మరో 2 లక్షల మంది అర్హత ఉన్నా వివిధ కారణాలతో పెండింగులో పెట్టారు. రీసర్వే లోపాల వల్లే ఈ పరిస్థితి వచ్చిందని, అన్నదాత సుఖీభవ సాయం రూ.20 వేలు కోల్పోవాల్సి వస్తుందని రైతులు ఆందోళన చెందుతున్నారు.
వాస్తవాలు కొన్ని
కోడుమూరు మండలంలో ఐదు గ్రామాల్లో రీసర్వే చేశారు. జాయింట్ ఎల్‌పీఎం నంబర్లు వల్ల లేనిభూమిని ఉన్నట్లు చూపడం, కొలతల్లో తేడాలతో న్యాయం చేయాలంటూ 4,908 బాధితులు తహసీల్దారు కార్యాలయం చుట్టూ తిరుగుతున్నారు. సి.బెళగల్ మండలంలో రీసర్వే చేసిన గ్రామాల్లో 55-60 శాతం మంది రైతులు బాధితులే.
ఆదోని మండలంలో 46 రెవెన్యూ గ్రామాలు ఉన్నాయి. 28 గ్రామాల్లో రీసర్వే చేస్తే, జాయింట్ ఎల్‌పీఎం, భూమి కొలతల్లో తేడాలు వంటి సమస్యలతో 878 ఫిర్యాదులు చేశారు. 278 పరిష్కరించినట్లు అధికారులు చెబుతున్నారు. 600 సమస్యలు పెండింగ్‌లో ఉన్నాయి. రికార్డులకు ఎక్కని ఫిర్యాదులు వేలల్లో ఉన్నాయని ఓ వీఆర్‌వో పేర్కొనడం కొసమెరుపు.
ఎమ్మిగనూరు మండలంలో 20 రెవెన్యూ గ్రామాలు ఉంటే 16 గ్రామాల్లో రీసర్వే చేశారు. ఇక్కడ 274 ఫిర్యాదులు రాగా, 166 పరిష్కరించామని అధికారులు చెబుతున్నారు. వీఆర్‌వోలు, గ్రామ సచివాలయ సర్వేయర్ల వద్ద మగ్గుతున్న సమస్యలు రెట్టింపు ఉన్నాయని అంచనా.
ఆలూరు మండలం తుంబబీడు, కమ్మరచేడు, ముద్దనగేరి, కురువల్లి, కరిడిగుడ్డం, మరకట్టు గ్రామాల్లో రీ సర్వే చేశారు. జాయింట్ ఎల్‌పీఎం సమస్యలతో 700 మంది రైతులు అన్నదాత సుఖీభవకు అనర్హులు అయ్యారు.
రీసర్వే జరిగిన ప్రతి గ్రామంలోనూ ఇలాంటి సమస్యలే రైతులను వెంటాడుతున్నాయి. ప్రత్యేక డ్రైవ్ కార్యక్రమం నిర్వహించి రీసర్వే సమస్యలు పరిష్కరించాలని రైతులు కోరుతున్నారు.